ఆయన పెద్దన్న ఎలా అవుతారు?: విజయమ్మ

YS Vijayamma Speech At Naidupeta Public Meeting - Sakshi

సాక్షి, నెల్లూరు: ‘నాలుగున్నరేళ్ల పాటు ప్రజ సంక్షేమాన్ని పట్టించుకోని చంద్రబాబు నాయుడు.. ఎన్నికలకు రెండు నెలల ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేయకుండా వారిని బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చారు. పసుపు-కుంకుమ పేరిట మహిళలను మరోసారి మోసం చేస్తున్నారు. జగన్‌ పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 650 హామీల్లో ఏ ఒక్కదానిని చంద్రబాబు నెరవేర్చలేదు. రాష్ట్రంలోని మహిళలకు చంద్రబాబు తాను పెద్దన్నగా చెప్పుకుంటున్నారు. కానీ ఎన్నికలప్పుడు వచ్చే చంద్రబాబు పెద్దన్న ఎలా అవుతార’ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్నించారు. ఆదివారం నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో విజయమ్మ ప్రసంగించారు. వైఎస్‌ జగన్‌ తప్పుచేయలేదు కాబట్టి కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. చంద్రబాబు17 కేసుల్లో స్టే తెచ్చుకున్న విషయాన్ని గుర్తుచేశారు.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికింది ఎవరని ప్రశ్నించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సూళ్లురుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య, తిరుపతి ఎంపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాద్‌లను భారీ మెజారిటీతో గెలిపించమని కోరారు.

ఇంకా విజయమ్మ మాట్లాడుతూ.. ‘ఈ సారి జరగుతున్న ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్నవి. విలువలు, విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టాలి. మీ అందరికి మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డితో ఉన్న అనుబంధం కారణంగానే నేను ఇక్కడికి వచ్చాను. 30 ఏళ్ల​ పాటు రాజశేఖరరెడ్డి గారిని మీ భుజాలపై మోశారు. ప్రజలతో రాజశేఖరరెడ్డి గారి కటుంబానికి 40 ఏళ్ల అనుబంధం ఉంది. అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాత రాజశేఖర్‌రెడ్డి ప్రతి జిల్లాకు 70 నుంచి 80 సార్లు వచ్చి ఉంటారు. చాలా మందిని పేర్లు గుర్తుపెట్టుకుని మరి పిలిచే అప్యాయత ఆయనది. ఆయన సీఎం అయ్యేసరికి ఏ జిల్లాకు ఏం కావాలో తెలుసుకున్నారు. అధికారంలోకి రాగానే ప్రజలకు ఏం కావాలో చేశారు. కరెంట్‌ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు ఏ ఒక్కటి కూడా పెంచకుండా వైఎస్సార్‌  పాలన నడిచింది. రైతులను రాజు చేయాలని జలయజ్ఞం ప్రారంభించారు. దేశంలో మొత్తం 48 లక్షల ఇళ్లు కడితే.. వైఎస్సార్‌ కేవలం రాష్ట్రంలోనే 48 లక్షలు కట్టారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చేసుకుని పరిపాలన కొనసాగించారు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 71 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు. ప్రతి కుటుంబానికి ఆహార భద్రత ఉండాలని రెండు రూపాయలకే కిలో బియ్యంతోపాటు 110 రూపాయలకే 9 నిత్యవసరాలు అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ తీసుకువచ్చారు. ఆరోగ్య శ్రీ ద్వారా లక్షల మందికి ఆపరేషన్లు జరిగాయి. పేద పిల్లల చదువుకోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తీసుకువచ్చారు. 

