నంబర్‌వన్ ఆస్ట్రేలియా

నంబర్‌వన్ ఆస్ట్రేలియా


రెండో టెస్టులోనూ కివీస్ చిత్తు



క్రైస్ట్‌చర్చ్: టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టు తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటింది. బుధవారం న్యూజిలాండ్‌తో ఇక్కడ ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో చేజిక్కిం చుకుంది. ఈ ఫలితంతో కంగారూలు 112 పాయిం ట్లతో భారత్ (110)ను వెనక్కి నెట్టి ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా నిలిచారు. 2014 తర్వాత ఆసీస్ మళ్లీ నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది. న్యూజి లాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ పరాజయంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.



ఓవర్‌నైట్ స్కోరు 70/1తో చివరి రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బర్న్స్ (65), ఖాజా (45) రెండో వికెట్‌కు 64 పరుగులు జోడించగా... అనంతరం స్మిత్ (53 నాటౌట్), వోజెస్ (10 నాటౌట్) కలిసి మ్యాచ్‌ను ముగించారు. తొలి టెస్టును కూడా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో గెలుచుకుంది. మరో వైపు  అంపైర్‌ను దూషించినందుకు మ్యాచ్ నాలుగో రోజే పేసర్ హాజల్‌వుడ్‌కు 15 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాగా విధించిన ఐసీసీ... ఇప్పుడు ఆసీస్ కెప్టెన్ స్మిత్‌ను కూడా బాధ్యుడిగా చేస్తూ అతని ఫీజులో 30 శాతం కోత విధించింది.



ఎనిమిదో సారి

ఈ ఏడాది టెస్టు ర్యాంక్‌లకు కటాఫ్ తేదీ ఏప్రిల్ 1. ఈ లోపు ఏ దేశాలకూ టెస్టులు లేవు. కాబట్టి ఐసీసీ ప్రతి ఏడాదీ అందించే గదతో పాటు 10 లక్షల డాలర్ల బహుమతి కంగారూలకు దక్కుతుంది. ఆ జట్టు ఈ ఘనత సాధించడం ఇది ఎనిమిదోసారి. 2003 నుంచి 2009 వరకు వరుసగా ఏడేళ్లు ఆస్ట్రేలియా నంబర్‌వన్‌గా సీజన్‌ను ముగించింది. ఆ తర్వాత ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికాల ఆధిపత్యం కొనసాగింది. తిరిగి ఆసీస్ పాత వైభవాన్ని తెచ్చుకుంది. ఈ ఏడాది ర్యాంక్‌ల్లో రెండో స్థానంలో నిలిచిన భారత్‌కు ఐదు లక్షల డాలర్లు లభిస్తాయి. వన్డేల్లోనూ ఆస్ట్రేలియా నంబర్‌వన్‌గా సీజన్‌ను ముగించడం విశేషం.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top