ఎక్కడో ఐటీ సోదాలు జరిగితే నీకు భయమెందుకు బాబూ?

Ys jagan praja sankalpa yatra in Vizianagaram District - Sakshi

ఆ తీగ నీ డొంక కదుపుతుందనా? 

గుర్ల సభలో సూటి ప్రశ్నలతో విరుచుకుపడిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌   

నా ఇంటిపై సీబీఐ దాడిచేస్తే కేంద్రం కుట్ర అనలేదే?

నువ్వు, కాంగ్రెస్‌ నాపై కేసులు పెట్టడం అన్యాయం అనిపించలేదా?.. రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం ద్రోహం అన్పించలేదా

ఇప్పుడు ఐటీ సోదాలంటే ఓట్ల కొనుగోలుకు పంపిన డబ్బు వివరాలు తెలుస్తాయనా?

దోచుకున్న రూ.4 లక్షల కోట్లు కూపీ లాగుతారనా?

విదేశాలకు తరలించిన డబ్బు జాడ తెలుస్తుందనా?

ఎవరిపైనో ఐటీ సోదాలు చేస్తే కేంద్ర, రాష్ట్రాల యుద్ధమంటావా?

కేబినెట్‌లో పెట్టి చర్చిస్తావా? ఇంతకన్నా దారుణముంటుందా?

బాబుగారి మాటలకు ఎల్లో మీడియా తానతందాన

ఆయన అవినీతిపై వార్తలుండవు.. అక్రమాలు టీవీల్లో కనిపించవు  

వైఎస్సార్‌సీపీకే ప్రజలు పట్టం కడతారని సర్వే చెప్పినా వార్త రాదు

బాబు బీజేపీ ఒళ్లో కూర్చుని దీక్ష చేస్తే నవ నిర్మాణ దీక్ష అని, కాంగ్రెస్‌ ఒళ్లో కూర్చుని చేస్తే ధర్మపోరాట దీక్ష అని ఎల్లో మీడియా చెబుతుంది. బాబు దిగ జారుడు రాజకీయాలను మన మంతా పొగడాలని అది కోరుకుంటోంది.

ఆదాయ పన్ను శాఖ ఎక్కడో సోదాలు చేస్తుంటే వణికిపోతున్న చంద్రబాబు.. దాన్ని రాష్ట్రంపై దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆశ్చర్యమేమిటంటే, కేబినెట్‌ మీటింగ్‌ పెట్టి ఆ సోదాల  గురించి చర్చించాడు. ఇంతకన్నా దారుణమైన ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉంటాడా?

2016 – 17లో ప్రైవేట్‌ కంపెనీలు, వ్యక్తులపై ఐటీ దాడులు జరిగాయి. అప్పుడు మాట్లాడని ఈ వ్యక్తి.. ఇప్పుడు రాష్ట్రానికి,  కేంద్రానికి యుద్ధమన్నట్టు చర్చించుకోవడం దారుణం. చంద్రబాబును నేను కొన్ని ప్రశ్నలడుగుతున్నా.  ఆ రోజు మీరు, కాంగ్రెస్‌ కలిసి నాపై దొంగ కేసులు పెట్టినప్పుడు.. సీబీఐ నా ఇంటిపై దాడులు చేసినప్పుడు ఈ రాష్ట్రంపై యుద్ధం జరుగుతున్నట్టు మీకు అన్పించలేదా? ఓదార్పు కోసం మాట మీద నిలబడ్డ వ్యక్తిని రాజకీయంగా అణగదొక్కేందుకు చేసిన కుట్రగా.. కేంద్రం చేసిన అన్యాయంగా కన్పించలేదా? ఇవాళ ఏదో జరిగిపోయిందని ఎందుకు గింజుకుంటున్నావ్‌?  

