నిష్పాక్షిక దర్యాప్తు జరిపించండి

YS Jagan was filed petition in the High Court about investigation - Sakshi

చంద్రబాబు పాలనలో పోలీస్‌ వ్యవస్థ దుర్వినియోగంపై ఓ బాధితుడిగా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తున్నా

హత్యాయత్నం వెనుక కుట్రను వెలికి తీయాల్సిన పోలీసులు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారు

రాజకీయ లబ్ధి కోసం నన్ను అంతం చేసేందుకు ఉన్నత స్థాయిలో కుట్ర

ఇది హత్యాయత్నమే అనేందుకు రిమాండ్‌ నివేదిక కూడా ఆధారమే

రాష్ట్ర ప్రభుత్వంపై నింద రాకుండా ఘటనకు వ్యూహాత్మకంగానే విశాఖ ఎయిర్‌పోర్టు ఎంపిక

చంద్రబాబు, డీజీపీ నియంత్రణలో పోలీసులు ఉన్నంతవరకూ నిజాలు వెలుగులోకి రావు

ఈ పరిస్థితుల్లోనే హైకోర్టును ఆశ్రయించా

ప్రతిపక్ష నేత పిటిషన్‌లో వ్యక్తిగత ప్రతివాదిగా చంద్రబాబునాయుడు

నేడు విచారించనున్న న్యాయస్థానం

పార్టీ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా

నేను హైదరాబాద్‌లో దిగిన వెంటనే విమానాశ్రయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లానని... ఢిల్లీ నుంచి బీజేపీ నేతలు నాకు ఫోన్‌ చేయడంతో ఆ తరువాత ఆసుపత్రికి వెళ్లానని, ఇదంతా పబ్లిసిటీ కోసమే చేశానంటూ సీఎం చంద్రబాబు తప్పుడు, నిరాధార నిందారోపణలు అనేకం చేశారు. నా వెంట రాష్ట్ర ప్రభుత్వం ఎస్కార్ట్‌గా నియమించిన పోలీసులు ఉన్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి వాళ్లతో కలిసే వెళ్లా. తెలంగాణ హోంశాఖ, డీజీపీ నుంచి ఇందుకు సంబంధించిన సమాచారం తీసుకుంటే నిజం ఏమిటో తెలుస్తుంది.

అధికార పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై నింద పడకుండా చాలా జాగ్రత్తగా నన్ను అంతమొందించేందుకు ఉన్నత స్థాయిలో కుట్ర పన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు సాగిస్తున్న దర్యాప్తుపై నాకు అనేక సందేహాలు, అనుమానాలున్నాయి.
– ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

సాక్షి, హైదరాబాద్‌: తనపై ఈనెల 25వతేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నానికి సంబంధించి రాష్ట్ర పోలీసుల పక్షపాత దర్యాప్తుపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ న్యాయపోరాటం ప్రారంభించారు. హత్యాయత్నం కేసు దర్యాప్తు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని ఏదైనా స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ సిటీ ఏసీపీ, 5వ టౌన్‌ పీఎస్‌ ఎస్‌హెచ్‌వో, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ డీజీపీలను ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని వ్యక్తిగత హోదాలో ఇందులో ప్రతివాదిగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి గురువారం విచారణ జరపనున్నారు.

అందుకే నన్ను అంతమొందించాలని చూశారు...
‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పోలీసు వ్యవ్యస్థ దుర్వినియోగంపై ఓ బాధితుడిగా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తున్నా. రాజ్యాంగ, న్యాయ నిబంధనల మేరకు వ్యవహరించి నాపై జరిగిన హత్యాయత్నం వెనుక దాగిన భారీ కుట్రను వెలికి తీయాల్సిన పోలీసులు అందుకు విరుద్ధంగా దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారు. చట్టం నిర్దేశించిన విధానం మేరకు దర్యాప్తు చేయడంలో విఫలమయ్యారు. ఈ చట్ట విరుద్ధ, అన్యాయ, ఏకపక్ష, రాజ్యాంగ విరుద్ధ చర్యలను సవాలు చేస్తూ ఈ పిటిషన్‌ దాఖలు చేస్తున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు తప్పులపై, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రధాన ప్రతిపక్ష నేతగా అలుపెరగని పోరాటం చేస్తున్నా. ఇందులో భాగంగా ప్రజాసంకల్పయాత్ర పేరుతో రాష్ట్రమంతా పర్యటిస్తూ ప్రత్యేక హోదా సాధనలో ప్రభుత్వ వైఫల్యం, అసమర్థ పాలన, ఇతర హామీల అమలులో వైఫల్యాలను నిలదీస్తున్నా. నా ఈ యాత్రకు ప్రజల నుంచి వచ్చిన అపూర్వ స్పందనను భరించలేక అధికార పార్టీ, ఆ పార్టీ సభ్యులు, నాయకులు నన్ను అంతమొందించేందుకు తెగించారు. 

