
మధురానగర్ కాలనీ
సాక్షి, శంషాబాద్: అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన శంషాబాద్ పట్టణంలో తాగునీటి సౌకర్యం లేక పలు కాలనీలు అల్లాడుతున్నాయి. ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి గ్రామాలకు నీటి సరఫరా బాధ్యత జలమండలి తీసుకోవడంతో ఇక్కడ పంచాయతీ చేతిలో ఏమీ లేకుండా పోయింది. జలమండలి అన్ని ఆవాసాలకు మంచినీరందించే పనిని చేపట్టడం లేదు. ఫలితంగా శంషాబాద్ పట్టణంలోని మధురానగర్, సిద్దేశ్వరకాలనీ, ఆర్బీనగర్, ఆదర్శనగర్ కాలనీలో నీటి సరఫరా లేక పదిహేను రోజులుగా ప్రజలు అల్లాడుతున్నారు. ఈ విషయమై ఇటీవల ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్య పరిష్కరించాలని సూచించారు. వీలైనంత త్వరగా సంబంధిత కాలనీలకు మంచినీటి సరఫరా చేపట్టేందుకు ఉన్న మార్గాలను అన్వేషించి పనిపూర్తి చేయాలని ఆదేశించారు. అయినా సదరు శాఖ అధికారులు నీటి సరఫరాపై తీవ్ర జాప్యం చేస్తున్నారు.
ఎందుకిలా..?
శంషాబాద్‌లోని పాత గ్రామానికి నాలుగున్నరేళ్లుగా జలమండలి అధికారులు కృష్ణా నీటిని సరఫరా చేస్తున్నారు. పంచాయతీలోని మిగతా ప్రాంతాలకు పంచాయతీ నుంచి బోరు నీటిని సరఫరా చేసేవారు. అయితే, కొంత కాలంగా ఔటర్ రింగ్‌రోడ్డు లోపు పూర్తి ఆవాసాలకు నీటి సరఫరాను అందించే బాధ్యతను ప్రభుత్వం జలమండలికి అప్పగించింది. దీంతో పంచాయతీ అధికారులు నూతనంగా ఎలాంటి పనులూ చేపట్టడానికి వీలు లేకుండా పోయింది. శంషాబాద్‌లోని జాతీయ రహదారికి అవతల ఉన్న ప్రాంతంలో అర్బన్ మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు ఇంకా పూర్తి చేయకపోవడంతో ఇక్కడ కృష్ణా నీటి సరఫరా ప్రారంభం కాలేదు. గతంలో ఉన్న బోర్లు పూర్తిగా ఎండిపోవడంతో పంచాయతీ అధికారులు కూడా వాటిని ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. స్థానికంగా నెలకొన్న సమస్యను పంచాయతీ సర్పంచ్ రాచమల్ల సిద్దేశ్వర్ ఆధ్వర్యంలో రెండుమార్లు జలమండలి అధికారులకు విన్నవించారు. అయినా సంబంధిత అధికారులు ఆయా కాలనీలకు మంచినీటి సరఫరాను అందించే ప్రక్రియపై ఇంతవరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.
పడిపోయిన నీటిమట్టం
శంషాబాద్ పట్టణంలో మధురానగర్, ఆర్బీనగర్, ఆదర్శనగర్ కాలనీల్లో వందల సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలు పుట్టుకొచ్చాయి. అద్దెకు నివాసముండే వారు పెరిగిపోయారు. దీంతో ఇళ్ల యజమానులు 1000 నుంచి 1500 ఫీట్ల వరకు బోర్లు వేశారు. విచ్చలవిడిగా తవ్విన బోర్లతో ఇక్కడ భూగర్భ జలాలు అడుగంటాయియి. ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు బోర్ల వరకు ఉన్నాయి. నివాస ప్రాంతాల్లో సైతం ఎలాంటి అనుమతులు లేకుండా హోటళ్లు, లాడ్జీలు, ప్రైవేటు హాస్టళ్ల నిర్వహిస్తున్నా అడ్డుకునే వారే లేకుండా పోయారు. దీంతో ఇక్కడి జనాభాకు అనుగుణంగా పంచాయతీ నీటి సరఫరాను అందించలేకపోతోంది. మరో వైపు కృష్ణా నీటి సరఫరా చర్యలు కూడా లేకపోవడంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా నీటి సరఫరాకు మార్గం సుగమమం చేయడంతో పాటు అక్రమ బోర్లును అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నీటి ఇబ్బంది చాలా ఉంది
స్థానికంగా నీటి ఇబ్బంది చాలా ఉంది. కృష్ణా నీటి సరఫరా చేపట్టాలి. కాలనీలో బోర్లు ఎండిపోయాయి. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలి. సరైన నీటి సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం
– కె. సత్యనారాయణ– మధురానగర్
స్పందించడం లేదు..
పంచాయతీ పరిధిలోని ఔటర్ లోపలి ప్రాం తాలకు నీటి సరఫరా చేయాల్సిన జల మండలి పట్టించుకోవడం లేదు. పంచాయతీలోని ఔటర్ అవతలి భాగంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సత్వరమే స్పందిస్తున్నారు. పంచాయతీ చేతిలో సమస్యను పరిష్కరించేందుకు అవకాశం లేదు. జలమండలి అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. సత్వరమే కాలనీలకు నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలి.
–రాచమల్ల సిద్దేశ్వర్, శంషాబాద్ సర్పంచ్