చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి.. | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి..

Published Sun, Jun 10 2018 11:05 AM

YSRCP MP YV Subbareddy Slams To TDP Government - Sakshi

సాక్షి, రాజమండ్రి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో ఏ విధమైన మార్పులు లేవని​ వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ..  వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఎక్కడ తొక్కిసలాట జరగలేదు.. జరిగే అవకాశం లేదని చెప్పారు. అధికార పార్టీ కుట్రలో భాగంగానే ఇలా పాదయాత్రపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాజమండ్రిలో పాదయాత్ర చరిత్రాత్మక ఘట్టంగా నిలువనుందని ఎంపీ పేర్కొన్నారు. 

ఈ నెల(జూన్‌) 12వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జననేత పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. రోడ్డు కం రైలు వంతెన మీదుగా పాదయాత్ర రాజమండ్రి చేరుకుంటుంది. గోదావరి బ్రిడ్జిపై వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు మొదట నిరాకరించి, ఆ తర్వాత షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అధికార పార్టీతీరు పై ఎంపీ నిప్పులు చెరిగారు. డ్రామాలు ఆడుతుంది మేమా.. టీడీపీనా అనే విషయం ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామాలు చేశామని తెలిపారు. 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.‘ఎన్టీఏపై వైఎస్సార్‌సీపీనే అవిశ్వాసం తీర్మానం పెట్టింది. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చింది. తన స్వార్థ ప్రయోజనాల కోసం బాబు ప్రత్యేక హోదాను పక్కనపెట్టాడు. హోదా కోసం మాతో కలిసి రాజీనామాలు చేయాలని టీడీపీని కోరాం. కానీ టీడీపీలు ఎంపీలు పారిపోయారని’ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు.

అసలు హోదా కోసం టీడీపీ ఎంపీలు ఇప్పుడేం చేస్తారో చంద్రబాబు చెప్పాలని ఎంపీ సుబ్బారెడ్డి నిలదీశారు.  ‘ఉప ఎన్నికలు రావాలని వంద శాతం కోరుకుంటున్నాం. ఉప ఎన్నికలు వస్తే మా రాజీనామాలకు విలువ ఉంటుంది. ఇప్పటికైనా హోదా కోసం రాజీనామాలు చేయాలని టీడీపీ కోరుతున్నాం. స్పీకర్‌ సుమిత్రా మహాజన్ విదేశీ పర్యటన నుంచి వచ్చాక మా రాజీనామాలు ఆమోదించాల్సిందే. ఉప ఎన్నికలకు పోదాం.. ఉప ఎన్నికలు ఎదుర్కోనడానికి మేము సిద్దం’ అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

 
Advertisement
 
Advertisement