పాండ్యా, రాహుల్‌లకు బీసీసీఐ నోటీసులు

BCCI Ombudsman Sends Notices To Team India Players Pandya And Rahul - Sakshi

సాక్షి, ముంబై: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ కామెంట్స్‌ మరోసారి తెరపైకిరానున్నాయి. కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోకి హాజరైన హార్దిక్, రాహుల్‌.. అమ్మాయిలు, డేటింగ్‌ గురించి వివాదాస్పదంగా మాట్లాడారు. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ పాలకుల కమిటీ ఆ ఇద్దరిపై ఈ ఏడాది జనవరిలో కొద్దిరోజులు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. కానీ.. రెండు వారాల వ్యవధిలోనే ఆ నిషేధాన్ని ఎత్తివేసిన కమిటీ.. బీసీసీఐ అంబుడ్స్‌మన్ నియామకం తర్వాత విచారణ చేపట్టాలని నిర్ణయించింది.
అయితే ఇటీవల సుప్రీంకోర్టు.. బీసీసీఐ అంబుడ్స్‌మన్‌గా డీకే జైన్‌ని నియమించింది. తాజాగా జైన్‌ సారథ్యంలోని కమిటీ హార్దిక్‌, రాహుల్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. దీంతో హార్దిక్‌(ముంబై ఇండియన్స్‌), రాహుల్‌(కింగ్స్‌ పంజాబ్‌)లు ఐపీఎల్‌లో పలు మ్యాచ్‌లు గైర్హాజరీ అయ్యే అవకాశం ఉండటంతో వారు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలతో బీసీసీఐ చర్చిస్తోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే కీలక ఐపీఎల్‌, ప్రపంచకప్‌లకు ముందు ఈ వివాదం మరోసారి తెరలేవడం ఆ ఇద్దరి ఆటగాళ్లకు ఇబ్బంది కలిగించే విషయమే. ఇక బెంగాల్‌ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ సలహాదారుడిగా సౌరవ్‌ గంగూలీ విరుద్ద ప్రయోజనాలకు పాల్పడుతున్నాడన్న ఫిర్యాదుపై కూడా విచారణ కోనసాగుతోందని జైన్‌ తెలిపారు. (చదవండి: వివాదానికి ముందు... వివాదానికి తరువాత...)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top