‘ట్రంప్‌లాగే ఆలోచించవద్దు.. ప్రాణాలే ముఖ్యం’

Ajax Technical Director Slams UEFA Dutch FA Over To Complete League Covid 19 - Sakshi

రోజుకు 100 మంది చచ్చిపోతున్నారు.. డబ్బే ముఖ్యమా? 

డచ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌పై మండిపడ్డ డైరెక్టర్‌

ఆమ్‌స్టర్‌డామ్‌: మహమ్మారి కరోనా కోరలు చాస్తున్న వేళ డచ్‌ లీగ్‌ను పూర్తి చేయాలని భావిస్తున్న ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ నిర్ణయం పట్ల ఏఎఫ్‌సీ అజాక్స్‌(ఆమ్‌స్టర్‌డామ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌) టెక్నికల్‌ డైరెక్టర్‌ మార్క్‌ ఓవర్‌మార్స్‌ విస్మయం వ్యక్తం చేశారు. ప్రాణాల కంటే ఆట ముఖ్యం కాదని... డబ్బే పరమావధిగా భావించడం సరికాదని హితవు పలికారు. యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్స్‌ యూనియన్‌(యూఈఎఫ్‌ఏ)ఒత్తిడి మూలంగానే  డచ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌(కేఎన్‌వీబీ) ఈవిధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాగా ప్రాణాంతక కోవిడ్‌-19 విస్తరిస్తున్న నేపథ్యంలో ఫుట్‌బాల్‌ లీగ్‌ను నిలిపివేస్తూ తొలుత నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం జూన్‌ నెల మూడోవారం నుంచి లీగ్‌ ప్రారంభించి.. ఆగస్టు 3నాటికి ముగించాలని కేఎన్‌వీబీ భావిస్తోంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో మార్క్‌ ఓవర్‌మార్స్‌ టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ.. కేఎన్‌వీబీ, యూఈఎఫ్‌ఏ తీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలతో పోల్చారు. కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. ట్రంప్‌ ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించి కాలాయాపన చేశారని.. ఇప్పుడు ఈ రెండు అసోసియేషన్లు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ‘‘ఈ సమయంలో ప్రజల జీవితాల కంటే డబ్బే ఎందుకు ముఖ్యమని భావిస్తున్నారు? కేఎన్‌వీబీకి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు గురించి ఆలోచించకుండా యూఈఎఫ్‌ఏ చెప్పినట్లు నడుచుకుంటోంది. అసలు వాళ్లు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.

అదే విదంగా స్పెయిన్‌, ఇంగ్లండ్‌, ఇటలీ, జర్మనీ మాదిరి నెదర్లాండ్స్‌ టెలివిజన్‌ హక్కుల  ద్వారా వచ్చే ఆదాయం గురించి ఆలోచించదు. ఇదంతా యూఈఎఫ్‌ఏ ఒత్తిడి కారణంగానే జరుగుతోంది. కరోనా నియంత్రణ కంటే ఆర్థిక వ్యవస్థే ముఖ్యమన్నట్లు ట్రంప్‌ భావించారు. నెదర్లాండ్స్‌లో కరోనాతో రోజుకు 100 మంది చనిపోతున్నారు. ఈ లీగ్‌ను చంపేయండి. ముగిసిందని ప్రకటించండి. జీవితాలే ముఖ్యమని గ్రహించండి’’ అని పేర్కొన్నారు. కాగా యూఈఎఫ్‌ఏ చాంపియన్స్‌ లీగ్‌ గత సీజన్‌లో అజాక్స్‌ టీం ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top