‘చంద్రబాబు మళ్లీ కొత్త డ్రామా’

YSRCP Leader Ambati Rambabu Slams CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాపు రిజర్వేషన్లకు చట్టబద్ధత అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాకు తెరలేపారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు  విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చెబుతున్న కాపులకు 5 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత అనేది పచ్చి అబద్ధం అన్నారు. చట్టాలను వక్రీకరించి రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పడం బూటకమన్నారు. ఎన్నికల నేపథ్యంలో కాపులను మళ్లీ మోసం చేసేందుకే రిజర్వేషన్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. 

పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు ఇస్తే లాభమేంటి?
‘పసుపు కుంకుమ’  పేరుతో మరోసారి డ్వాక్రా మహిళలను మోసం చేయడానికి చంద్రబాబు కుట్ర పన్నారని అంబటి ఆరోపించారు. ‘చంద్రబాబు నాయుడు డ్వాక్రామహిళలకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తామంటున్నారు. అప్పుగా ఇచ్చి డ్వాక్రా మహిళలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక వాటిని ఇచ్చే పరిస్దితి ఉండదు. అటువంటప్పుడు పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు ఇస్తే లాభమేంటి’ అని అంబటి ప్రశ్నించారు. గత ఎన్నికల్లో రుణమాఫీ అని చెప్పి మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు పసుపు కుంకుమతో మోసం చేయడానికి సిద్ధపడ్డారని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు వైఎస్‌ జగన్‌ స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలకు ఎంత బాకీ ఉంటే అంత డబ్బును చేతుల్లో పెడతామని హామీ ఇచ్చారు. వైఎస్‌ జగన్ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శించారు. 

హోదా కోసం బాబు పోరాటం అంటే ఎవరు నమ్ముతారు
ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే అద్భుతం అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు అఖిలపక్షం పేరుతో హడావుడి చేస్తున్నారని అంబటి విమర్శించారు. ప్యాకేజీ ఇచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, అరుణ్‌ జైట్లీని సన్మానం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. హోదా కోసం బంద్‌లు చేస్తే వైఎస్సార్‌సీపీ నేతలను జైల్లో పెట్టించిన విషయాన్ని ప్రజలు మర్చిపోరన్నారు. ప్రత్యేక హోదా అంటే జైల్లో పెడతామని బెదిరిచిన చంద్రబాబు.. ఇప్పుడు హోదా కోసం పోరాటం అంటే నమ్మడానికి ప్రజలేం అమాయకులు కాదన్నారు. హోదా కోసం మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఆధ్యర్యంలో జరిగే సమావేశానికి వైఎస్సార్‌సీపీ హాజరుకావడం లేదని చెప్పారు. ఉండవల్లికి తాము వ్యతిరేకం కాదని.. ఆంధ్రులను మోసం చేసిన టీడీపీ, జనసేన నేతల మధ్య కూర్చోవడం ఇష్టం లేకనే అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడంలేదని పేర్కొన్నారు. రేపు చంద్రబాబు పెట్టిన అఖిలపక్ష సమావేశానికి కూడా తమ పార్టీ హాజరుకావడం లేదని చెప్పారు.

బోగస్‌ సర్వేల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఎన్నికల వేళ బోగస్‌ సర్వేల పేరుతో ప్రజలను గందరగోళ పరచడానికి టీడీపీ ప్రయత్నిస్తుందని అంబటి ఆరోపించారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ, లగడపాటి రాజగోపాల్‌లు అర్థరాత్రి చంద్రబాబును కలవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. బోగస్‌ సర్వేల పేరుతో వైఎస్సార్‌సీపీని దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. బోగస్‌ సర్వేలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top