ఆపరేషన్‌ గరుడ పేరుతో తప్పుడు ప్రచారం...
రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్ర ప్రభుత్వమే ఆపరేషన్‌ గరుడ పేరుతో ఈ చర్యకు పాల్పడినట్లు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఆపరేషన్‌ గరుడను సినీనటుడు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు శివాజీ తెరపైకి తెచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అస్థిరపరిచే చర్యల్లో భాగంగా నాపై దాడి జరుగుతుందని ఆయన ముందే ఊహించినట్లు చెప్పారు. ఈ కథంతా కూడా ఓ కుట్రలో భాగమే. ప్రతిపక్ష నేతనైన నన్ను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ అది విఫలమైతే ఆపరేషన్‌ గరుడ పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాలని కుట్ర పన్నారు. 

అతని లక్ష్యం నా మెడే...
ఈ నెల 25న నేను హైదరాబాద్‌ చేరుకునేందుకు విశాఖ విమానాశ్రయంలోని లాంజ్‌ ఏరియాకు వచ్చా. నాతో పాటు ఎస్కార్ట్‌ పోలీసులు కూడా ఉన్నారు. లాంజ్‌లో వేచి ఉండగా, ఎయిర్‌పోర్ట్‌ అధికారుల అనుమతితో నిర్వహిస్తున్న రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఫలహారం అందించే నెపంతో నా వద్దకు వచ్చాడు. సెల్ఫీ దిగుతానని అడిగి, అకస్మాత్తుగా ఓ కత్తితో నా గొంతులో పొడిచేందుకు ప్రయత్నించాడు. నేను వేగంగా ప్రతిస్పందించి నా మెడను, భుజాన్ని పక్కను తిప్పాను. దీంతో దుండగుడు నా ఎడమ భుజంపై పొడిచాడు. వాస్తవానికి అతడి లక్ష్యం నా మెడ. హత్యాయత్నం చేసిన వ్యక్తిని అక్కడే నాతో ఉన్న పోలీసులతో సహా ఇతర వ్యక్తులు పట్టుకున్నారు.

తరువాత అతడ్ని రాష్ట్ర పోలీసులకు అప్పగించారు. ఆ క్షణంలో నేను వేగంగా ప్రతిస్పందించడంతో హత్యాయత్నం నుంచి తప్పించుకున్నా. ప్రాథమిక చికిత్స తరువాత రక్తంతో తడిచిన నా చొక్కాను మార్చుకుని విమానం ద్వారా హైదరాబాద్‌ వచ్చా. హైదరాబాద్‌ చేరుకున్న వెంటనే వీఐపీ లాంజ్‌లో నన్ను పరీక్షించి తగిన చికిత్స నిమిత్తం నేరుగా సిటీ న్యూరో ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరిశీలించి నాకు అయిన గాయానికి 9 కుట్లు వేశారు. నిందితుడు విష పదార్థాలను ఉపయోగించాడా? అన్న అనుమానంతో వైద్యులు కొన్ని శాంపిళ్లను తీసుకున్నారు. హత్యాయత్నం జరిగిన నాటి నుంచి నేను తిరిగి కోలుకునే మధ్య సమయంలో జరిగిన పరిణామాలు నన్ను షాక్‌కు గురి చేశాయి. రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను అంతమొందించేందుకు భారీ కుట్ర జరిగినట్లు నాకు అర్థమైంది.

