
‘రాయల్’ రహానే!
మూడేళ్ల క్రితం... ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టుకు ఒక్క విజయమూ దక్కని వన్డే సిరీస్‌తో రహానే అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానం మొదలైంది. జట్టు ప్రదర్శనను పక్కన పెడితే ఆ పర్యటన ద్వారా లభించిన ‘కొత్త ప్రతిభ’గా గుర్తింపు దక్కింది.
కీలక బ్యాట్స్‌మన్‌గా ఎదిగిన అజింక్య
నిలకడగా రాణిస్తున్న ముంబైకర్
చక్కటి స్ట్రోక్‌ప్లే, ఆకట్టుకునే శైలి
మూడేళ్ల క్రితం... ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టుకు ఒక్క విజయమూ దక్కని వన్డే సిరీస్‌తో రహానే అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానం మొదలైంది. జట్టు ప్రదర్శనను పక్కన పెడితే ఆ పర్యటన ద్వారా లభించిన ‘కొత్త ప్రతిభ’గా గుర్తింపు దక్కింది. ఓపెనర్‌గా బరిలోకి దిగి 5 మ్యాచ్‌ల్లో రహానే 158 పరుగులు చేశాడు. ఇప్పుడూ అదే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్... 41, 45, 106... ఇవీ రహానే చేసిన స్కోర్లు. మరో వన్డే మిగిలి ఉంది. ప్రస్తుతం అతని ఆత్మవిశ్వాసం చూస్తుంటే చివరి మ్యాచ్‌లోనూ మరో మంచి ఇన్నింగ్స్ ఆడగల నమ్మకం కనిపిస్తోంది.
సాక్షి క్రీడావిభాగం
గత మూడేళ్ల సమయంలో రహానే ఎంతో మారాడు. జట్టులో స్థానం కోల్పోయినప్పుడూ స్థైర్యం కోల్పోలేదు. ఓపెనర్‌గా, మిడిలార్డర్‌లో... ఏ స్థానంలోనైనా ఆడేందుకు ‘సై’ అన్నాడు. ఫలితమే సాధారణ ఆటగాడి నుంచి ఇప్పుడు జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు.
కళాత్మక షాట్లతో...
‘అతను ఆడుతున్న ప్రతీ షాట్‌లో కళాత్మకత కనిపిస్తోంది. అసలైన ముంబై తరహా సాంప్రదాయ బ్యాటింగ్ శైలిని అతను గుర్తుకు తెస్తున్నాడు’... నాలుగో వన్డేలో రహానే ఆటతీరు గురించి మాజీ ఆటగాడు, విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్య ఇది. ఈ మ్యాచ్‌లో అతని బ్యాటింగ్ చూస్తే ఆ ఇన్నింగ్స్ ఎంత బాగా ఆడాడో తెలుస్తుంది.
ముఖ్యంగా అండర్సన్ ఓవర్లో రహానే కొట్టిన నాలుగు ఫోర్లు దేనికవే ప్రత్యేకం. పాదాల కదలిక, షాట్లు ఆడటంలో సాధికారత రహానేకు సహజ సిద్ధంగా అబ్బినట్లు కనిపిస్తుంది. జూనియర్ స్థాయి క్రికెట్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆడిన అనంతరం ముంబై రంజీ ట్రోఫీ స్థాయికి చేరిన రహానే... ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ టోర్నీలో రెండు సెంచరీలు సాధించి భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఫామ్‌లేమితో స్థానం కోల్పోవడంతో 2012లో ఒకటి, 2013లో ఆరు వన్డేలు మాత్రమే ఆడగలిగాడు. అయితే మళ్లీ టీమ్‌లోకి వచ్చిన అనంతరం రహానే తన తప్పులను పునరావృతం చేయలేదు. ఫలితంగా ఈ ఏడాది 15 వన్డేలు ఆడిన రహానే 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలు సహా 484 పరుగులు చేసి వన్డే జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు.
నిలబడ్డాడు...
కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో అలసత్వంతో స్టంపౌట్ అయిన తర్వాత రహానే తన అవకాశాలు ‘కాలదన్నుకోరాదు’ అంటూ మాజీ ఆటగాళ్లు సుతిమెత్తగా హెచ్చరించారు. మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడనే అపప్రథ రహానేపై మొదటినుంచీ ఉంది. అతను ఆడిన 33 ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా నాటౌట్‌గా నిలవలేదు. ఇందులో 18 సార్లు అతను కనీసం 20 పరుగులపైనే చేశాడు. ఇందులో నాలుగుసార్లు మాత్రమే 60 పరుగులు దాటగలిగాడు. మంచి స్ట్రోక్‌లతో ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నా... అంతే సునాయాసంగా అతను వికెట్ సమర్పించుకున్నాడు.
అయితే దీనినుంచి అతను పాఠాలు నేర్చుకున్నట్లున్నాడు. బర్మింగ్‌హామ్ వన్డేతో ఇది రుజువైంది. కెరీర్‌లో తొలి సెంచరీ సాధించే వరకు కూడా అతను ఎక్కడా తడబడలేదు. నాలుగు సిక్సర్లు బాదినా అనవసరపు దూకుడుతో గుడ్డిగా బ్యాట్ ఊపేయకుండా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. రివర్స్ స్వీప్, స్కూప్‌లాంటి ఈతరం తరహాలో కాకుండా వన్డేలకు తగినట్లు చక్కటి సాంప్రదాయ షాట్లు ఆడటం అతనిలోని ప్రతిభను బయట పెట్టింది. లార్డ్స్‌లో చారిత్రాత్మక సెంచరీతో భారత్ మ్యాచ్ గెలవగా... ఇప్పుడు వన్డే సెంచరీతో సిరీస్ భారత్ వశమైంది.
స్థానం పక్కా...
లార్డ్స్‌లో శతకం సాధించినా... టెస్టుల్లో రహానే సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే వన్డేల్లో అతని ముందు ఇప్పుడు అరుదైన అవకాశం నిలిచింది. తాజా ప్రదర్శనతో ప్రపంచ కప్ జట్టులో స్థానం ఖరారైనట్లే కనిపిస్తోంది. కెరీర్‌లో అన్ని మ్యాచ్‌లు టాప్-4లో ఆడిన రహానే, ఓపెనర్‌గా రాణిస్తుండటం ఇప్పుడు జట్టుకు అదనపు బలంగా మారింది. సహచర ముంబై ఆటగాడు రోహిత్ శర్మతో పోలిస్తే టెక్నిక్ పరంగా చాలా బలంగా ఉండటం కూడా రహానేకు సానుకూలాంశం. ఆస్ట్రేలియా గడ్డపై శుభారంభం ఇచ్చేందుకు ఇలాంటి ఆటగాడి అవసరం ఎంతో ఉంది.
‘ప్రపంచ కప్‌కు వెళ్లే ముందు వన్డేల్లో ఎదుర్కునే విభిన్న పరిస్థితుల్లో, ఒత్తిడి గురించి మా ఆటగాళ్లకు అనుభవం ఉండాలని నేను కోరుకుంటున్నా’ అని కెప్టెన్ ధోని ఇటీవల తరచుగా వ్యాఖ్యానిస్తున్నాడు. ఆ రకంగా చూస్తే ఇంగ్లండ్ గడ్డపై రహానే చేసిన పరుగులు ఎంతో కీలకమైనవి. ‘రహానేకు ఓపెనర్ స్థానం సరిగ్గా సరిపోతుంది. అప్పుడు మేం రోహిత్‌ను మిడిలార్డర్‌లో ఆడించవచ్చు’ అని కూడా ధోని స్పష్టంగా చెప్పడం తన ఆటగాడిపై అతని నమ్మకాన్ని చూపిస్తుంది. ఈ ఇంగ్లండ్ సిరీస్ వ్యక్తిగతంగా అతనికి, భారత జట్టుకు కూడా ఎంతో మేలు చేసింది. భవిష్యత్తులోనూ అద్భుతాలు చేయగల సత్తా తనలో ఉందని రహానే నిరూపించుకోవడం శుభసూచకం.