ఆ బాల్‌ వైడ్‌గా ఇచ్చుంటే.. | A ball of 19th over looks like a wide, But not Wide call | Sakshi
Sakshi News home page

ఆ బాల్‌ వైడ్‌గా ఇచ్చుంటే..

Feb 10 2019 4:58 PM | Updated on Feb 10 2019 5:16 PM

A ball of 19th over looks like a wide, But not Wide call - Sakshi

హామిల్టన్‌: ఎక్కడైనా గెలుపు-ఓటములు సహజం. మరి గెలుపు అంచుల వరకూ వచ్చి ఓటమి పాలైతే మాత్రం అది చాలా నిరాశను మిగులుస్తుంది. ఇప్పుడు భారత క్రికెట్‌ పరిస్థితి ఇలానే ఉంది. న్యూజిలాండ్‌లో తొలి టీ20 సిరీస్‌ గెలుద్దామనుకున్న భారత్‌.. దాన్ని అందుకునే ప్రయత్నంలో కడవరకూ పోరాడినా సఫలీకృతం కాలేదు. ఆదివారం కివీస్‌తో జరిగిన సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టీ20లో భారత్ నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమి పాలైంది. ప్రధానంగా చివరి మూడు ఓవర్లలో విజయానికి 48 పరుగులు అవసరమైన సమయంలో భారత్‌ పోరాడిన తీరు అసాధారణం. అప్పుడు క్రీజ్‌లో ఉన్న కృనాల్‌ పాండ్యా, దినేశ్‌ కార్తీక్‌లు చెలరేగి బ్యాటింగ్‌ చేశారు. సౌతీ వేసిన 18 ఓవర్‌లో 18 పరుగులు పిండుకుని స్కోరు బోర్డులో వేగం పెంచారు.

కృనాల్‌ వరుసగా సిక్స్‌, ఫోర్‌, ఫోర్‌ కొట్టడంతో భారత్‌ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. ఆ మరుసటి ఓవర్‌లో కృనాల్‌-దినేశ్‌లు 14 పరుగుల్ని పిండుకోవడంతో చివరి ఓవర్‌కు 16 పరుగులు అవసరమయ్యాయి. భారత్‌ జోడి ఊపును చూసి 16 పరుగుల్ని సాధించడం ఏమంత కష్టం కాదనిపించింది.  సౌతీ వేసిన ఆఖరి ఓవర్‌ తొలి బంతికి రెండు పరుగులు తీసిన కార్తీక్‌.. రెండు బంతికి పరుగులేమీ తీయలేదు. బంతి బాగా ఆఫ్‌ స్టంప్‌కు వేయడంతో దినేశ్‌ కార్తీక్‌ హిట్‌ చేసేందుకు తటపటాయించాడు. అది వైడ్‌ అవుతుందనే ధీమాతో దినేశ్‌ కార్తీక్‌ ఆ బంతిని లైట్ తీసుకున్నాడు. కానీ అంపైర్‌ వైడ్‌ ఇవ్వలేదు. దీనిపై ఫీల్డ్‌ అంపైర్‌ను కార్తీక్‌ అడిగినా నిరాశే ఎదురైంది. ఆ తర్వాత బంతిని కార్తీక్‌ లాంగాన్‌ వైపు కొట్టినా సింగిల్‌ తీయలేదు. క్రీజ్‌ సగం దాటేసిన కృనాల్‌ను వెనక్కి వెళ్లిపోమ్మనే సంకేతాలిచ్చాడు. దాంతో కృనాల్ మళ్లీ నాన్‌ స్ట్రైక్‌ఎండ్‌లోకి వేగం వచ్చేశాడు. దాంతో భారత్‌కు మూడు బంతుల్లో 14 పరుగులు అవసరమయ్యాయి. కానీ నాల్గో బంతిని కార్తీక్‌ సింగిల్‌ తీసి ఇవ్వగా, ఐదో బంతిని కృనాల్‌ సింగిలే తీశాడు. ఇక ఆరో బంతి వైడ్‌ కావడంతో భారత్‌ ఖాతాలో పరుగు చేరగా, కివీస్‌ మరో బంతి వేయాల్సి వచ్చింది. అయితే ఆఖరి బంతిని కార్తీక్‌ సిక్స్‌ కొట్టడంతో భారత్‌ 208 పరుగులు చేసింది.

దాంతో సౌతీ వేసిన ఆఖరి ఓవర్‌ రెండో బంతిపై చర్చకు దారి తీసింది. ఆ బంతిని వైడ్‌గా ఇచ్చి ఉంటే భారత్‌ ఖాతాలో మరో పరుగుతో పాటు మరో బంతి కూడా మిగిలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు ఫలితం మరోలా ఉండటానికి కూడా అవకాశం లేకపోలేదనేది వారి అభిప్రాయం. 

ఇక్కడ చదవండి: మూడో టీ20లో పోరాడి ఓడిన భారత్..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement