మరింత బలంగా... మరింత పైపైకి...

Australia Women Cricket Team Celebrate Victory Of ICC T20 WC - Sakshi

మహిళల టి20 ప్రపంచ కప్‌ విజయ గాథ

టోర్నీ సూపర్‌ సక్సెస్‌

మున్ముందు మరింత జోరు  

దాదాపు పదకొండేళ్ల క్రితం 2009లో ఆస్ట్రేలియా మహిళల వన్డే వరల్డ్‌ కప్‌కు ఆతిథ్యమిచ్చింది. సిడ్నీలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్‌కు హాజరైన ప్రేక్షకుల సంఖ్య 12,717 మాత్రమే! ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా టి20 ప్రపంచ కప్‌ జరిగింది. ఆదివారం జరిగిన ఫైనల్‌కు ఏకంగా 86,174 మంది హాజరయ్యారు. స్టేడియంలో కూర్చున్న వారి సంఖ్యనే ఇంత ఉంటే టీవీల్లో, ఇంటర్నెట్‌లో చూసిన వారి గణాంకాలు అయితే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాయి. ప్రపంచకప్‌కు వచ్చిన ఈ భారీ స్పందన చూసి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఈ విజయంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) నిర్వహణ కూడా కీలక పాత్ర పోషించగా... మహిళల క్రికెట్‌కు మరింత జోష్‌ తెచ్చేందుకు ఇదే సరైన సమయంగా ఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారత్‌తో పాటు అన్ని దేశాల్లో మహిళా క్రికెట్‌ మరింతగా దూసుకుపోవడం ఖాయం.

సాక్షి క్రీడా విభాగం: మహిళల క్రికెట్‌లో గతంలో ఎన్నడూ లేని కొత్త ఉత్సాహభరిత వాతావరణం ఇప్పుడు వచ్చేసిందంటే ఆశ్చర్యం కాదు. మెల్‌బోర్న్‌లో ఫైనల్‌ ముగిసిన తర్వాత తాము కూడా రాబోయే టోర్నీని ఇదే స్థాయిలో నిర్వహిస్తామని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ నికెర్క్‌ ప్రకటించింది. టి20లే కాదు మహిళల వన్డేలకు కూడా ఆదరణ పెరుగుతోందని 2017 వరల్డ్‌ కప్‌ చూపించింది. ఈ టోర్నీ తర్వాత వాయు వేగంతో మహిళల క్రికెట్‌ అందరినీ ఆకర్షించింది.

దానికి కొనసాగింపుగానే మెల్‌బోర్న్‌లో ఈ భారీ జనసందోహం! సరిగ్గా ఏడాది తర్వాత జరగనున్న వన్డే వరల్డ్‌ కప్‌ కోసం ఆతిథ్య జట్టు న్యూజిలాండ్‌ ఇప్పటికే చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. అయితే వరల్డ్‌ కప్‌లకే కాకుండా రెండు మెగా టోర్నీల మధ్యలో కూడా అమ్మాయిల ఆటపై ఆసక్తి సన్నగిల ్లకుండా ఐసీసీ ప్రణాళికలు రూపొందిస్తుండటం విశేషం. గతంలో ఎన్నడూ లేని కార్యక్రమాలతో మహిళల క్రికెట్‌కు ఊపు తెచ్చే మార్పులు ఇకపై కూడా కొనసాగడం ఖాయం. వచ్చే ఏడాదిలోగా ప్రపంచవ్యాప్తంగా కనీసం 10 లక్షల మంది అమ్మాయిలు క్రికెట్‌లోకి వచ్చేలా చేయాలనేదే తమ లక్ష్యమని ఐసీసీ ప్రకటించింది.

సుదీర్ఘ ప్రణాళికతో... 
ఏడేళ్ల క్రితం మెల్‌బోర్న్‌ మైదానంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య ‘మహిళల యాషెస్‌’ వన్డే సిరీస్‌ జరిగితే ఆటగాళ్లు, బంధుమిత్రులు తప్ప ఎవరూ లేరు. కానీ వరల్డ్‌ కప్‌ ఆతిథ్య జట్టుగా భారం భుజాన వేసుకున్న తర్వాత ఆసీస్‌ బోర్డు (సీఏ) చురుగ్గా పని చేసింది. ‘ఫిల్‌ ద ఎంసీజీ’ ట్యాగ్‌లైన్‌తో పప్రంచ వ్యాప్తంగా ప్రచారం మొదలు పెట్టి అందరి దృష్టి టోర్నీపై పడేలా చేసింది. ఆతిథ్య జట్టు ప్రదర్శనే ఎప్పుడైనా ఒక టోర్నీ సక్సెస్‌కు కొలబద్దలా పని చేస్తుందనేది వాస్తవం.

అది 2011 (భారత్‌), 2015 (ఆస్ట్రేలియా), 2019 (ఇంగ్లండ్‌) పురుషుల వన్డే వరల్డ్‌ కప్‌లు దీనిని చూపించాయి. సొంత జట్టు సాధారణంగా ఉంటే అభిమానుల్లో ఆసక్తిని తీసుకురావడం కష్టం. అందుకే నిర్వాహక దేశంగానే కాకుండా సొంత మహిళల టీమ్‌పై కూడా సీఏ భారీగా ఖర్చు చేసింది. క్రికెట్‌ను కెరీర్‌గా తీసుకునే మహిళలకు ధైర్యం ఇచ్చేందుకు 2016లో ప్రత్యేకంగా 42 లక్షల 30 వేల డాలర్లు (రూ. 31 కోట్ల 40 లక్షలు) కేటాయించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా తర్వాతి నాలుగేళ్లు సమర్థంగా తమ ప్రణాళికను అమలు చేసింది.

