అలుపెరుగని బాటసారి

YV Subba Reddy Padayatra In Prakasam - Sakshi

వెలిగొండ పూర్తి చేయాలంటూమాజీ ఎంపీ డిమాండ్‌

కాలినడకన ప్రాజెక్టుకు పయనం

10 రోజులు పూర్తి చేసుకున్న వైవీ ప్రజా పాదయాత్ర

3 నియోజకవర్గాల మీదుగా సాగిన పర్యటన

సంఘీభావం ప్రకటిస్తున్న నేతలు

పల్లె ప్రజల్లో పెల్లుబుకుతున్న అభిమానం

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలి. పశ్చిమలో వ్యవసాయం పండుగ చేయాలి. బీళ్లుగా మారిన పంట భూములు పచ్చని పైర్లతో కళకళలాడాలి. రైతన్నకువ్యవసాయం పండుగ కావాలి. తడారిన గొంతుకల దప్పిక తీరాలి. ఇదే కసితో వందల కిలోమీటర్ల మేర అలుపెరుగక ముందుకు సాగుతున్నారు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవిని తృణప్రాయంగా త్యజించిన పెద్దాయన తమ ప్రాంతానికి కాలినడకన వస్తుంటే పల్లెలన్నీ ఎదురొచ్చి స్వాగతిస్తున్నాయి. ఆయన వెంట నడుస్తున్న వైఎస్సార్‌ సీపీ నేతలు, మద్దతుదారులతో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. వెలిగొండ సాధనే ధ్యేయంగా మండుటెండను సైతం లెక్కచేయక ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రకు అడుగడుగునా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఆబాలగోపాలం ఆయనఅడుగులో అడుగు వేసి బాసటగా నిలుస్తున్నారు. చంద్రబాబు సర్కారు మోసాన్ని ఎండగడుతూ.. పల్లె ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ సాగుతున్న వైవీ ప్రజా పాదయాత్ర శుక్రవారం10 రోజులు పూర్తి చేసుకుంది. మూడు నియోజకవర్గాల్లో 140 కిలోమీటర్లకు పైగా సాగింది. ఆగస్టు 15న కనిగిరి నుంచి ప్రారంభమైన యాత్ర పదో రోజు మార్కాపురం నియోజకవర్గం నుంచి దర్శి నియోజకవర్గం దొనకొండ చేరింది.

మార్కాపురం రూరల్‌/మార్కాపురం:  వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కోసం వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన ప్రజా పాదయాత్ర 10వ రోజు శుక్రవారం మార్కాపురం, దర్శి నియోజకవర్గాల్లో సాగింది. మార్కాపురం మండలం గజ్జలకొండ నుంచి ప్రారంభమైన యాత్రలో వైవీకి అడుగడుగునా ప్రజలు నీరాజనం పట్టారు.మహిళలు, కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇండ్లచెరువులో మహిళలు ఆయనకు హారతులిచ్చి, పూల మాలలతో ఘనంగా స్వాగతం పలికారు. మాజీ సర్పంచి పాతకోట సునీతాకోటిరెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ జెండాను వైవీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానికులు వర్షాలు లేక పొలాలు బీడుగా మారాయని, భూగర్భ జలాలు ఇంకిపోయి తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఏకరువు పెట్టారు. మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఎస్సీ కాలనీ వాసులు సుబ్బారెడ్డి ఎదుట వాపోయారు. సమస్యలు విన్న ఆయన త్వరలో మన ప్రభుత్వం వస్తుంది. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

పాదయాత్రలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి సుబ్బారెడ్డి, కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, నేతలు వెన్నా హనుమారెడ్డి, కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వర్లు తదితరులు అడుగులో అడుగేసి వైవీతో పాటు నడిచాడు. దర్శి, చీరాల నియోజకవర్గ సమన్వయకర్తలు బాదం మాధవరెడ్డి, యడం బాలాజీలు పాదయాత్రలో పాల్గొని వైవీకి పలు సమస్యలను వివరించారు.కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శిల్పా మోహన్‌రెడ్డి, కర్నూల్‌ పార్లమెంటు కో ఆర్డినేటర్‌ రాములు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి, కర్నూల్‌ అసెంబ్లీ ఇన్‌చార్జీ ఆసిఫ్‌ ఖాన్, కోడమూరు మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త మురళీకృష్ణ, యువ నాయకుడు శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, దొనకొండ, దర్శి, కురిచేడు, తాల్లూరు మండల కన్వీనర్‌లు కాకర్ల కృష్ణారెడ్డి, వెన్నపూస వెంకటరెడ్డి, బి.వెంకయ్య, వేణుగోపాలరెడ్డి, జెడ్పీటీసీలు  మారం వెంకటరెడ్డి, మెట్టు వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గొంగటి శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీపీ మోషె తదితరులు వైవీకి సంఘీభావం తెలిపారు.

నేటి షెడ్యూల్‌...
శనివారం దొనకొండ నుంచి ఉదయం 9.00 గంటలకు పాదయాత్ర ప్రారభమవుతుంది. అక్కడ నుంచి రుద్రసముద్రం చేరుతుంది. భోజన విరామం అనంతరం కొచ్చరకోట వరకు సాగుతుంది.

పాదయాత్రసాగింది ఇలా..
ప్రజాపాదయాత్ర శుక్రవారం మార్కాపురం మండలం గజ్జలకొండలో ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. గుండవారిపల్లె, నాగిరెడ్డి పల్లె, పిచ్చిగుంట్లపల్లి మీదుగా 11.30 గంటలకు దర్శి నియోజకవర్గంలో ప్రవేశించింది. దొనకొండ మండలం ఇండ్లచెరువులో మధ్యాహ్నం 12.30 భోజన విరామం అనంతరం 3.15గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. సాయత్రం 5.30గంటలకు దొనకొండలో బహిరంగ సభ అనంతరం 6.10గంటలకు యాత్ర ముగిసింది. 10వ రోజు మొత్తం 14.1 కి.మీ మేర యాత్ర సాగింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top