మీకు వచ్చిన కష్టమే ఎక్కువ..
ఐదేళ్ల మూడు నెలల వైఎస్సార్‌ పాలన కాలంలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరికీ మేలు జరిగింది. కేంద్రం ధరలు పెంచిన.. ఆ భారం రాష్ట్రంపై పడకుండా రాజశేఖరరెడ్డి గారు చూశారు. 2009లో రాజశేఖరరెడ్డి గారు అభివృద్ధిని చూసి ఓటువేయమని ధైర్యంగా అడిగారు. రచ్చబండ కోసం వెళ్లే సమయంలో మూడేళ్లలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులను పూర్తిచేయాలి అని రాజశేఖరరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ చనిపోయాక మాకు వచ్చిన కష్టం కంటే.. రాష్ట్ర ప్రజలకు వచ్చిన కష్టమే ఎక్కువ. రాజశేఖరరెడ్డి గారి మరణం తరువాత ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వారిని పరామర్శించడానికి జగన్‌​ ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. పావురాల గుట్ట వద్ద నాన్న కోసం చనిపోయిన వాళ్లను పరామర్శిస్తానని జగన్‌ చెప్పారు. ప్రతి ఒక్కరు జగన్‌ బాబుని అక్కున చేర్చుకున్నారు. వైఎస్‌ జగన్‌ ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారు. మా నాన్న నాకు మాట తప్పడం నేర్పించలేదని జగన్‌ అన్నారు. సోనియా గాంధీ కేంద్ర మంత్రి పదవి ఇస్తానని చెప్పిన కూడా.. జగన్‌ ప్రజల్లోకి వెళతానని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉంటునే జగన్‌ ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు. దీంతో కాంగ్రెస్‌ పెద్దలు పొమ్మనలేక పోగ పెట్టారు. దీంతో జగన్‌ కాంగ్రెస్‌లో ఇమడలేక బయటకు వచ్చారు. దీంతో ఆయనపై కుట్రలు పన్ని ఇబ్బందులకు గురిచేశారు. పార్టీకి రాజీనామా చేస్తే కనీసం పిలిచి కూడా మాట్లాడలేదు.

ఆ లోటును జగన్‌ తీర్చుతాడు..
అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో జగన్‌ను, నన్ను ఓడించేందుకు భారీగా డబ్బులు ఖర్చుపెట్టారు. అయినా కానీ కడప ప్రజలు రికార్డు మెజారిటీతో జగన్‌ను గెలిపించారు. జగన్‌ పార్టీ పెట్టకముందు జగన్‌, వైఎస్సార్‌ చాలా మంచివారు. రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి గారు అంటే కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ అంటే రాజశేఖరరెడ్డి గారు అనే స్థాయికి ఆయన తీసుకువచ్చారు. అందుకు వాళ్లు ప్రతిఫలంగా ఎఫ్‌ఐఆర్‌లో రాజశేఖరరెడ్డి గారి పేరు చేర్చారు. వైఎస్సార్‌ కుటుంబం మీద అక్రమంగా 11 కేసులు పెట్టారు. ఆస్తులు అటాచ్‌ చేశారు. ఆ లోపు ఉప ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు రావడంతో విచారణకు పిలిచి జగన్‌ను జైల్లో పెట్టారు.  పార్టీ మూసివేస్తారని భావించారు. కానీ అప్పుడు జగన్‌ మన కోసం బయటకు వచ్చిన 18 మంది కోసం మీరు ప్రజల దగ్గరికి వెళ్లాలి.. వాళ్లని గెలిపించుకోవాలని చెప్పాడు. అప్పుడు నేను, షర్మిల బయటకు వస్తే ప్రతి ఒక్కరు మాకు తోడుగా నిలిచారు. అప్పుడు నేను జగన్‌తో మాట్లాడుతూ.. నాన్నతో పైకొచ్చిన ఏ ఒక్క నాయకుడు మనతో లేరు.. కానీ ప్రజలు మనతోనే ఉన్నారు వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పాను. షర్మిల, జగన్‌ పాదయాత్ర చేస్తే మీరంతా ఆదరించారు. మా నాన్న నన్ను ఒంటరి చేసి పోలేదని జగన్‌ గర్వంగా చెప్తారు. మేము ఏదైనా జవాబు చెప్పాలంటే అది ప్రజలకు మాత్రమే. రాజశేఖరరెడ్డి గారు లేని లోటు మాకు ఎవరు తీర్చలేరు కానీ.. మీకు మాత్రం ఆ లోటును జగన్‌ తీర్చుతారు.

