ఇప్పుడు మ్యాక్స్‌వెల్‌ వంతు..!

ఇప్పుడు మ్యాక్స్‌వెల్‌ వంతు..!


కోహ్లిని అనుకరించిన బ్యాట్స్‌మన్‌  

రాంచీ: భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు వివాదాన్ని పక్కనబెట్టి ఆటపై దృష్టిపెడతారని ఇరు బోర్డుల ఉన్నతాధికారులు గొప్పగా పేర్కొన్నారు. కానీ పెద్దల రాజీకి విరుద్ధంగా వివాదం రేపడం మాకు వెన్నతో పెట్టిన విద్య అన్నట్లు ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తిస్తున్నారు. దీంతో బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీలో ఈ ఆన్‌ఫీల్డ్‌ ‘చిటపటల’కు ఫుల్‌స్టాప్‌ పడేలా లేదు. తాజాగా మూడో టెస్టు మూడో రోజు ఆటలో మ్యాక్స్‌వెల్‌ వెక్కిరింత కాస్త శ్రుతిమించింది. కోహ్లి తొలి రోజు డైవ్‌ చేస్తూ గాయంతో విలవిలలాడిన వైనాన్ని మ్యాక్స్‌వెల్‌ మూడో రోజు ఆటలో విపరీత పోకడతో అనుకరించడం భారత వర్గాల్ని ఆగ్రహానికి గురిచేసింది.


కమిన్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ 81వ ఓవర్లో చతేశ్వర్‌ పుజారా మిడాన్‌లో షాట్‌ కొట్టగా మ్యాక్స్‌వెల్‌ డైవ్‌ చేసి బౌండరీ వెళ్లకుండా చక్కగా ఆపేశాడు. కానీ అంతటితో ఆగకుండా కోహ్లి తొలి రోజు డైవ్‌తో అయిన గాయాన్ని మ్యాక్స్‌వెల్‌ వెకిలిగా అచ్చు అలాగే అనుకరించాడు. గత టెస్టులో కెప్టెన్‌ స్మిత్‌ డీఆర్‌ఎస్‌ అప్పీలుపై డ్రెస్సింగ్‌ రూమ్‌ సంకేతాల కోసం చూడటాన్ని భారత కెప్టెన్‌ కోహ్లి తీవ్రంగా పరిగణించిన సంగతి తెలిసిందే. స్మిత్‌ అంపైర్‌ నిర్ణయ సమీక్ష పద్ధతిని డ్రెస్సింగ్‌ రూమ్‌ సమీక్షగా మార్చేశాడని కోహ్లి విమర్శించాడు. ఇప్పుడు తమ కెప్టెన్‌ (స్మిత్‌) మెప్పుపొందేందుకో మరి వివాదం రేపేందుకో కానీ మ్యాక్స్‌వెల్‌ అనుకరణ మళ్లీ చర్చనీయాంశమైంది.



కోహ్లి చప్పట్లు!

అంతకుముందు ఒకీఫ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 58వ ఓవర్‌ చివరి బంతి పుజారా (21 పరుగుల వద్ద) ప్యాడ్‌లకు తగిలింది. ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీలు చేయగా ఫీల్డ్‌ అంపైర్‌ తిరస్కరించాడు. తిరిగి డీఆర్‌ఎస్‌ కోసం అప్పీలు చేసినప్పటికీ ఆసీస్‌కు చుక్కెదురైంది. దీంతో ఆసీస్‌ రెండో రివ్యూ కూడా వృథాగా పోయింది. డీఆర్‌ఎస్‌లో రెండు సార్లూ ఆసీస్‌ కెప్టెన్‌ స్మిత్‌ విఫలమవ్వడంతో పెవిలియన్‌లో ప్యాడ్‌లు కట్టుకొని కూర్చున్న కోహ్లి ఒక్కసారిగా లేచి బిగ్గరగా చప్పట్లు కొట్టడం గమనార్హం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top