బేసి... సరి అయినప్పుడు! 

Coalition of Mumbai Indians is a secret secret - Sakshi

సమష్టి తత్వం ముంబై ఇండియన్స్‌ విజయ రహస్యం  

సాక్షి క్రీడావిభాగం : ముంబై ఇండియన్స్‌ పేసర్‌ అల్జారి జోసెఫ్‌ ఈ సీజన్‌లో కేవలం 3 మ్యాచ్‌లు ఆడి గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. నిబంధనల ప్రకారం జట్టు నుంచి వెళ్లిపోయాక అతని గాయం సమస్య సొంత బాధ్యత లేదా వెస్టిండీస్‌ బోర్డు చూసుకోవాలి. కానీ ముంబై ఇండియన్స్‌ అలా చేయలేదు. తమ సొంత ఖర్చులతో జోసెఫ్‌ పూర్తిగా కోలుకునే వరకు ముంబైలోనే ఉంచి చికిత్స చేయించేందుకు సిద్ధమైంది. ముంబై టీమ్‌ సంస్కృతి గురించి ఎవరైనా మాట్లాడితే ఇలాంటి ఉదాహరణలు బోలెడు. నీకు ఏ లోటు రాకుండా చూస్తాం... మాకు విజయాలు అందించు చాలు అనేది ముంబై టీమ్‌లో మాత్రమే కనిపించే తత్వం. అందుకే చాలా మంది వేలం నుంచి కూడా ఆ టీమ్‌లో ఉండాలని కోరుకుంటారు. చివరి వరకు కూడా ఓటమి అంగీకరించకుండా పోరాడే గుణం ముంబై ఆటగాళ్లలో తరచుగా కనిపిస్తోంది. అది కూడా ఏ ఒక్కరో కాకుండా సమష్టి తత్వంతో ఆ జట్టు వరుసగా టైటిల్స్‌ సాధిస్తోంది.  

తలా ఓ చేయి... 
ఈ సీజన్‌కు వచ్చేసరికి ట్రోఫీ విజయాన్ని ఏ ఒక్కరికో ఆపాదించలేం. సరిగ్గా చెప్పాలంటే అందరూ ఒక్కో మ్యాచ్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఎప్పటిలాగే ఆరంభంలో పరాజయాలతో మొదలు పెట్టిన ముంబై అనూహ్యంగా దూసుకుపోయి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడం ఆశ్చర్యకరం. కేవలం 2 అర్ధసెంచరీలతో మొత్తం 405 పరుగులు చేయడం రోహిత్‌ స్థాయి ప్రదర్శన కాదు. అయినా సరే జట్టుకు అది సమస్యగా మారలేదు. డి కాక్‌ నాలుగు అర్ధసెంచరీలు సహా 529 పరుగులతో టీమ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ క్వాలిఫయర్‌లో తన క్లాస్‌ చూపించగా, హార్దిక్‌ పాండ్యా ఏకంగా 192 స్ట్రైక్‌రేట్‌తో 402 పరుగులు చేయడం ముంబై విజయంలో కీలకంగా మారిందని చెప్పవచ్చు. పొలార్డ్‌ ఒకే ఒక అర్ధసెంచరీ చేసినా అది అవసరమైన మ్యాచ్‌లో జట్టును గెలిపించింది. ఇప్పుడు ఫైనల్లో అతని ఆట మళ్లీ ముంబై తమ జట్టుతోనే కొనసాగించేందుకు కారణంగా మారనుంది. టీమ్‌నుంచి ఒక్క సెంచరీ కూడా నమోదు కాకపోవడం విశేషం. బౌలింగ్‌లో బుమ్రా, రాహుల్‌ చహర్‌ చెరో 19, 13 వికెట్లు తీసి కీలకంగా మారారు. మలింగ భారీగా పరుగులిచ్చినా ఫైనల్‌ తరహాలో అసలు సమయంలో తన సత్తా ప్రదర్శిస్తూ తనపై మేనేజ్‌మెంట్‌ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సమష్టి ఆటతో పాటు మొత్తంగా రోహిత్‌ వ్యూహాలు ముంబైని మహాన్‌గా నిలిపాయి.మరోవైపు కేవలం ధోని బ్యాటింగ్, అతని కెప్టెన్సీనే నమ్ముకున్న చెన్నై చివరి మెట్టుపై కుప్పకూలింది. ధోని రనౌట్‌ కాకపోతే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో కానీ మొత్తంగా ఆరంభం నుంచి వారికి సమస్యగా ఉన్న బ్యాటింగ్‌ చివరకు కొంప ముంచింది. చెన్నై అసలు పోరులో మాత్రం బలమైన ప్రత్యర్థి ముందు నిలవలేక చివరకు 0–4తో ముంబైపై ఓడి సీజన్‌ ముగించింది.    

రోహిత్‌ పగ్గాలు చేపట్టాక... 
జంబో జెట్‌ టీమ్, భారీ హంగామా, అంబానీల అండాదండా ఉన్నా ఐపీఎల్‌ తొలి ఐదు సీజన్లలో ముంబై టైటిల్‌ గెలవలేకపోయింది. సచిన్‌ టీమ్‌లో ఉన్నా, పాంటింగ్‌ లాంటి దిగ్గజం కెప్టెన్‌గా వచ్చినా ఆ తర్వాత కూడా  రాత మారలేదు. కానీ 2013లో రోహిత్‌ శర్మ నాయకుడిగా వచ్చి టీమ్‌ను మార్చేశాడు. అంతకుముందుతో పోలిస్తే ఒక్కసారిగా ముంబై టీమ్‌ మారిపోయినట్లుగా కనిపించింది. అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత్‌కు పరిమిత సంఖ్యలోనే కెప్టెన్సీ అవకాశాలు వచ్చినా... ఐపీఎల్‌లో మాత్రం తన నాయకత్వ లక్షణాలతో రోహిత్‌ వరుస విజయాలు అందించాడు. 2013, 2015, 2017 లతో పాటు ఇప్పుడు 2019లో బేసి సంవత్సరాల్లో టైటిల్‌ సాధించి కొత్త ఘనతను సృష్టించాడు. ఇందులో మూడు సార్లు ధోని నాయకత్వంలోని చెన్నైపై... మరో మ్యాచ్‌లో ధోని సభ్యుడిగా ఉన్న టీమ్‌పై గెలవడం ముంబై స్థాయిని చూపిస్తోంది. 2017లో పుణేతో జరిగిన ఫైనల్లో 129 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోగలగడం కూడా రోహిత్‌ వల్లే సాధ్యమైంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top