ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలో ఈ రోజు

Australia Wins The World Cup Fifth Time - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌: క్రికెట్‌ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని ఘనతను ఆస్ట్రేలియా జట్టు సొంతం చేసుకున్న రోజు ఇది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచింది ఇదే రోజు. ఈ మెగా టోర్నీకి ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. మార్చి29, 2015న మెల్‌బోర్న్‌ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పటి ఐసీసీ చైర్మన్‌ శ్రీనివాసన్‌ చేతుల మీదుగా ఆసీస్‌ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ ప్రపంచ కప్‌ను సగర్వంగా అందుకున్నాడు.

ఈ మెగా టోర్నీలో కీలక సమయంలో వికెట్లు సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన పేసర్ మిచెల్‌ స్టార్క్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డ్‌ లభించింది. గతంలో 1987, 1999, 2003, 2007 సంవత్సరాలలో నిర్వహించిన వన్డే ప్రపంచ కప్‌ టోర్నీల్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.

మరోవైపు వరుసగా రెండోసారి ప్రపంచ కప్‌ అందుకోవాలన్న భారత్‌ ఆశలు ఆవిరయ్యాయి. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో 95 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఇక ఈసారైనా ఐసీసీ టోర్నమెంట్‌ను గెలవాలని అత్యుత్తమ ప్రదర్శన చేసినా దురదృష్టం దక్షిణాఫ్రికాను వెంటాడింది. మరో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో 4 వికెట్ల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం) దక్షిణాఫ్రికా జట్టు ఓడిపోయినా అభిమానుల మనసులు గెలుచుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top