ముఖ్యమంత్రివి తప్పుడు, నిరాధార నిందారోపణలు...
నాపై హత్యాయత్నం జరిగిన గంటలోపు డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ ఘటనకు పాల్పడిన వ్యక్తి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమాని అని, పబ్లిసిటీ కోసమే ఈ పని చేశాడని చెప్పారు. నాపై జరిగిన హత్యాయత్నం తీవ్రమైనది కాదని చెప్పేందుకు డీజీపీ అలా మాట్లాడారు. ఎటువంటి ఆధారాలు లేకుండా డీజీపీ ఈ ప్రకటన చేశారు. అదే రోజు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ, తన ప్రతిష్టను దెబ్బతిసే చర్యల్లో భాగంగానే ఈ ఘటన జరిగిందని చెప్పారు.

ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసేందుకే ఆపరేషన్‌ గరుడలో భాగంగా, కేంద్ర ప్రభుత్వ యత్నాల్లో భాగంగానే నాపై దాడి జరిగిందన్నారు. నాపై జరిగిన హత్యాయత్నం అంత తీవ్రమైనది కాదని, విమానాశ్రయం నుంచి నేరుగా నేను నా ఇంటికి వెళ్లానని, తరువాత ఢిల్లీ నుంచి బీజేపీ నేతలు నాకు ఫోన్‌ చేయడంతో ఆ తరువాత ఆసుపత్రికి వెళ్లానని, ఇదంతా కూడా పబ్లిసిటీ కోసమే చేశానంటూ చంద్రబాబునాయుడు తప్పుడు, నిరాధార నిందారోపణలు అనేకం చేశారు. నావెంట రాష్ట్ర ప్రభుత్వం ఎస్కార్ట్‌గా నియమించిన పోలీసులు ఉన్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి వాళ్లతో కలిసే వెళ్లా. తెలంగాణ హోంశాఖ, డీజీపీ నుంచి ఇందుకు సంబంధించిన నుంచి సమాచారం తీసుకుంటే నిజం ఏమిటో తెలుస్తుంది.

దేవుడి దయతో వెంట్రుక వాసిలో తప్పించుకున్నా...
ఈ మొత్తం ఘటనను తక్కువ చేసి చూపే చర్యల్లో భాగంగా నా భుజానికి 0.5 సెంటీమీటర్ల మేరే గాయమైనట్లు చెప్పడం ప్రారంభించారు. నాకు వైద్యం అందించిన డాక్టర్లు ధ్రువీకరించిన ప్రకారం నా భుజానికి 3.5 సెంటీమీటర్ల లోతు మేర గాయమైంది. ఈ గాయానికి 9 కుట్లు వేసినట్లు కూడా వైద్యులు చెప్పారు. ఒకవేళ ఈ హత్యాయత్నంలో నా కెరొటిడ్‌ ఆర్టరీకి గాయమై ఉంటే పర్యవసానాలు తీవ్రంగా ఉండేవి. వాటిని తలచుకుంటేనే ఆందోళనగా ఉంది. హత్యాయత్నం వ్యూహకర్తల ప్రాథమిక ఉద్దేశం ఇదే. అయితే నేను దీని నుంచి దేవుడి దయతో వెంట్రుకవాసిలో తప్పించుకున్నా. నాపై జరిగింది హత్యాయత్నమే అనేందుకు రిమాండ్‌ రిపోర్ట్‌ కూడా ఆధారమే. నిందితుడి జేబులో 9–10 పేజీల లేఖ ఉందని విలేకరుల సమావేశంలో డీజీపీ చెప్పినట్లు నాకు తెలిసింది. పలు పత్రికల్లో చూపిన ప్రకారం ఆ లేఖలో రెండు మూడు వేర్వేరు చేతి రాతలున్నాయి. నేను ముఖ్యమంత్రిని అయిన తరువాత చేయాల్సిన పనుల గురించి ప్రస్తావించినట్లు పత్రికల్లో వచ్చింది. వాస్తవానికి అటువంటి పదవిని అధిరోహించకూడదన్న ఉద్దేశంతోనే నన్ను అంతమొందించేందుకు నాపై హత్యాయత్నం జరిగింది.

