సర్ఫ్‌ ఎక్సెల్‌కు అండగా నిలిచిన మెహబూబా ముఫ్తి!

Surf Excel Advertisement Trolled By Netizens - Sakshi

‘మరక మంచిదే’ అనే ట్యాగ్‌లైన్‌తో ఎంఎఫ్‌జీ దిగ్గజం హిందూస్థాన్‌ యూనీలివర్‌ రూపొందించిన సరికొత్త యాడ్‌పై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లవ్‌ జిహాద్‌ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్న హెచ్‌యూఎల్‌ బ్రాండ్‌ సర్ఫ్‌ ఎక్సెల్‌ను బాయ్‌కాట్‌ చేయాలంటూ #boycottSurfexcel పేరిట నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. ‘హిందుత్వాన్ని, హిందువుల మనోభావాల్ని కించపరిచేలా యాడ్‌ రూపొందించిన సర్ఫ్ ఎక్సెల్‌ను నిషేధించాలి. హిందూ బాలికను, ముస్లిం బాలుడిని ఎంచుకుని లవ్‌ జీహాద్‌ను ప్రోత్సహిస్తున్నారు. అలాగే హోలి రంగులను మరకలు అని ఎలా అంటారు’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘ఇంత అందమైన ఫిల్మ్‌ను రూపొందించిన వారికి ధన్యవాదాలు. ఈ యాడ్‌ను వ్యతిరేకించడమంటే భారత్‌లోని భిన్నత్వంలో ఏకత్వం భావనకు విరుద్ధంగా వ్యవహరించినట్లే’ అని ట్వీట్‌ చేస్తున్నారు. ఈ ట్వీట్లపై స్పందించిన కశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి.. ‘నాదొక మంచి సలహా. భక్తులను సర్ఫ్‌ ఎక్సెల్‌ వేసి ఉతకాలి. ఎందుకంటే మరకలు పోగొట్టడమే కదా సర్ఫ్‌ పని’ అని వ్యంగంగా ట్వీట్‌ చేసి సర్ఫ్‌ ఎక్సెల్‌కు అండగా నిలిచారు.

ఆ యాడ్‌లో ఏముందంటే...
హోలి పండుగ రోజు ముస్లిం బాలుడు, హిందూ బాలిక కలిసి సైకిల్‌పై వెళ్తూంటారు. వైట్‌ డ్రెస్‌ ధరించిన ఆ బాలిక హోలి రంగులు పడకుండా తన వెనుక ఉన్న స్నేహితుడిని రక్షిస్తుంది. ఆ తర్వాత అతడిని దగ్గర్లో ఉన్న మసీదులో దిగబెట్టగా అతడు నమాజ్‌ చేసేందుకు పరిగెడతాడు. నిమిషం నిడివి ఉన్న ఈ యాడ్‌ మరక మంచిదే అనే ట్యాగ్‌లైన్‌తో ముగుస్తుంది. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ యాడ్‌ ఇప్పటికే దాదాపు 85 లక్షల వ్యూస్‌ సాధించింది. అయితే హిందుత్వ వాదులు మాత్రం తమ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసుకునేందుకు హిందూస్థాన్‌ యూనీలివర్‌ చవకబారు చర్యలకు పాల్పడుతోందంటూ విమర్శిస్తున్నారు.

కాగా రెడ్‌ లేబుల్‌ టీ పౌడర్‌ ప్రమోషన్‌ కోసం హెచ్‌యూఎల్‌ ఇటీవల రూపొందించిన యాడ్‌ వివాదాస్పమైన సంగతి తెలిసిందే. ‘వృద్ధులను వదిలించుకోవడం కోసం చాలా మంది కుంభమేళాను ఎన్నుకుంటారు. ‍కానీ మన పెద్దల పట్ల బాధ్యతగా వ్యవహరించకపోవడం నిజంగా విచారకరం. ఈ రోజు మనల్ని ఇలా తయారు చేసిన వారి చేతులను వదలకండి’ అంటూ ట్వీట్‌ చేసిన ఈ యాడ్‌పై నెటిజన్లు మండిపడ్డారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top