‘నీకు డ్యాన్స్‌ నేర్పిస్తే మాత్రం ఎకరాలిస్తావా’

YSRCP Leader Parthasarathy Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రోమ్‌ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించినట్టు.. ఆంధ్రప్రదేశ్‌లో హోదా కోసం ప్రజలు ఉద్యమిస్తుంటే, చంద్రబాబు మాత్రం హ్యాపీ అమరావతి, సింగపూర్‌ అంటూ కాలయాపన చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉన్నా నలుగురు విదేశీయులు వచ్చి పొగిడితే చాలని చంద్రబాబు అనుకుంటున్నారన్నారు. సీఎం దగ్గర సీఎస్‌గా పనిచేసిన వారే అమరావతి ఎవరి రాజధాని అని ప్రశ్నించారని గుర్తుచేశారు. ఇపుడు బాబు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. రాజధానిలో బలహీన వర్గాలకు అవకాశమివ్వడం లేదని.. దళితులు, షెడ్యూల్ కులాలకు సంబందించిన రాజధాని కాదని తేలిపోయిందన్నారు. పేదవారు రాజధానిలో మాకేముందని భావిస్తున్నారన్నారు.

భూ సేకరణ చట్టాన్ని ప్రభుత్వం ఏమాత్రం పాటించడం లేదని తెలిపారు. కేవలం చంద్రబాబు వర్గీయుల కోసమే రాజధాని అని విమర్శించారు. బాబు, లోకేశ్‌, మంత్రులు కలిసి రియల్ఎస్టేట్‌ వ్యాపారంగా రాజధానిని మార్చారన్నారు. స్థలాలిచ్చిన వాళ్లకు ఏ ఒక్క సౌకర్యం ఏర్పాటు చేయలేదన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు తెల్లకాగితాలతో సరిపెట్టి.. చంద్రబాబుకు డ్యాన్స్ నేర్పించిన బాబాకు మాత్రం ఎకరాలకెకరాల భూములు ధారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. కొన్ని వేల రైతుల జీవితాల్లో చంద్రబాబు నిప్పులు పోశారని పార్థసారధి విరుచుకుపడ్డారు. పేదలు, రైతులకు సంబంధించిన విషయాలను ప్రభుత్వం విస్మరించిందన్నారు.

నాలుగేళ్లలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా కట్టకుండా... హ్యాపీ అమరావతి అంటారా అని ఆయన ప్రశ్నించారు. సింగపూర్‌ నుంచి ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చంద్రబాబు చెప్పాలన్నారు. హోదా ఎందుకు ఇవ్వరని ప్రజలు ప్రశ్నిస్తుంటే.. బీజేపీ అన్యాయం చేసిందని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఇప్పటికైనా చంద్రబాబు డ్రామాలు ఆపాలన్నారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేదు.. కనీసం పంటను అమ్ముకునే పరిస్థితి లేదు.. అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇంతవరకు న్యాయం చేయలేదు.. అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేయాలన్న విధానం తప్పితే, బాధితులకు పరిష్కారం చేయాలనే ఉద్దేశం కనిపించలేదని ఆయన మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top