
హాంకాంగ్: అగ్రశ్రేణి క్రీడాకారుల గైర్హాజరీలో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆసియా మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం లభించలేదు. సింగపూర్‌తో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–3 తేడాతో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్... డబుల్స్‌లో ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జోడీ గెలిచినా... మిగతా మూడు మ్యాచ్‌ల్లో ఓటమితో భారత్‌కు నిరాశ తప్పలేదు. తొలి మ్యాచ్‌లో అర్జున్–రుతుపర్ణా పండా ద్వయం 16–21, 13–21తో డానీ బవా–తాన్ వె హాన్ జోడీ చేతిలో ఓడింది.
రెండో మ్యాచ్‌లో ప్రణయ్ 21–8, 12–21, 21–17తో కీన్ యెవ్ లోపై గెలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. మూడో మ్యాచ్‌లో అర్జున్–శ్లోక్ జోడీ 21–16, 21–18తో లో కీన్ హెన్–డానీ బవా ద్వయంపై నెగ్గడంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే నాలుగో మ్యాచ్‌లో అష్మిత చాలిహ 21–17, 12–21, 16–21తో యో జియా మిన్ చేతిలో ఓడటంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ఆరతి సారా సునీల్–రుతుపర్ణా జోడీ 24–22, 15–21, 16–21తో పుత్రి సరి దేవిసిత్ర–లిమ్ మింగ్ హుయ్ జంట చేతిలో ఓడటంతో భారత పరాజయం ఖాయమైంది. నేడు చైనీస్ తైపీతో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తేనే నాకౌట్ దశకు చేరుకునే అవకాశముంది.