టీమిండియాను ఓడించడానికి ఇదే చాన్స్‌: వీవీఎస్‌

Best Chance For Bangladesh To Upset India Laxman - Sakshi

న్యూఢిల్లీ: వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత క్రికెట్‌ జట్టును ఓడించడానికి బంగ్లాదేశ్‌కు ఇదే మంచి అవకాశమని మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ బలాన్ని నిరూపించుకోవడానికి మూడు టీ20ల సిరీస్‌ ఒక చాన్స్‌ని, భారత్‌ను ఓడించాలంటే ఇంతకంటే మంచి అవకాశం రాదన్నాడు. ‘ ఆతిథ్య జట్టును ఓడించాలంటే పర్యాటక జట్టు బంగ్లాదేశ్‌కు ఇదే మంచి అవకాశం. భారత్‌ను భారత గడ్డపై ఓడించే చక్కటి చాన్స్‌. బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ బలంగా ఉంది. బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌లో రాణిస్తే భారత్‌కు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఇక బంగ్లాదేశ్‌కు బలహీనం ఏదైనా ఉందంటే అది బౌలింగ్‌ యూనిటే. ముస్తాఫిజుర్‌ రహ్మన్‌తో పాటు కొద్దిపాటు బౌలింగ్‌ మాత్రమే వారికి ఉంది. స్పిన్‌ విభాగంలో ఆ జట్టు బలంగా లేదు. టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌ తరఫున ముస్తాఫిజుర్‌ కీలక పాత్ర పోషించాల్సిన  అవసరం ఉంది.

భారత జట్టులో విరాట్‌ కోహ్లి లేడు. దాంతోపాటు మిడిల్‌ ఆర్డర్‌లో కూడా భారత్‌ జట్టు అనుభవ లేమి కనబడుతోంది. ఇక భారత్‌ విజయాల్లో ముఖ్య భూమిక పోషించడానికి యువ క్రికెటర్లు సిద్ధం కావాలి. వాషింగ్టన్‌ సుందర్‌, చహల్‌లు భారత బౌలింగ్‌ యూనిట్‌లో కీలకం కానున్నారు. టీ20 సిరీస్‌కు సన్నద్ధమైన వేదికలు స్పిన్‌కు ఎక్కువ అనుకూలించే అవకాశాలున్నాయి. చహల్‌ మూడు మ్యాచ్‌లు కచ్చితంగా ఆడే అవకాశం ఉంది. కొంతమందికి విశ్రాంతి ఇవ్వడం వల్ల చహల్‌ మూడు టీ20ల సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లో ఆడతాడనే ఆశిస్తున్నా. కృనాల్‌ పాండ్యా వంటి యువ క్రికెటర్లకు ఇదొక మంచి అవకాశం. భారత్‌ 2-1 తేడాతో గెలుస్తుందనే అనుకుంటున్నా’ అని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. మూడు టీ20ల సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌లు తప్పిస్తే మిగతా వారంతా దాదాపు యువ క్రికెటర్లే. ఈ సిరీస్‌కు సీనియర్లకు విశ్రాంతినిచ్చిన టీమిండియా.. యువ క్రికెటర్లను పరీక్షించాలనే క్రమంలో అందకు తగినట్టే ఎంపిక చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top