ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పాల్గొనే విషయాన్ని మే 7న తేల్చుతామని బోర్డు కొత్త పరిపాలక కమిటీ
సీఓఏ చీఫ్ వినోద్ రాయ్
ముంబై: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పాల్గొనే విషయాన్ని మే 7న తేల్చుతామని బోర్డు కొత్త పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ స్పష్టం చేశారు. వచ్చే నెల 7న జరిగే బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎమ్)లో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఐసీసీ ఈవెంట్ కోసం జట్టు ప్రకటనకు ఇది వరకే (ఈ నెల 25) తుదిగడువు ముగిసినప్పటికీ బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు జట్టును ఎంపిక చేయలేదు.
ఐసీసీలో బిగ్–3 ఫార్ములాకు చుక్కెదురవడంతో ఈవెంట్ నుంచి తప్పుకుంటారా అన్న ప్రశ్నకు రాయ్ సమాధానమిస్తూ ‘దాన్ని ఇప్పుడే ఎలా చెప్పగలను. అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. ఎస్‌జీఎమ్‌లో బోర్డు ఉన్నతాధికారులంతా కలిసి దీనిపై చర్చించాకే నిర్ణయం తీసుకుంటారు. అంతే తప్ప అదేదీ జరగకముందే ముందస్తుగా చెప్పడం వీలు కాదు’ అని అన్నారు.