రసెల్‌కు ఆ బంతి వేసుంటే..!

IS Andre Russell Can Not Play Yarkers - Sakshi

బెంగళూరు : ‘హమ్మయ్యా.. ఈ మ్యాచ్‌ అయితే గెలిచేట్టున్నాం..’ అని రాయల్‌చాలెంజర్స్‌ బ్యాటింగ్‌ చూసిన తరువాత ఆ జట్టు ప్రతి అభిమాని మనసులో మెదిలిన మాట. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో తమ అభిమాన జట్టు దారుణ ఓటమి మూటగట్టుకోవడంతో వారి అసహనం తీవ్రస్థాయికి చేరింది. ఒక్క మ్యాచ్‌ అన్న గెలవండి అంటూ కోహ్లిసేనను వారంతా సోషల్‌ మీడియా వేదికగా అర్ధించారు.. తిట్టారు.. ప్రాధేయపడ్డారు. అభిమానులను అలరించాడానికి ఎలాగైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌ గెలవాలని ఆర్సీబీ ఆటగాళ్లు సైతం సిద్దమయ్యారు. కానీ ఏం లాభం.. అదృష్టం తలుపు తడితే దురుదృష్టం వెనక తలుపు తట్టినట్లు... కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మిస్టర్‌ 360 డివిలియర్స్‌ రూపంలో భారీ లక్ష్యం నమోదైతే.. ఆండ్రీ రసెల్‌ భీకర ఇన్నింగ్స్‌ రూపంలో ఆ కొండంత లక్ష్యం కొట్టుకుపోయింది.

రసెల్‌ క్రీజులోకి వచ్చినప్పుడు కోల్‌కతా విజయానికి 26 బంతుల్లో 67 పరుగులు అవసరం. ఈ పరిస్థితుల్లో ఒక్క ఓవర్‌ సరిగ్గా పడ్డా ఆర్సీబీదే విజయమని మ్యాచ్‌చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు అనుకున్నాడు. కానీ రసెల్‌ విధ్వంసం సృష్టించాడు. 13 బంతుల్లోనే 7 సిక్సర్లు, ఒక ఫోర్‌తో చెలరేగి 48 పరుగులు చేసి ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందించాడు. అయితే రసెల్‌ భీకరంగా ఆడుతుంటే ఒక్కరు కూడా యార్కర్లు సంధించకపోవడం మ్యాచ్‌ చూస్తున్న అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. అవే షార్ట్‌ పిచ్‌, స్లో బంతులు వేస్తుంటే రసెల్‌ దంచికొట్టాడు. ఒక్కరైనా ఒక ఓవర్లో కనీసం మూడు బంతులను యార్కర్లు సంధించినా మ్యాచ్‌ ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. రసెల్‌ యార్కర్లను ఆడటంలో తడబడుతాడని, అతను ఆ బంతులను భారీ షాట్స్‌గా మల్చలేడని పేర్కొంటున్నారు. రసెల్‌ గత మ్యాచ్‌లను చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ బరిలో దిగిన రసెల్‌ను రబడ యార్కర్లతోనే ఇబ్బందిపెట్టి ఔట్‌ చేశాడు. కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఆ జట్టు బౌలర్‌ మహ్మద్‌ షమీ అద్భుత యార్కర్‌తో రసెల్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దురదృష్టవశాత్తు.. అది కాస్త అశ్విన్‌ కెప్టెన్సీ లోపంతో నోబాల్‌ కావడంతో రసెల్‌ బతికిపోయాడు. అనంతరం సునామీలా బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top