నిత్యానంద దేశం.. అశ్విన్‌ ఆసక్తి!

Ashwin Respond On Nithyananda country Kailaasa - Sakshi

హైదరాబాద్‌: అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద కొత్తగా సృష్టించిన కైలాస దేశంపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా ఈ అంశంపై విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ చేసిన ట్వీట్‌ ఆసక్తి రేపింది. ‘కైలాసానికి వెళ్లేందుకు వీసా ఎలా పొందాలి? లేదంటే అక్కడికి వెళ్లాక వీసా ఇస్తారా?’ అంటూ అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ తెగ వైరల్‌గా మారింది. కైలాస దేశం చూడటానికి వెళతావా? లేదంటే అక్కడే స్థిరపడతావా? అంటూ నెటిజన్లే ప్రశ్నిస్తున్నారు. ఇక నిత్యానంద దేశంపై అశ్విన్‌కు ఎందుకంత ఆసక్తి అంటూ మరొకరు వ్యంగ్యంగా ప్రశ్నించారు.

అసలు ఈ కొత్త దేశం ముచ్చటేంటంటే!
వివాదాస్పద స్వామీజీ నిత్యానంద సొంతంగా ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకున్నారు. ఈక్వెడార్‌ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి ‘కైలాస’ అనే పేరు కూడా పెట్టారు. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు దగ్గర్లో ఉన్న తన ద్వీప దేశానికి ఒక పాస్‌పోర్ట్‌ను, జెండాను, జాతీయ చిహ్నాన్ని డిజైన్‌ చేశారు. ఒక ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. రోజూ కేబినెట్‌ భేటీలు కూడా జరుపుతున్నారని సమాచారం. ప్రధానిగా ‘మా’ని నియమించారని, గోల్డ్, రెడ్‌ కలర్లలో పాస్‌పోర్ట్‌ను రూపొందించారని ఆ ‘దేశ’ వెబ్‌సైట్‌ పేర్కొంది. తన ‘కైలాస’కు ఒక దేశంగా గుర్తింపునివ్వాలని కూడా నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేయనున్నారు.

హిందూత్వని ప్రచారం చేస్తున్నందువల్ల భారత్‌లో తన జీవితం ప్రమాదంలో పడిందని ఐరాసకు పంపనున్న వినతి పత్రంలో నిత్యానంద పేర్కొన్నారు. కైలాస రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి చేస్తుందని ఆ వెబ్‌సైట్లో పేర్కొన్నారు. దేశ పౌరసత్వం కావాలనుకునేవారు విరాళాలు ఇవ్వాలనే విజ్ఞప్తిని కూడా అందులో పొందుపర్చారు. మెరూన్‌ కలర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ సింహాసనం ముందు నిత్యానంద కూర్చుని ఉండగా పక్కన నంది ఉన్న చిత్రంతో జెండాను రూపొందించారు. ప్రభుత్వంలో 10 శాఖలను కూడా ఏర్పాటుచేశారు. అందులో ఒకటి నిత్యానంద స్వామి కార్యాలయం కాగా, విదేశీ వ్యవహారాలు, రక్షణ, సోషల్‌ మీడియా, హోం, కామర్స్, విద్య.. మొదలైన ఇతర శాఖలు ఉన్నాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top