1950.. ఏ ఫుట్‌బాల్‌ స్టోరీ..

Bharath Foot Ball Team Special Story - Sakshi

1956 నవంబర్‌ 29.. మధ్యాహ్నం 12గంటలు..

హైదరాబాద్‌ నగరమంతా నిర్మానుష్యంగా మారింది. ప్రజలందరూ రేడియోల దగ్గర కూర్చున్నారు. మ్యాచ్‌ ఆరంభమైంది.. కామెంట్రీ ప్రారంభమైంది. సిటీజనుల్లో ఒకటే ఉత్కంఠ.. ఎటు చూసినా ‘భారత్‌ జీతేగా..
ఆస్ట్రేలియా హరేగా’ నినాదాల హోరు. ఇదంతా ఏదో క్రికెట్‌ మ్యాచ్‌ గురించి అనుకుంటే పొరపాటే. భారత ఫుట్‌బాల్‌ టీమ్‌ 1956లో మెల్‌బోర్న్‌లో జరిగినఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాతో తలబడినప్పటివిషయమిది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 4–2తోఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఒలింపిక్స్‌లోనాలుగో స్థానంలో నిలిచింది. 

సాక్షి, సిటీబ్యూరో : ఇదంతా చదివితే నిజమేనా అనిపిస్తుంది కదూ! అవును అక్షరాల నిజమే... ఒకప్పుడు నగరం సాకర్‌ ఫీవర్‌లో ఉర్రూతలూగింది. 1950–70 వరకు సిటీలో ఫుట్‌బాల్‌కు మంచి ఆదరణ లభించింది. దీనికి కారణం.. భారత ఫుట్‌బాల్‌ టీమ్‌లో నగర ఆటగాళ్లు కీలక పాత్ర పోషించడం. స్వాతంత్య్రానంతరం ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ ఏర్పాటులో హైదరాబాద్‌ ప్లేయర్లు ముఖ్య భూమిక పోషించారు. ఆ రోజుల్లో భారత ఫుట్‌బాల్‌ టీమ్‌ మ్యాచ్‌ జరుగుతుందంటే... నగరంలో ఓ పండుగలా ఉండేది. మనం గెలిస్తే ఒకరికొకరు స్వీట్లు పంచుకొని, శుభాకాంక్షలు తెలిపుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోయినా... ఫిఫా వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో సిటీ ఫుట్‌బాల్‌ ప్రస్థానాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం.

మనమే టాప్‌...  
అప్పట్లో నగర ప్రజలు ఫుట్‌బాల్‌పై యమ క్రేజ్‌ చూపించారు. మన టీమ్‌ ఏ మ్యాచ్‌ ఆడినా రేడియోలకు అత్తుకుపోయేవారు. 1948 నుంచి 1960 వరకు ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌లో నగర ఆటగాళ్లు ఎంతోమంది పాలుపంచుకున్నారు. ముఖ్యంగా ఏఎస్‌ హకీం, యూసుఫ్‌ఖాన్, నూర్‌ మహ్మద్, ఎస్‌కే అజీజుద్దీన్, అహ్మద్‌ హుస్సేన్, బల్‌రాం, మహ్మద్‌ జులుఫెఖారుద్దీన్, ఎస్‌ఏ లతీఫ్‌ ఉన్నారు. హైదరాబాదీ కోచ్‌ అబ్దుల్‌ రహీం నేతృత్వంలో 1956 ఒలింపిక్స్‌లో పాల్గొన్న జట్టులో 11 మంది ఆటగాళ్లకు గాను 8మంది మనోళ్లే. 1962లో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌ మొదలు 1964లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌ వరకు కూడా ఇండియన్‌ టీమ్‌లో నలుగురు హైదరాబాదీలు ఉన్నారు.