ఎల్లో మీడియాను చూస్తుంటే ఓ విషయం గుర్తుకొస్తోంది. జర్మనీలో హిట్లర్‌ పాలనలో గోబెల్‌ అనే మంత్రి ఉండేవాడు. ఆయన ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్పీ చెప్పీ అదే నిజమని నమ్మించేవాడు. నారావారి పాలనలో టీవీలు, పేపర్ల రూపంలో పది మంది గోబెల్స్‌ ఉన్నారు.  – ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ‘ఆదాయపు పన్ను శాఖ ఎవరి ఇళ్లలోనో సోదాలు చేస్తే నువ్వెందుకు ఉలిక్కి పడుతున్నావు చంద్రబాబూ? దాన్ని రాష్ట్రంపై కేంద్రం చేసే దాడి అనడమేంటి? తీగలాగితే నీ డొంక కదులుతుందనే భయమా? ఓట్లు కొనేందుకు ఒక్కో నియోజకవర్గానికి పంపిన రూ.30 కోట్ల గుట్టు బయటి కొస్తుందని వణుకా? ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనని కలవరపాటా? నాలుగేళ్లుగా రూ.4 లక్షల కోట్లు దోచుకున్న అవినీతి బాగోతం వెలుగు చూస్తుందనే కంగారా? విదేశాలకు తరలించిన సొమ్ము వివరాలు బయటి కొస్తాయని భయపడుతున్నావా?’ అంటూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 280వ రోజు ఆదివారం ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకర్గంలోని గుర్లలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. చంద్రబాబుకు తాన తందాన అంటున్న ఎల్లో మీడియాపై నిప్పులు చెరిగారు. అధికారంలోకొచ్చిన ఆరు నెలల్లో ఆగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..
 
నువ్వెందుకు గింజుకుంటున్నావు బాబూ?
‘‘ఎవరి ఇంటి మీదో ఆదాయపు పన్ను శాఖ వారు దాడులు చేస్తుంటే రెండు రోజులుగా చంద్రబాబు శివాలెత్తిపోతున్నాడు. అసలు నువ్వెందుకు గింజుకుంటున్నావ్‌ చంద్రబాబూ? నాకు ఆశ్చర్యమేస్తోంది. ఆయన వణికిపోవడానికి కారణమేంటో తెలుసా? ఐటీ అధికారులు ఎక్కడ తీగ లాగితే ఆయన ఇంట్లో ఉన్న డొంక కదులుతుందని భయపడుతున్నాడు. ఒక్కొక్కరికీ రూ.3 వేల నుంచి రూ.5 వేలు ఇచ్చి ఓట్లు కొనేందుకు.. ప్రతీ నియోజకవర్గానికి ఆయన ఇప్పటికే రూ.30 కోట్ల డబ్బులు చేర్చాడు.

వాటినెక్కడికి చేర్చాడన్న వివరాలు ఎక్కడ బయటికొస్తాయోనని భయపడుతున్నాడు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికీ రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లిచ్చి సంతలో పశువుల్లా కొనుగోలు చేసిన వివరాలు ఎక్కడ బయట పడతాయోనని వణికిపోతున్నాడు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, కరెంట్‌ కొనుగోళ్లు, మద్యం, కాంట్రాక్టర్లు, రాజధాని భూములు, గుడి భూములు, విశాఖ భూములు చివరకు దళితుల భూములనూ చంద్రబాబు వదిలిపెట్టకుండా దోచేస్తున్నాడు. నాలుగేళ్లలో రూ.4 లక్షల కోట్లు దోచేసిన సంగతులు ఎక్కడ బయటకొస్తాయోనని వణికిపోతున్నాడు. దోచుకున్న డబ్బు విదేశాలకు ఎలా తరలించాడో తెలిసిపోతుందేమోనని భయపడుతున్నాడు.  
 
బాబుకు ఎల్లో మీడియా బాకా
ఎక్కడో ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు నాయుడుకు తోడుగా నిలబడుతూ, ఆయన్ను మోస్తున్న ఎల్లో మీడియాను చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. ఆయన్ను తాండ్ర పాపారాయుడిగా, కేంద్రంపై పోరాడుతున్న యోధుడిగా, హీరోగా చూపించాలని ప్రయత్నిస్తోంది. ఆరాటపడుతోంది. చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దంటే దాన్ని గొప్ప విషయంగా చూపిస్తుంది. హోదా వల్ల లాభం ఉండదని చూపించే ప్రయత్నం చేస్తుంది.

