
సాక్షి, ముంబై : నవరాత్రి ఉత్సవాల్లో చోటు చేసుకున్న ఓ ప్రమాదం తాలుకు వీడియో ఒకటి ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది. విన్యాసాలు చేస్తున్న ఓ యువతి పట్టుతప్పి పడిపోవటం.. ఆమై ఓ కారు దూసుకెళ్లటం అందులో చూడవచ్చు. మహారాష్ట్రలోని కళ్యాణ్ నగరంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.
వెల్ ఆఫ్ డెత్ గా ప్రాముఖ్యత పొందిన ఈ షోలో బావిలాంటి నిర్మాణంలో కార్లు, బైక్‌లతో సాహస విన్యాసాలు చేస్తుండటం తెలిసిందే. నవరాత్రుల సందర్భంగా గత కొన్నిరోజులుగా స్థానికంగా ఈ షోను నిర్వహకులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కారుపై ఉన్న స్టంట్లు చేస్తున్న శివానీ గజ్‌భియే(20) అదుపు తప్పి పడిపోగా, ఆమె కాలు అక్కడే ఉన్న గ్రిల్‌లో ఇరుక్కుపోయింది. అలా వేలాడుతూ ఉండగానే.. ఓ బైక్ పక్క నుంచి వెళ్లిపోగా.. వెనకాలే వేగంగా వచ్చిన కారు మాత్రం ఆమెపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె జారి కిందకు పడిపోయింది.
వెంటనే నిర్వాహకులు శివానిని ఆస్పత్రికి తరలించారు. యువతి మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు వైద్యులు తెలిపారు. ముఖం, ఛాతీ, వీపు భాగాలకు గాయాలైనట్లు వారు వెల్లడించారు. ఆ వీడియోను మీరూ చూడండి.