మూడో సీజన్‌లోనైనా ఫైనల్‌కు చేరుకోవాలని ఆశించిన ముంబై సిటీ ఎఫ్‌సీ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది.
ముంబై: మూడో సీజన్‌లోనైనా ఫైనల్‌కు చేరుకోవాలని ఆశించిన ముంబై సిటీ ఎఫ్‌సీ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ముంబై సిటీ జట్టు సెమీఫైనల్లోనే నిష్క్రమించింది. 2014 చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా జట్టుతో మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్ రెండో అంచె మ్యాచ్‌ను ముంబై సిటీ జట్టు 0–0తో ‘డ్రా’గా ముగించింది. ఫలితంగా రెండు అంచెల సెమీఫైనల్‌ను కోల్‌కతా జట్టు 3–2 గోల్స్‌తో ముంబైపై నెగ్గి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈనెల 10న కోల్‌కతాలో జరిగిన తొలి సెమీఫైనల్ తొలి అంచె మ్యాచ్‌లో కోల్‌కతా 3–2తో ముంబై సిటీని ఓడించిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఓడిన ముంబై జట్టు ఫైనల్ చేరుకోవాలంటే రెండో మ్యాచ్‌లో రెండు గోల్స్ తేడాతో నెగ్గాల్సింది. కానీ ఆ జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సహ యజమానిగా ఉన్న కోల్‌కతా జట్టు ఐఎస్‌ఎల్‌లో ఫైనల్‌కు చేరుకోవడం ఇది రెండోసారి. 2014 తొలి సీజన్‌లో కోల్‌కతా విజేతగా నిలిచింది. గత ఏడాది మాత్రం సెమీఫైనల్లో ఓడిపోయింది. కేరళ బ్లాస్టర్స్, ఢిల్లీ డైనమోస్ జట్ల మధ్య బుధవారం జరిగే రెండో సెమీఫైనల్ రెండో అంచె మ్యాచ్ విజేతతో ఈనెల 18న జరిగే ఫైనల్లో కోల్‌కతా జట్టు తలపడుతుంది.
ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఆధిపత్యం చలాయించినా అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఆట 34వ, 43వ నిమిషాల్లో కోల్‌కతా ఆటగాడు రాబర్ట్ వరుసగా రెండు ఎల్లో కార్డులకు గురై మైదానం నుంచి నిష్క్రమించాడు. దాంతో మ్యాచ్ చివరి వరకు కోల్‌కతా పది మంది ఆటగాళ్లతోనే ఆడినా దీనిని ముంబై సద్వినియోగం చేసుకోలేకపోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలోనే కోల్‌కతా, ముంబై ఆటగాళ్ల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. కోల్‌కతా ఆటగాడు యువాన్ కార్లోస్ ముంబై ప్లేయర్‌ను తలతో ఢీకొట్టడంతో రిఫరీ అతనికి రెడ్ కార్డు చూపెట్టారు. ఫలితంగా ఫైనల్‌కు కార్లోస్ దూరమయ్యాడు.