
ఎర్విన్ అజేయ శతకం
శ్రీలంక పర్యటనలో జింబాబ్వే జట్టు తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూనే ఉంది.
∙ జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ 344/8
∙ శ్రీలంకతో తొలి టెస్టు
కొలంబో: శ్రీలంక పర్యటనలో జింబాబ్వే జట్టు తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ జట్టు తొలి టెస్టులోనూ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. క్రెయిగ్ ఎర్విన్ (238 బంతుల్లో 151 బ్యాటింగ్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతోచెలరేగడంతో లంకతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు ముగిసేసరికి 90 ఓవర్లలో 8 వికెట్లకు 344 పరుగులు సాధించింది.
70 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన స్థితిలో ఎర్విన్ తన అసమాన ఆటను చూపెట్టాడు. సికిందర్ రజా (47 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఐదో వికెట్‌కు 84 పరుగులు జత చేసి జట్టును ఆదుకున్నాడు. 146 బంతుల్లో కెరీర్‌లో రెండో సెంచరీ చేసిన ఎర్విన్ ఈ క్రమంలో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు (146)ను కూడా అధిగమించాడు. ప్రస్తుతం క్రీజులో ఉన్న ట్రిపానో (45 బంతుల్లో 24 బ్యాటింగ్; 4 ఫోర్లు), ఎర్విన్ మధ్య ఇప్పటికే తొమ్మిదో వికెట్‌కు 62 పరుగులు జత చేరాయి. హెరాత్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.