గంట వ్యవధిలోనే డీజీపీ, టీడీపీ నేతలు రంగంలోకి దిగారు...
హత్యాయత్నం చేసిన వ్యక్తిని వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడిగా చూపేందుకు ఈ ఘటన జరిగిన గంటలోనే కొన్ని ఫ్లెక్సీలను విడుదల చేశారు. 11 నెలల క్రితం సంక్రాంతి సమయంలో శుభాకాంక్షలు తెలుపుతూ ముద్రించిన ఫ్లెక్సీలను గంట వ్యవధిలోనే డీజీపీ, తెలుగుదేశం పార్టీ నేతలు బయటకు తీసుకురావడం ఆశ్చర్యం కలిగించింది. ఈ ఫ్లెక్సీ ఫోటోలకు సంబంధించి రకరకాల చర్చలు ప్రారంభించారు. ఆ ఫ్లెక్సీపై రోజాపువ్వు ఉన్నట్లు, కొన్నింటిపై అది లేకుండా, మరికొన్నింటిపై గద్ద ఉన్నట్లు చూపడం ప్రారంభించారు. ఆపరేషన్‌ గరుడలో భాగంగానే ఇదంతా జరిగిందని నమ్మించేందుకే టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ చేశారు. ఇవన్నీ కూడా హత్యాయత్నం తరువాత అతి తక్కువ సమయంలోనే చోటు చేసుకున్న పరిణామాలు. దర్యాప్తును నీరుగార్చేందుకు, తప్పుదోవ పట్టించేందుకు చేసిన యత్నాలు. రిమాండ్‌ రిపోర్టును పరిశీలిస్తే అటు డీజీపీ, ఇటు చంద్రబాబునాయుడు చెప్పినవన్నీ అవాస్తవాలేనని ఇట్టే అర్థమవుతోంది. నాపై జరిగింది హత్యాయత్నమేనని 5వ టౌన్‌ పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

నాపై భారీ కుట్రకు సాక్ష్యాలున్నాయి...
వీటన్నింటిని బట్టి చూస్తే నాపై జరిగిన హత్యాయత్నం నన్ను అంతమొందించేందుకు జరిగిన కుట్రేనని అర్థమవుతోంది. ఒకవేళ ఇది విఫలమైతే దాన్ని ఆపరేషన్‌ గరుడ పేరుతో బీజేపీ పథక రచన చేసినట్లుగా  రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని కుట్రదారులు భావించారు. ఈ మొత్తం వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే నాపై జరిగిన హత్యాయత్నం వెనుక ఉన్నది ఒక్క వ్యక్తే కాదని, పైస్థాయిలో భారీ ఎత్తున కుట్ర ఉందని అర్థమవుతోంది. 

ఇందుకు సాక్ష్యాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. 
1. హత్యాయత్నం చేసిన వ్యక్తి తన వెంట రెండు కత్తులను ఉంచుకున్నాడు. వీటిని విమానాశ్రయంలో రెండు భద్రతా వలయాలు, లోహపు వస్తులను గుర్తించే మెటల్‌ డిటెక్టర్లను దాటి మరీ తీసుకెళ్లాడు. 
2. నిందితుడికి నేర చరిత్ర ఉంది. దాన్ని పట్టించుకోకుండా విమానాశ్రయంలో ఉద్యోగం ఇవ్వడం తీవ్రమైన లోపమే.
3. హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తికి టీడీపీ నేత హర్షవర్థన్‌ చౌదరి తాను విమానాశ్రయంలో నిర్వహిస్తున్న రెస్టారెంట్‌లో ఉద్యోగం ఇచ్చారు. 2014లో ఈ హర్షవర్థన్‌ చౌదరి గాజువాక నియోజకవర్గ టిక్కెట్‌ను ఆశించారు. 
4. నిందితుడు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు. అతడు స్వగ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్‌ ఆఫీసర్‌ బేరర్‌గా ఉన్నాడు. జన్మభూమి కమిటీల సిఫారసుతో అతడికి రెండు ఇళ్లు కేటాయించారు. ఈ జన్మభూమి కమిటీలు గ్రామస్థాయిలో టీడీపీ గ్రూపు కమిటీలుగా గుర్తించబడ్డాయి. దీన్నిబట్టి నిందితుడు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిగా రూఢీ అవుతోంది. 
5. హత్యాయత్నానికి చాలా తెలివిగా  విశాఖపట్నం విమానాశ్రయాన్ని ఎంచుకున్నారు. విమానాశ్రయం సాంకేతికంగా సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఘటన జరిగితే నింద రాష్ట్ర ప్రభుత్వంపై రాకుండా ఉంటుందన్న ఉద్దేశంతోనే విమానాశ్రయాన్ని ఎంచుకున్నారు.
6. అన్నింటికంటే ముఖ్యమైనది.. ఈ నెల 29న టీవీల్లో ప్రసారమైన వార్తా కథనాల ప్రకారం నాపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ నిందితుడు కేకలు వేశాడు. దీన్నిబట్టి వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు కుట్రదారులు ఆ వ్యక్తిని కూడా చంపవచ్చని అనిపిస్తోంది.