రైతులను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చారు..
మీ అభిమానమే ఈ రోజు మమ్మలి నిలబెట్టింది. ఈ తొమ్మిదేళ్లు జగన్‌ మీ మధ్యనే ఉన్నారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చిన జగన్‌ అక్కడ ఉన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం, ఏపీకి ప్రత్యేక హోదా కోసం జగన్‌ ఢిల్లీ వేదికగా ధర్నాలు, దీక్షలు చేశారు. ప్రత్యేక హోదా సజీవంగా ఉంది అంటే అది జగన్‌ వల్లనే. గత ఎన్నికల్లో 650కు పైగా హామీలు ఇచ్చినా చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. బీజేపీ, పవన్‌ కల్యాణ్‌తో కలిసి వచ్చి అబద్దపు హామీలు ఇచ్చారు. ఈ సారి మోసపోవద్దు. జగన్‌ పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు. చంద్రబాబుకు ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడే వచ్చిందా?. చంద్రబాబు రైతులను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చారు. వడ్డీ లేకుండా రుణాలు దొరుకుతున్నాయా?. ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ అంటూ మహిళలను మోసం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు వచ్చే అన్న పెద్దన్న అవుతారా?. రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు దొరకుతుందా?. నీరు దొరకడం లేదు.. కానీ మద్యం విస్తారంగా దొరుకుతుంది. మూడు దఫాలుగా మద్యపాన నిషేధం చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు.

ఫీజు రీయింబర్స్‌ కూడా రావడం లేదు. ఆరోగ్య శ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. జగన్‌ అధికారంలోకి రాగానే అందరికీ వైద్యం అందుబాటులోకి వస్తుంది. నిరుద్యోగులకు భృతి అందుతుందా?. అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తాడు. విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తారు. ఎంత చదువు చదివిన ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. విద్యార్థులకు హాస్టల్‌, మెస్‌ చార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌​ చేయూత కింద 75 వేల రూపాయలు నాలుగు దఫాలుగా చెల్లిస్తాం. అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల నాటికి ఉన్న బకాయిలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తారు. మళ్లీ సున్నా వడ్డీలకే రుణాలు ఇస్తారు. ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తారు. అవ్వ తాతలకు పింఛన్‌ మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు మూడు వేల రూపాయలు పింఛన్‌ ఇస్తూ.. ప్రతి విషయంలో వారికి అండగా నిలుస్తాం. గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి ఊరిలో పది మందికి ఉపాధి కల్పిస్తారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేటట్టు చట్టం చేస్తాం. ప్రభుత్వ కాంట్రాక్టులు నిరుద్యోగ యువతకే అవకాశం ఇస్తాం.ప్రతి ఊరికి, పల్లెకు పైపులైన్ల ద్వారా తాగునీరు అందజేస్తాం. స్థానికంగా శ్రీ సిటీ కోసం రాజశేఖరరెడ్డి ఎంతగానో కృషి​ చేశారు. ఈ రోజు దాన్ని చూస్తే ఎంతో సంతోషంగా ఉంది.

చంద్రబాబుకు ప్రజాస్వామ్య విలువలు తెలుసా​?
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాతుంటే చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టలేదా?. అసెంబ్లీలో జగన్‌ మాట్లాడుతుంటే మైక్‌ కట్‌ చేసి అడ్డుకుంటారు. చంద్రబాబుకు అసలు ప్రజాస్వామ్య విలువలు తెలుసా?. వైఎస్‌ జగన్‌ మీద చంద్రబాబు అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రత్కేక హోదా రాకుండా చేసింది చంద్రబాబు కాదా?. ప్రజల సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఐటీ గ్రిడ్స్‌ చైర్మన్‌ను ఎందుకు కాపాడుతున్నారు. వైఎస్‌ జగన్‌ ఏ రోజు ఎవరితో పొత్తు పొట్టుకోలేదు. మాకు ప్రజలతోనే పొత్తు. ప్రత్యేక హోదా ఇచ్చేవారికి తాము మద్దతిస్తామని జగన్‌ చెబుతున్నారు. చంద్రబాబు పోలింగ్‌కు ముందు ఏమైనా చేస్తారు. ప్రలోభాలకు దిగుతారు. ఆయనకు గుండె నొప్పి వచ్చిందనే డ్రామాలు కూడా ఆడుతారు. అందరు ఓటు వేయండి. మంచి పాలన తెచ్చుకుందామ’ని తెలిపారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top