దారుషిఫా... ఘన చరిత్ర  
పాతబస్తీలోని దారుషిఫా మైదానంతో భారత్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌కు ఎంతో అనుబంధం ఉంది. ఈ మైదానం కుతుబ్‌షాహీల కాలం నుంచే ఉంది. ఇక్కడ ఆసఫ్‌జాహీల పాలనా కాలంలో వివిధ రకాల ఆటలు జరిగేవని చరిత్రకారులు చెబుతారు. అయితే ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ హయాం నుంచి ఇక్కడ ఫుట్‌బాల్‌ ప్రారంభమైంది. ఇందులో ఫుట్‌బాల్‌ ఆడే స్థానిక యువత అబ్బాస్‌ యూనియన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఏర్పాటు చేసుకున్నారు. అది అప్పటి నుంచి ఏయూఎఫ్‌సీగా గుర్తింపు పొందింది. ఈ మైదానంలో శిక్షణ పొందిన ఎంతోమంది ఆటగాళ్లు ఇండియన్‌ టీమ్‌లో ఆడారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న షబ్బీర్‌ అలీ భారత ఫుట్‌బాల్‌ టీమ్‌ కెప్టెన్‌గా పదేళ్లు వ్యవహరించారు.

రెండు గోల్డ్‌ మెడల్స్‌...  
1951 భారత్‌లో, 1962 జకార్తాలో జరిగిన ఏసియన్‌ గేమ్స్‌లో భారత ఫుట్‌బాల్‌ టీమ్‌ బంగారు పతకాలు సాధించింది. ఈ రెండు టోర్నమెంట్లలోనూ హైదరాబాద్‌ ఆటగాళ్లు కీలకపాత్ర పోషించారు. 1960 ఆగస్టులో రోమ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత టీమ్‌ ఫ్రాన్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో 1–1 మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. కేవలం ఒక్క పైంట్‌ తేడాతో భారత్‌ సెమీస్‌లో ఆడలేకపోయింది. తిరిగి 1970 బ్యాంకాక్‌లో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో మన టీమ్‌ కాంస్య పతకం గెలుచుకుంది. 1970 తర్వాత ఫుట్‌బాల్‌ టీమ్‌ ప్రాభవం కోల్పోయిందని భారత మాజీ ఆటగాడు హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ అలీమ్‌ఖాన్‌ తెలిపారు.  

నాకు గర్వకారణం...  
నేను దాదాపు పదేళ్లు ఇండియన్‌ కెప్టెన్‌గా సేవలందించాను. దారుషిఫా మైదానంలోనే శిక్షణ తీసుకున్నాను. ఏయూఎఫ్‌సీ ఆటగాడిగా ఇది నాకెంతో గర్వకారణం. ప్రస్తుతం ఏయూఎఫ్‌సీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. 1974లో ఇండియన్‌ టీమ్‌లో చేరి 1990 వరకు ఆటగాడిగా, కోచ్‌గా, సలహాదారుడిగా వ్యవహరించాను. బెంగాల్, గోవా రాష్ట్రాల టీమ్‌లకు కోచ్‌గా పనిచేశాను. ఫుట్‌బాల్‌కు ఆదరణ తగ్గిందని అందరూ అంటున్నారు. అయితే నాటి రోజులు మళ్లీ వస్తాయి. మనం దీనిపై ఎంత శ్రద్ధ వహిస్తున్నామో గ్రహించాలి. మనం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఆనాటి విజయాలు రావడం అసాధ్యమేమీ కాదు.  
– షబ్బీర్‌ అలీ, మాజీ కెప్టెన్, భారత ఫుట్‌బాల్‌ టీమ్‌

అది ఫుట్‌బాల్‌ యుగం..  
స్వాతంత్య్రానంతరం ఏర్పడిన ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌లో మన నగరం కీలక పాత్ర పోషించింది. ఆ టీమ్‌లో మనోళ్లే దాదాపు 8మంది ఉన్నారంటే.. అప్పుడు నగరంలో ఫుట్‌బాల్‌పై ఉన్న క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 1956, 1960 ఒలింపిక్స్‌ గేమ్స్‌లో మన టీమ్‌ నాలుగో స్థానం సాధించిందంటే ఆటగాళ్ల ప్రతిభ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అప్పట్లో బలమైన టీమ్‌లైన ఫ్రాన్స్, ఇతర యూరోపియన్‌ జట్లకు మన్నోళ్లు ముచ్చెమటలు పట్టించారు. అయితే నేడు మన టీమ్‌ పరిస్థితి దిగజారిపోయింది.  – అలీంఖాన్, మాజీ ఆటగాడు    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top