బార్టీ ఆట ముగిసింది

Ashleigh Barty reacts to surprise Wimbledon defeat to Alison Riske - Sakshi

ప్రిక్వార్టర్స్‌లోనే ఓడిన ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌

మూడో సీడ్‌ ప్లిస్కోవా, ఆరో సీడ్‌ క్విటోవా కూడా

క్వార్టర్‌ ఫైనల్లో ఫెడరర్, జొకోవిచ్, నాదల్‌

వింబుల్డన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌

లండన్‌: ఎర్ర మట్టి కోర్టులపై చెలరేగి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచిన యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) పచ్చిక కోర్టులపై మాత్రం తడబడింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ హోదాలో వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో బరిలోకి దిగిన యాష్లే బార్టీ ప్రస్థానం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. యాష్లే బార్టీతోపాటు మూడో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), ఆరో సీడ్‌ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) కూడా ప్రిక్వార్టర్స్‌ దాటకుండానే ఇంటిముఖం పట్టారు. 15 ఏళ్ల అమెరికా రైజింగ్‌ స్టార్‌ కోరి గాఫ్‌ సంచలన ప్రదర్శనకు ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఏడో సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) అడ్డుకట్ట వేసింది. హలెప్‌తోపాటు ఎనిమిదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌), ఏడుసార్లు చాంపియన్‌ సెరెనా విలియమ్స్‌ కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.  

గతేడాది వింబుల్డన్‌లో మూడో రౌండ్లో ఓడిన బార్టీ ఈ ఏడాది ఒక అడుగు ముందుకేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 23 ఏళ్ల బార్టీ 6–3, 2–6, 3–6తో అన్‌సీడెడ్‌ అలీసన్‌ రిస్కీ (అమెరికా) చేతిలో కంగుతింది. తొలి సెట్‌లో ప్రభావం చూపించిన ఈ ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ తర్వాత రెండు సెట్లలోనూ నిరాశపరిచింది. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో హలెప్‌ 6–3, 6–3తో కోరి గాఫ్‌పై అలవోక విజయం సాధించింది. అమెరికా టెన్నిస్‌ దిగ్గజం, 11వ సీడ్‌ సెరెనా 6–2, 6–2తో వరుస సెట్లలో కార్లా స్వారెజ్‌ నవారో (స్పెయిన్‌)పై, స్వితోలినా 6–4, 6–2తో పెట్రా మార్టిక్‌ (క్రొయేషియా)పై గెలుపొందారు. మూడో సీడ్‌ ప్లిస్కోవా 6–4, 5–7, 11–13తో కరోలినా ముచోవా (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో... ఆరో సీడ్‌ క్విటోవా 6–4, 2–6, 4–6తో 19వ సీడ్‌ జొహనా కొంటా (బ్రిటన్‌) చేతిలో కంగుతింది.

సీడెడ్‌ ఆటగాళ్ల జోరు...
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బియా)తోపాటు మాజీ చాంపియన్స్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో జొకోవిచ్‌ 6–3, 6–2, 6–3తో ఉగో హంబర్ట్‌ (ఫ్రాన్స్‌)పై, మూడో సీడ్‌ నాదల్‌ 6–2, 6–2, 6–2తో జొవో సొసా (పోర్చుగల్‌)పై, రెండో సీడ్‌ ఫెడరర్‌ 6–1, 6–2, 6–2తో బెరెటిని (ఇటలీ)పై సునాయాస విజయం సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో 21వ సీడ్‌ డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం) 7–6 (11/9), 2–6, 6–3, 6–4తో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్‌)పై, 23వ సీడ్‌ బాటిస్ట అగుట్‌ (స్పెయిన్‌) 6–3, 7–5, 6–2తో బెనొయిట్‌ పెయిర్‌ (ఫ్రాన్స్‌)పై నెగ్గారు. పురుషుల డబుల్స్‌ మూడో రౌండ్‌లో దివిజ్‌ శరణ్‌ (భారత్‌)–మార్సెలో డెమోలైనర్‌ (బ్రెజిల్‌) జంట 5–7, 7–6 (8/6), 6–7 (3/7), 3–6తో టాప్‌ సీడ్‌ కుబోట్‌ (పోలాండ్‌)–మార్సెలో మెలో (బ్రెజిల్‌) జోడీ చేతిలో ఓడిపోయింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top