
‘సాక్షి’ వరుస కథనాలతో కదిలిన అధికారులు
కోటబొమ్మాళి మండలం కమలనాభపురంలో 8 మంది వృద్ధులకు పింఛను అందజేత
రెండు నెలల పెండింగ్, మే నెల మొత్తం ఒకేసారి
పంచాయతీ కార్యదర్శి సహా పలువురికి నోటీసులు
టెక్కలి: వారంతా వృద్ధులు.. నెలనెలా అందే పింఛను వైద్య ఖర్చులకో, మందులకో పనికి వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అలాంటివారికి రెండు నెలలుగా పింఛను పెండింగ్ పెట్టారు.. మే నెలలో అయినా వస్తుందేమోనని ఆశిస్తే నిరాశే ఎదురైంది. వారి బాధను వివరిస్తూ ‘సాక్షి’లో శుక్రవారం కథనం రావడంతో అధికారులు కదిలారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం మాసాహెబ్‌పేట పంచాయతీ కమలనాభపురంలో ఎనిమిది మంది వృద్ధులకు పింఛను పంపిణీ చేశారు.
గ్రామానికి చెందిన 8 మంది వృద్ధులు దువ్వారపు అప్పన్న, కర్రి లక్ష్మణ, రోణంకి సింహాచలం, గురువెల్లి గోపాలరావు, కూన సుగ్రీవులు, మొజ్జాడ సూర్యనారాయణ, బొడ్డేపల్లి ధర్మారావు, నెయ్యిల లక్ష్మీనారాయణకు ఎలాంటి కారణం లేకుండా మార్చి, ఏప్రిల్ నెలల పింఛన్ ఇవ్వలేదు. తాజాగా వీరికి అధికారులు ఒకేసారి మూడు నెలల పింఛన్ అందజేశారు. గ్రామ సర్పంచ్ సంపతిరావు ధనలక్ష్మి, వైఎస్సార్‌సీపీ నాయకుడు సంపతిరావు హేమసుందర్‌రాజు, గ్రామస్థులు కొందరు బాధితుల తరఫున పోరాటం చేశారు.
సమస్యను వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌తో కలిసి మండల అధికారులతో పాటు కలెక్టర్, డీఆర్‌డీఏ పీడీ దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు ఉన్నతాధికారులు స్పందించారు. పింఛన్ జాప్యంపై కమలనాభపురం పంచాయతీ కార్యదర్శి రమేష్, ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్‌కు ఉన్నతాధికారులు మెమోలు జారీ చేసినట్లు కోట»ొమ్మాళి ఈవోపీఆర్‌డీ ఆనందరావు వెల్లడించారు.
ఆనందంగా ఉంది
వరుసగా మూడో నెల కూడా పింఛన్ రాదని భయాందోళన చెందాం. ఇప్పుడు ఒకేసారి డబ్బులు ఇచ్చారు. ఎంతో ఆనందంగా ఉంది. మా లాంటి వారి కోసం సర్పంచ్, నాయకులు, గ్రామస్థులు అండగా నిలిచారు. – నెయ్యిల లక్ష్మీనారాయణ
పింఛన్ కోల్పోతామనే భయం ఉండేది
రెండు నెలల పాటు పింఛన్ ఇవ్వలేదు. మూడో నెల కూడా ఇవ్వరేమోనని భయం ఉండేది. సాక్షి కథనానికి అధికారులు స్పందించి పింఛన్లు మంజూరు చేయడం మాకు ఎంతో సంతోషం. – బొడ్డేపల్లి ధర్మారావు
సర్పంచ్, ఆమె భర్త పోరాడారు
మా గ్రామంలో నాతో పాటు 8 మందికి పింఛన్ ఇవ్వడం ఆపేశారు. మా సర్పంచ్ ధనలక్ష్మిమ, ఆమె భర్త హేమసుందర్‌రాజు, మరికొంత మంది మా కోసం ఎంతగానో పోరాటం చేశారు. మా ఆవేదనని సాక్షి వెలుగులోకి తెచి్చంది. చివరకు మాకు పింఛన్ డబ్బులు అందాయి. – మొజ్జాడ సూర్యనారాయణ