అభివృద్ధి నిరోధక శక్తిగా టీడీపీ మారింది..

YSRCP MLA Ambati Rambabu Comments On Chandrababu - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

సాక్షి, అమరావతి: శాసనమండలిని అభివృద్ధి నిరోధకంగా మార్చాలని టీడీపీ యత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. టీడీపీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మండలి చైర్మన్‌ నిర్ణయం అప్రజాస్వామికం అని... ఆయన నిర్ణయాన్ని మేధావులంతా తప్పుబడుతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ అంశంపై ఆలోచించాలని కోరారు. రాజ్యాంగ విలువలను టీడీపీ అపహాస్యం చేసిందన్నారు. ఈ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపే అవసరం  లేదన్నారు. ఇది చంద్రబాబు ప్రభావం వల్లే జరిగిందన్నారు. చైర్మన్‌ను రూల్‌ ప్రకారం వ్యవహరించాలని కోరామని తెలిపారు.

మండలిలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని ఆందోళన కలిగిస్తున్నాయని అంబటి పేర్కొన్నారు. చాలా రాష్ట్రంలో మండలి లేదని.. మన రాష్ట్రంలోనే ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి రెండు సభలు దోహదపడాలని.. లేదంటే ఏమైనా ప్రభుత్వం చిన్న చిన్న పొరపాట్లు చేస్తే సవరణలు చేయాలని సూచించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వ బిల్లులను టీడీపీ అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. మండలిలో మెజార్టీ ఉంటే తిరిగి పంపొచ్చని.. అలా కాకుండా బిల్లును అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి నిరోధక శక్తిగా టీడీపీ మారిందని.. ఇటువంటి సమయంలో శాసన మండలి అవసరమా అనే చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. మండలిలో టీడీపీ తీరుపై ప్రజలంతా ఆలోచించాలన్నారు. సభలో దుష్ట సంప్రదాయానికి టీడీపీ తెరలేపిందన్నారు. జాతీయస్థాయిలో చక్రం తిప్పుతానని చెప్పే చంద్రబాబు గ్యాలరీలో ఎందుకు చైర్మన్‌ ఎదురుగా కూర్చున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తీరును ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని కోరారు.

పెద్దల సభను పిల్లల సభలాగా మార్చుతున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభావంతోనే మండలి చైర్మన్‌.. సెలెక్ట్‌ కమిటీకి బిల్లులు పంపారన్నారు. బిల్లులను తాత్కాలికంగా మాత్రమే అడ్డుకోగలరని.. శాశ్వతంగా అడ్డుకోలేరన్నారు. తాము స్వాగతిస్తే టీడీపీ ఎమ్మెల్సీలు వైఎస్సార్‌సీపీలోకి క్యూ కడతారని.. కానీ అది తమ విధానం కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం.. రాజధాని విషయంలో జోక్యం చేసుకోదన్నారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం పవన్‌కల్యాణ్‌, చంద్రబాబు మానుకోవాలని హితవు పలికారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసిన వారిపై విచారణ జరుగుతుందని.. ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పారు. తప్పుచేసిన వారికి శిక్ష తప్పదని ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. (చదవండి: మండలి చైర్మన్‌ నిర్ణయం అప్రజాస్వామికం)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top