అన్ని రకాల ప్రోత్సాహం... 
మహిళా క్రికెటర్లు ఏ రకమైన అభద్రతాభావానికి గురి కాకూడదని, అప్పుడే కెరీర్‌ను ఎంచుకుంటారనేది అన్ని క్రికెట్‌ బోర్డులు, ఐసీసీ గుర్తించాయి. ఒక్కసారిగా అమ్మాయిల ఆటకు పెరిగిన క్రేజ్‌కు అది కూడా ఒక కారణం. ఈ వరల్డ్‌ కప్‌ టోర్నీ విజేతకు ఐసీసీ 10 లక్షల డాలర్లు (రూ. 7 కోట్ల 41 లక్షలు) ప్రైజ్‌మనీ గా ప్రకటించింది. 2018 వన్డే వరల్డ్‌కప్‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఆస్ట్రేలియా బోర్డు మరో అడుగు ముందుకేసి తమ జట్టు విజేతగా నిలిస్తే 8,85,000 ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 4 కోట్ల 36 లక్షలు) బహుమతిగా ఇస్తామని చెప్పింది.

ఇది దాదాపు పురుషుల జట్టుతో సమానం. న్యూజిలాండ్‌ అందరికంటే ముందుగా తమ ప్లేయర్లకు ‘ప్రసూతి సెలవులు’ మంజూరు చేయగా, ఆసీస్‌ కూడా దానిని అనుసరిస్తోంది. ఇప్పుడు ఇంగ్లండ్‌ బోర్డు కూడా 20 మిలియన్‌ పౌండ్లు (రూ. 194 కోట్లు) భవిష్యత్తు కోసం పెట్టేందుకు సిద్ధమైంది. అన్నింటికి మించి పురుషుల టోర్నీ జరిగే సమయంలో కాకుండా మహిళలకు విడిగా ప్రపంచకప్‌ జరగడం పెద్ద మేలు చేసింది. 2018లోనూ ఇలాగే జరిగినా... వెస్టిండీస్‌ బోర్డు గొప్పగా పని చేయలేదు. కానీ ఈ సారి భారీ చెల్లింపులు, భారీ కవరేజ్, మైదానంలో అత్యుత్తమ సౌకర్యాలు మాత్రమే కాదు... వసతి, ప్రయాణం, అలవెన్స్‌ల విషయంలో వివక్ష లేకుండా సమానత్వాన్ని పాటించింది.

భారత్‌ కూడా... 
మన మహిళల క్రికెట్‌కు సంబంధించి 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్‌ చేరడం మేలిమలుపు. ఆ మెగా టోర్నీ తర్వాతే అందరిలోనూ ఆసక్తి పెరి గింది. జట్టులోని దాదాపు ప్రతీ అమ్మాయి పేరు మారుమోగిపోగా, సగటు అభిమానులు వాళ్లందరినీ గుర్తు పట్టేందుకు కారణమైంది. కాంట్రాక్ట్‌లతో ప్లేయర్లలో బోర్డు ధైర్యం నింపగా... అగ్రశ్రేణి క్రీడాకారిణులు మైదానం బయట కూడా బ్రాండింగ్‌లతో సొమ్ము చేసుకుంటున్నారు. బయట బిగ్‌బాష్‌ లీగ్, కియా సూపర్‌ లీగ్‌ అవకాశాలు కూడా వచ్చాయి. ఆ వెంటనే 2018లో రెండు జట్లతో ఐపీఎల్‌ సమయంలో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ జరగ్గా, గత ఏడాది అది మూడు జట్లకు పెరిగింది. ఇప్పుడు మరో జట్టును అదనంగా చేర్చి నాలుగు టీమ్‌లతో ఐపీఎల్‌ తరహా టోర్నీ నిర్వహించబోతున్నారు.

తాజా టోర్నీలోనూ ఫైనల్లోనే ఓడినా... మన మహిళలు తమ ప్రదర్శనతో ఇప్పటికే అందరి మనసులు చూరగొన్నారు. ఇకపై షఫాలీ కావచ్చు లేదా పూనమ్‌ కావచ్చు... వీరంతా ఎక్కడ ఆడినా ఆయా మ్యాచ్‌లపై ఆసక్తి కచ్చి తంగా పెరుగుతుంది. బీసీసీఐ కూడా దీనికి అనుగుణంగా దేశవాళీ టోర్నీ ల్లో ప్రణాళికలు రూపొందించవచ్చు. ఆస్ట్రేలియా అద్భుత నిర్వహణ తమ జట్టుతో టైటిల్‌ అందించడంతో పాటు ప్రపంచ మహిళా క్రికెట్‌కు కూడా ఎంతో మేలు చేసిందనేది వాస్తవం. ఇదే పునాదిపై రాబోయే రోజుల్లో మహిళా క్రికెట్‌ మరింతగా ఎదగడం ఖాయం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top