
ఫన్‌డే కొట్టిన సెంచరీ
మెయిన్ ఎడిషన్ బలం డైలీ హార్డ్ న్యూస్! కానీ మ్యాగజైన్ అలా కాదు.
►హోమ్ థియేటర్
►హావ్ ఫన్
►మా ఊరి ముచ్చట
► వేమన్న వెలుగులు
► అజ్ఞాతవాసం
► రియాలిటీ చెక్
►నిజాలు దేవుడికెరుక
మెయిన్ ఎడిషన్ బలం డైలీ హార్డ్ న్యూస్! కానీ మ్యాగజైన్ అలా కాదు. అది మృదువు! ఇందులో సాహిత్యం ఉంటుంది, సాహిత్యం కానిది కూడా సాహిత్యానికి దీటుగా ఉంటుంది. కథ, కవిత్వం, అనుభవం, సినిమా, జ్ఞాపకం, ఆధ్యాత్మికత, కొత్త వంట... జీవితానికి ఇవన్నీ కావాలి. వాటన్నింటి మేళవింపుగా, విస్త్రృతమైన వర్గాల అనుభవసారంగా ఫన్‌డే ఈ ఏడేళ్లుగా రూపుదాలుస్తోంది.
మిగతా ఆదివారం అనుబంధాలకన్నా గ్రాండ్‌గా, గ్లేజ్డ్ కవర్స్‌తో, ఆదివారం అనుబంధం అనే రొటీన్ పేరు కాకుండా ఒక సరికొత్త బ్రాండ్‌నేమ్‌తో... 25.36 సెంటీమీటర్లు ఎత్తు, 19.23 సెంటీమీటర్ల వెడల్పు, 44 పేజీల ‘బరువు’తో... 2008 మార్చి 30న ఫన్‌డే తొలిసంచిక మార్కెట్లోకి వచ్చింది. కొలతలు కాలక్రమంలో మారినప్పటికీ దినుసులు మారకుండా సుమారు 350 సంచికలు వచ్చాయిప్పటికి!
సన్నిహితంగా చదువుతున్న పాఠకులకు కేవలం కొన్ని కాలమ్స్‌ను ఉటంకించినా ఈ ఏడేళ్ల ప్రస్థానం కళ్లకు కడుతుంది. హోమ్ థియేటర్, హావ్‌ఫన్, నో ప్రాబ్లమ్, సినీఫక్కి, ముచ్చటైన ఆశ, రొమాన్స్, పదశోధన, మా ఊరి ముచ్చట, వేమన్న వెలుగులు, జనపదం, చందమామ స్టోరీ, అన్నమయ్య అన్నమాట, ప్రకృతి వైద్యం, బేతాళ ప్రశ్నలు, చిన్నారి కళ, ఆ ఒక్క సినిమా, మారుతీరావు మనస్సాక్షి , జీవనశైలి, లెన్స్ ఎసెన్స్, నా..., సినిమా/మ్యూజిక్ క్విజ్, నవ్వుల రాట్నం, కిసుక్కు, కుంచె కొంచెం, ఫన్‌టూన్, థాంక్యూ, చిన్ని కృష్ణుడికో చిట్టికథ, ప్లే గ్రౌండ్, నా మొదటి సినిమా, రాలిన మొగ్గలు, ప్లేగ్రౌండ్, ఆజన్మం, రిలేషణం, ఇన్నర్‌వ్యూ, టేక్ ఇట్ ఈజీ, అజ్ఞాతవాసం, ఆ రోజుల్లో, ఈ నలుగురు, లవ్, విశ్లేషణం, పద్యానవనం, తపాలా, సత్వం, నవ్వింత... తాజాగా యుద్ధక్షేత్రం, మెడికల్ మెమరీస్, బెస్ట్‌కేస్, మీరే పారిశ్రామికవేత్త...
ఎందరో రచయితల తొలికథల్ని ఫన్‌డేలో ప్రచురించాం. ఫన్‌డే కంటెంట్ నుంచి ఎన్నో పుస్తకాలు అచ్చయ్యాయి. నాలుగుసార్లు తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యేక సంచికలు వేశాం. ప్రేమ కోసం ఒక సంచికను కేటాయించాం. న్యూ ఇయర్ సంచిక వేశాం. 20 ఏళ్ల సరళీకరణకు అద్దం పట్టాం. ఒక సంచిక గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పాలి. 2010 మార్చ్ 28 నాటి ఫన్‌డే 100వ సంచికను తప్పక చూడాల్సిన 100 తెలుగు సినిమాలు, తప్పక వినాల్సిన 100 తెలుగు సినిమా పాటలు, తప్పక చదవాల్సిన 100 తెలుగు పుస్తకాలతో లైబ్రరీ ఎడిషన్‌లా తీర్చిదిద్దాం. ప్రతి కేటగిరికీ నలుగురు జడ్జీలు, చర్చలు, అదనపు సలహాలు, కూడికలు, తీసివేతలు, అర్ధరాత్రుళ్ల దాకా కంప్యూటర్ మానిటర్‌కు అతుక్కుపోవడాలు... నిజంగా పెద్ద ప్రయత్నం! శ్రమ వృథా పోలేదు. సావిత్రి ముఖచిత్రంతో వెలువడిన ఆ సంచిక కాపీలు దొరక్క జిరాక్సులు చేసుకుంటున్నారని తెల్లారి తియ్యటి వార్తలు విన్నాం. అంతకంటే రియల్ ‘ఫన్’ డే
ఏముంటుంది!
- ఫన్‌డే ఏడేళ్ల ప్రతినిధి