జయం మనదే

YSRCP Leaders Fires On TDP Leaders  - Sakshi

కార్యకర్తలు, నేతలు ఎవరూ అధైర్యపడొద్దు

చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

బూత్‌ కమిటీ కన్వీనర్ల శిక్షణా తరగతుల్లో వైఎస్సార్‌సీపీ నేత పార్థసారధి

అనంతపురం టౌన్‌: ‘టీడీపీ నాయకుల అవినీతి, అక్రమాలు దాడులతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలే కాదు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నలిగిపోతున్నారు.. ఎవరూ అధైర్యపడొద్దు .. మరో ఎనిమిది నెలలు ఓపిక పట్టండి.. మన అందరి పార్టీ అధికారంలోకి వస్తుంది’ అని మాజీ మంత్రి , వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె. పార్థసారధి అన్నారు. మంగళవారం కేటీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి అధ్యక్షతన అనంతపురం, హిందూపురం పార్లమెంట్‌ పరిధిలోని తాడిపత్రి, గుంతకల్, కదిరి, పెనుకొండ నియోజక వర్గాల బూత్‌ కన్వీనర్ల శిక్షణ తరగుతులు జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన పార్థసారధి తొలుత వైఎస్సార్‌ చిత్రపటానికి పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌ మిథున్‌రెడ్డి, పార్టీ నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బూత్‌ కమిటీ కన్వీనర్లు పార్టీకి పట్టుకొమ్మలన్నారు.

చంద్రబాబు మోసాలను, టీడీపీ నేతల అవినీతి అక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న ముస్లింలకు మంత్రి వర్గంలో స్థానం లేదనీ, ఇదేమిటని ప్రశ్నిస్తే మా పార్టీ నుంచి మైనార్టీలు ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదంటూ ముఖ్యమంత్రి దాట వేస్తున్నాడన్నారు. మంత్రి నారాయణ ఎమ్మెల్యేగా ఎన్నికైనాడా? ఆయన్ను ఏవిధంగా మంత్రి వర్గంలోకి తీసుకున్నారో మైనార్టీలకు చెప్పాలన్నారు. ఇక.. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని సాక్షత్తూ సీఎం చంద్రబాబే అని .. ఇప్పుడు దళితతేజం పేరుతో కొత్త నాటకానికి తెరతీశారన్నారు. దళిత వాడలకు వచ్చే టీడీపీ నేతల కాలర్‌ పట్టుకొని నిలదీయాలని పిలుపు నిచ్చారు. ప్రత్యేకహోదా కోసం ఆనాటి నుంచి నేటి వరకు బీజేపీ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు వజ్రా భాస్కర్‌రెడ్డి, జక్కల ఆదిశేషు, రమేష్‌రెడ్డి, బత్తల హరిప్రసాద్, జిల్లా పరిశీలకుడు వైఎస్‌ కొండారెడ్డి,  బీసీ సెల్‌ అధ్యక్షుడు వీరాంజినేయులు, మైనార్టీసెల్‌ అధ్యక్షుడు మున్నా, పైలా నరసింహయ్య, రామలింగం, జింకల రామాంజినేయలు, ప్రవీణ్‌కుమార్, లింగేశ్వరబాబు తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు
ప్రజలు చాలా తెలివైనవారు చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో లేరు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధి పనులు పూర్తి కావాలంటే మళ్లీ బాబు రావాలనే గ్లోబల్‌ ప్రచారానికి సన్నద్ధమయ్యాడు. బాబు గ్లోబల్‌ ప్రచారాన్ని ప్రజలకు వివరించే బాధ్యత బూత్‌ కమిటీ కన్వీనర్లపైనే ఉంది. బీజేపీ అన్ని విధాల రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తోందని.. ప్రత్యేకహోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే మేలని బీజేపీ, టీడీపీ రెండు కవల పిల్లలు అంటూ నాడు ఊదరగొట్టిన బాబు.. నేడు మాట మార్చి బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ఏలాంటి చేయూతను అందించలేదని ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. గత ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పని చేయకపోవడంతోనే చాలా నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్లతో ఓటమి పోయాం. అందుకే ముందస్తుగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు బూత్‌ కన్వీనర్లు శ్రీకారం చుట్టాలి.– మిథున్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఇన్‌చార్జ్‌

నవరత్నాలపై అవగాహన కల్పించాలి
చంద్రబాబు నాలుగేళ్ల ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చాడు. అందరూ సమిష్టిగా శక్తివంచన లేకుండా పనిచేసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఎన్నికలు సమీపిస్తున్నాయ్‌.. ఇలాంటి తరుణంలో టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేయడానికి సన్నద్ధం అవుతారు. ప్రతీ బూత్‌ కమిటీ కన్వీనర్‌ వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల పథకాలపై అవగాహన కల్పించాలి. – శంకర్‌నారాయణ, హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు

టీడీపీ కుట్రలను తిప్పికొడదాం
టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది.  ఎన్నికలు సమీపిస్తున్నాయ్‌.. మళ్లీ కుట్రలు చేసేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టాడు. టీడీపీ కుట్రలను ఐక్యంగా తిప్పికొట్టి.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించాలి. ఈ 8 నెలల పాటు పార్టీ కోసం పని చేద్దాం. జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తే బూత్‌ కన్వీనర్లకు మంచి గుర్తింపు ఉంటుంది.  – అనంత వెంకటరామిరెడ్డి, అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు

జేసీ సోదరులు చేసింది శూన్యం
తాడిపత్రి నియోజకవర్గంలో 30 సంవత్సరాలు జేసీ కుటుంబానికి అధికారం ఇచ్చినా చేసింది శూన్యం. ప్రజలను ఫ్యాక్షన్‌లోకి దింపి కుటుంబాలను నాశనం చేస్తున్నారు. అనేక పరిశ్రమలు ఉన్నా యువతకు ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వలస పోతుండటం బాధాకరం. పరిశ్రమలు, ఉద్యోగాలివ్వకపోయినా జేసీ సోదరులు ప్రశ్నించరు. వారికొచ్చే మామాళ్లు తీసుకొని యువతకు అన్యాయం చేస్తున్నారు. తాడిపత్రి ప్రజలకు ఒక్కటే చెబుతున్నా. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా. – కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త

సోషల్‌ మీడియాదే కీలక పాత్ర
2014 ఎన్నికల్లో సోషియల్‌ మీడియా కీలక పాత్ర పోషించింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలంటే సోషియల్‌ మీడియాను ఉపయోగించుకోవాలి. ఫేస్‌బుక్, వాట్సాప్‌ ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అలాగే ఎదుటి వారు చేస్తున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించాలి.        – హర్ష, సోషల్‌ మీడియా ప్రతినిధి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top