నింద పడకుండా అంతం చేసేందుకు కుట్ర పన్నారు...
వీటన్నింటిని బట్టి, అధికారపార్టీ, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై నింద పడకుండా, చాలా జాగ్రత్తగా నన్ను అంతమొందించేందుకు ఉన్నతస్థాయిలో కుట్ర పన్నారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు సాగిస్తున్న దర్యాప్తుపై నాకు అనేక సందేహాలు, అనుమానాలున్నాయి. నేను ఆసుపత్రిలో ఉండగా ఏపీ పోలీసుల బృందం నా వద్దకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నియంత్రణలో జరుగుతున్న ఈ దర్యాప్తుపై నాకు నమ్మకం లేదని నేను వారికి స్పష్టంగా చెప్పా. రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని ఏదైనా స్వతంత్ర సంస్థతో దర్యాప్తుతో చేయించాలని కోరా. దాడి జరిగిన గంటలోనే డీజీపీ చేసిన ప్రకటనే దర్యాప్తు జరుగుతున్న తీరుకు సాక్ష్యం. దర్యాప్తునకు నేను సహకరించలేని పరిస్థితిని వారే సృష్టించారు. ఈ భారీ కుట్రపై దర్యాప్తును వీలైనంత త్వరగా ముగించేందుకే విశాఖపట్నం ఏసీపీ నేతృత్వంలో ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేశారు. దర్యాప్తును వేగంగా పూర్తి చేసేందుకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద నోటీసు పంపారు. దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని నన్ను కోరారు. దీన్నిబట్టి వారి తొందర అర్థమవుతోంది. నాపై హత్యాయత్నం జరిగిందని రిమాండ్‌ రిపోర్ట్‌లో రాశారు. అయితే కుట్ర కోణాన్ని విస్మరించారు.
 
వాస్తవాలు వెలుగులోకి రావాలంటే నిష్పాక్షిక దర్యాప్తు అవసరం...
అసలు విషయాలను పక్కదోవ పట్టించేందుకే చంద్రబాబునాయుడు నాపై జరిగిన హత్యాయత్నాన్ని కేంద్ర ప్రభుత్వ కుట్రగా ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయి, నిష్పాక్షిక, స్వతంత్ర దర్యాప్తు ఎంతైనా అవసరం. అంతేకాక ముఖ్యమంత్రి, డీజీపీ, ఇతర మంత్రులు నాపై హత్యాయత్నం ఘటనను తక్కువగా చూపేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో నిష్పాక్షిక దర్యాప్తు అవసరం ఎంతైనా ఉంది. ఈ ఘటన  వెనుక ఉన్నది ఒక్కరా? లేదా పలువురికి సంబంధం ఉందా? పబ్లిసిటీ కోసమే ఈ పని చేశారా? అన్న విషయాలు వెలుగులోకి రావాలంటే స్వతంత్ర సంస్థ దర్యాప్తు చాలా అవసరం.

