విజయాన్ని మాత్రమే ఆస్వాదిస్తా: జొసెఫ్‌

Alzarri Joseph Says I Dont Celebrate Wickets Only Celebrate wins - Sakshi

ముంబై: ఐపీఎల్‌లో 11 ఏళ్ల రికార్డును ఆడిన మొదటి మ్యాచ్‌లోనే చెరిపేసి సంచలనం సృష్టించాడు ముంబై ఇండియన్స్‌ పేసర్‌ అల్జారి జొసెఫ్‌. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ వెస్టిండీస్‌ యువ స్పీడ్‌ స్టర్‌.. కేవలం 12 పరుగులకే ఆరు వికెట్లు తీశాడు. ఓటమి అంచున ఉన్న తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీనిపై మ్యాచ్‌ అనంతరం మీడియాతో అల్జారి మాట్లాడాడు. ‘ఇది గొప్ప ప్రారంభం. ఇంతకంటే మంచి ప్రారంభం అసాధ్యం. ప్రణాళిక ప్రకారమే బంతులు వేశా. బౌలింగ్‌ చేసే సమయంలో మ్యాచ్‌ గెలుపు కోసం మాత్రమే ప్రయత్నిస్తా.. అందుకే వార్నర్‌ను ఔట్‌ చేసినా సంబరాలు చేసుకోలేదు. జట్టును గెలిపించేందుకు ఆడతా కానీ గుర్తింపు కోసం కాదు. ఈ టోర్నీలో ముంబైని చాంపియన్‌గా నిలబెట్టాలని భావిస్తున్నా’ అని జొసెఫ్‌ పేర్కొన్నాడు.

కాగా, ఐపీఎల్‌ తొలి సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడిన పాక్‌ పేసర్‌ సొహైల్‌ తన్వీర్‌ 14 పరుగులకు 6 వికెట్లు తీయడం ఇప్పటివరకూ అత్యుత్తమ ప్రదర్శనగా ఉండేది. దాన్ని తాజాగా అల్జారి తిరగరాశాడు. దీనిపై విండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రియన్‌ లారా స్పందించాడు. ‘మనల్ని గర్వపడేలా చేసిన మరో విండీస్‌ యువ క్రికెటర్‌’ అంటూ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top