ఇది సానుకూల మలుపు

BCCI under the NADA welcomes sports ministers - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా డోపింగ్‌ విషయంలో జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) పరిధిలోకి రావడాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్వాగతించారు. క్రీడల్లో పారదర్శకత కోసం ఇది కీలక మలుపు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఎలాంటి అంశాలు, సమస్యలు అపరిష్కృతంగా ఉండాలని నేను కోరుకోవడం లేదు. విభేదాలన్నీ పరస్పర చర్చలతో పరిష్కరించుకోవాలి. నేను క్రీడలు, క్రీడాకారుల మేలు కోరేవాడిని. వాటిలో అన్నీ పారదర్శకంగా జరగాలని భావిస్తా’ అని రిజిజు అన్నారు. మరోవైపు క్రీడా శాఖతో చర్చల కోసం బోర్డు సీఈఓ రాహుల్‌ జోహ్రిని పంపడాన్ని బీసీసీఐ సీనియర్‌ సభ్యులు ఒకరు తప్పు పట్టారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ చేర్చాలని ప్రయత్నిస్తున్న ఐసీసీ బృందంలో జోహ్రి కూడా సభ్యుడని... దానికి ఉన్న డోపింగ్‌ అడ్డంకిని తొలగించేందుకే క్రికెట్‌నూ ‘నాడా’లో చేర్చేందుకు జోహ్రి అంగీకరించారని ఆయన విమర్శించారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top