చంద్రబాబు, డీజీపీ నియంత్రణలో పోలీసులు పనిచేస్తున్నంత వరకు నిష్పాక్షిక దర్యాప్తు 
ఏమాత్రం సాధ్యం కాదు. నిష్పాక్షిక విచారణ రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో ఒకటి. ఈ విచారణ ప్రజా విశ్వాసాన్ని చూరగొనేలా ఉండాలి. జరిగిన ప్రతి నేరం కూడా సమాజంపై జరిగినట్లే. నిష్పాక్షికంగా జరపాల్సిన దర్యాప్తును ప్రభుత్వమే పక్కదారి పట్టించడం, నీరుగార్చడం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో నాపై జరిగిన హత్యాయత్నంపై దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశమే లేదు.అందువల్ల ఓ బాధితుడిగా నిష్పాక్షిక విచారణ కోరే హక్కు నాకు ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నంత కాలం ఈ కేసులో పోలీసుల దర్యాప్తుపై నాకు ఏమాత్రం నమ్మకం లేదు. ఈ పరిస్థితుల్లోనే నిష్పాక్షిక దర్యాప్తు కోసం హైకోర్టును ఆశ్రయించా’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

పార్టీ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా....
జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు బాధ్యతలను ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్న ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదా పడింది. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి కోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)తో జత చేయాలా? వద్దా? అన్న అంశంపై న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి గురువారం నిర్ణయం తీసుకోనున్నారు. అంతకు ముందు పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ జగన్‌పై హత్యాయత్నం వెనుక భారీ కుట్ర ఉందని, అందువల్ల స్వతంత్ర సంస్థ దర్యాప్తు కోరుతున్నామని తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి స్పందిస్తూ, ‘ఇదే అంశంపై ప్రధాన న్యాయమూర్తి కోర్టులో పిల్‌ దాఖలైంది కదా. దాని సంగతి ఏమిటి? దానితో ఈ వ్యాజ్యాన్ని జత చేస్తా’ అని పేర్కొన్నారు.

ఇందుకు నిరంజన్‌రెడ్డి సమాధానమిస్తూ, ఆ పిల్‌పై విచారణను వచ్చే వారం చేపట్టాలని పిటిషనర్ల న్యాయవాది కోరారని, అంతేకాక ఆ పిల్‌లో అభ్యర్థనకూ, తాము దాఖలు చేసిన ఈ పిటిషన్‌కూ సంబంధం లేదని చెప్పారు. అందువల్ల ఈ వ్యాజ్యాన్ని దానికి జత చేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే న్యాయమూర్తి.. దాదాపు ఒకే అంశంపై రెండు సమాంతర విచారణలు అవసరం లేదని, ఈ వ్యాజ్యాన్ని పిల్‌తో జత చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలిస్తానన్నారు. దీనిపై నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ... పిల్‌లో అభ్యర్థన విమానాశ్రయాల్లో భద్రతకు సంబంధించినది, తమ వినతి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు అని నివేదించారు. పిల్‌లో అభ్యర్థను పరిశీలించవచ్చునని, ఆ తరువాత ఈ వ్యాజ్యాన్ని  దానితో జత చేసే విషయంపై నిర్ణయం తీసుకోవచ్చని ప్రతిపాదించారు. అభ్యర్థన పరిశీలన నిమిత్తం ఆ పిల్‌ కాపీని కోర్టు ముందుంచుతానని చెప్పారు. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను గురువారానికి వాయిదా వేశారు.

‘‘అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే నాపై జరిగిన హత్యాయత్నాన్ని చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వ కుట్రగా ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయి, నిష్పాక్షిక, స్వతంత్ర దర్యాప్తు ఎంతైనా అవసరం. ముఖ్యమంత్రి, డీజీపీ, మంత్రులు నాపై హత్యాయత్నం ఘటనను తక్కువగా చూపేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో నిష్పాక్షిక దర్యాప్తు అవసరం ఎంతైనా ఉంది. సీఎం చంద్రబాబు, డీజీపీ నియంత్రణలో పోలీసులు పనిచేస్తున్నంత వరకు నిష్పాక్షిక దర్యాప్తు ఏమాత్రం సాధ్యం కాదు.’’

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top