‘వైజాగ్‌లో వైఎస్‌ జగన్‌ను స్వామివారే కాపాడారు’

YSRCP Leaders On YS Jagan Tirumala Visit - Sakshi

సాక్షి, తిరుపతి: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌  అలిపిరి నుంచి కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. అడుగడుగునా భక్తులకు అభివాదం చేస్తూ.. ఒక సామాన్య భక్తుడిలా ఆయన ముందుకు సాగారు. మార్గమధ్యలో ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొబ్బరికాయ కొట్టారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. మరికాసేపట్లో ఆయన స్వామివారిని దర్శించుకోనున్నారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి.. వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దేశ చరిత్రలో ఓ అద్భుతమని అన్నారు. కోటిన్నర మంది ప్రజలు ఆయనను నేరుగా కలవడం.. ప్రసంగాలు వినడం.. సమస్యలు చెప్పుకోవడం జరిగిందని తెలిపారు. కష్టం అంటే తెలియని కుటుంబంలో పుట్టిన వైఎస్‌ జగన్‌.. ప్రజా శ్రేయస్సు కోసం ప్రజాసంకల్పయాత్ర చేపట్టారు. 14 నెలల పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ పరిపూర్ణ నాయకుడిగా ఎదిగారని అన్నారు. తన కోసం కాకుండా.. రాష్ట్ర  ప్రజలను కష్టాలను తొలగించమని కోరుకుంటూ స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఆయన తిరుమలకు వచ్చారని తెలిపారు. వైఎస్‌ జగన్ కుటుంబానికి దూరంగా, ఎండ, వాన, చలి లెక్క చేయకుండా ప్రజల మధ్య ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం తపించారని గుర్తుచేశారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అరాచక పాలనకు వ్యతిరేకంగా వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో చేపట్టారని తెలిపారు. ఈ పాదయాత్రలో ఆయనను భూమిపై లేకుండా చేసేందుకు విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగని హత్యాయత్నం జరిగిందని గుర్తుచేశారు. కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని బయలుదేరిన వైఎస్‌ జగన్‌ను వైజాగ్‌లో స్వామివారే కాపాడి.. నేడు తిరుపతికి వచ్చి మొక్కు తీర్చుకునే అవకాశం కల్పించారని అన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ ఎప్పుడు సామాన్యునిలానే ఉంటారని.. చంద్రబాబులా ప్రజలను చూసి విసుగు చెందరని తెలిపారు. వైఎస్‌ జగన్‌ సామాన్యునిలా వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇటువంటి నాయకుని ఆధ్వర్యంలో పనిచేయడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.

వైఎస్సార్‌ సీపీ తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్‌ మాట్లాడుతూ..  రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాత  వైఎస్‌ జగన్‌ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చారని అన్నారు. వైఎస్‌ జగన్‌కు తప్పకుండా స్వామివారి ఆశీస్సులు ఉంటాయని.. ఆయన సీఎం కావాలనే ప్రజల అందరి కోరికను భగవంతుడు నెరవేరుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. అబద్దాలు చెబతూ, అక్రమాలకు పాల్పడే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్వామివారు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు తీర్చమని శ్రీవారిని కోరడానికే వైఎస్‌ జగన్‌ ఓ సామాన్య భక్తుడిలా ఇక్కడికి వచ్చినట్టు  తెలిపారు. టీడీపీ చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. 600 హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ది కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది కేవలం వైఎస్‌ జగన్‌ మాత్రమేనని అన్నారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావడంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. టీడీపీ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇచ్ఛాపురంలో వైఎస్‌ జగన్‌ బహిరంగ సభకు తరలివచ్చిన ప్రజలను చూసి ఓర్వలేక మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.

వైఎస్సార్‌ సీపీ నాయకులు, ప్రముఖ నటుడు విజయ్‌చందర్‌ మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ విజయ సంకల్పం అద్వితీయం అన్నారు. తన జన్మలో ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని చూసినందుకు ఆనందంగా ఉందన్నారు.14 నెలలు.. 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలంటే ఎంతో ఓపిక, సహనం ఉండాలని.. అవన్నీ వైఎస్‌ జగన్‌లో ఉన్నాయని తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top