హోదా కోసం పోరాడతానని చంద్రబాబు చిట్ట చివరి నిమిషంలో ప్లేటు మారిస్తే దాన్ని ఇంకా గొప్ప విషయంగా చిత్రీకరిస్తుంది. ప్రత్యేక హోదా సంజీవని అని ఉదయం బాబు అంటే.. ఈ ఎల్లో మీడియా అవును.. అవును అంటుంది. ఆ తర్వాత ఇదే పెద్దమనిషి హోదా సంజీవని కాదు.. ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయంటే మధ్యాహ్నానికే ప్లేటు మార్చి అవునవునంటూ తలూపుతుంది. ఇదే చంద్రబాబు పడుకుని లేచిన తర్వాత హోదాకు నేనెప్పుడూ వ్యతిరేకిని కాదు.. ఎప్పుడూ ఆరాట పడుతున్నానని చెబితే ఇదే ఎల్లో మీడియా.. హోదా కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు నిద్రపోకుండా కష్టపడ్డాడని రాస్తుంది.
 
బాబు బాగే తప్ప.. ప్రజల కష్టాలు పట్టవు
చంద్రబాబు ఏది చెప్పినా సై అంటుంది ఈ ఎల్లో మీడియా. కానీ, మూడుసార్లు ఎందుకు ప్లేటు మార్చావని నిలదీయదు. చంద్రబాబు నందిని చూపించి పంది అన్నా, పందిని చూపించి నంది అన్నా అదే నిజమంటుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండా మంత్రి పదవులు తీసుకున్నా.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లిచ్చి కొనుక్కున్నా... ఆ మీడియాకు తప్పుగా అన్పించదు. విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నా ఏ రోజూ టీవీల్లో కన్పించదు. పేపర్లో రాయరు.

ప్రత్యేక హోదాను తాకట్టు పెడుతున్నా, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు కోసం ఏం చేయడానికైనా వెనుకాడదీ ఎల్లో మీడియా. ఆయన బీజేపీకి జై అంటే జై.. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు జై అంటే జై అని రాస్తుంది. అలా రాయడమే కాదు.. ఏమాత్రం మొహమాటం లేకుండా ఇతరుల మీద బురదజల్లుతుంది. చంద్రబాబు లక్షల కోట్లు దోపిడీ చేస్తే.. దాన్ని మనమంతా అభివృద్ధి అనుకోవాలని ఈ ఎల్లోమీడియా కోరుకుంటోంది. పోలవరం కమీషన్ల కోసం చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టినా, ఆయన ఢిల్లీలో చక్రం తిప్పాడని మనం అనుకోవాలని ఈ మీడియా కోరుతోంది.  
 
పరాకాష్టకు చేరిన దిగజారుడు
రాష్ట్రంలో ఎల్లో మీడియా ఎంతగా దిగజారిందంటే.. అక్టోబర్‌ 5న ఓ ఎన్నికల సర్వే వచ్చింది. ప్రఖ్యాతిగాంచిన సీ ఓటర్‌ అనే సంస్థ ఆ సర్వే చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటేస్తారని ఆ సంస్థ ఓటర్లను అడిగింది. 25కు 21 లోక్‌సభా స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే ఓట్లేస్తామని ఆ సర్వేలో ప్రజలు చెప్పారు.

టీడీపీకి కేవలం నాలుగే స్థానాలొస్తాయని ఆ సర్వే చెప్పింది. కానీ.. ఈనాడు దినపత్రిలో (ఆ పత్రిక ప్రతి చూపుతూ) వచ్చిన వార్త ఇది. ఈ వార్తలో చంద్రబాబుకు నాలుగే స్థానాలు వస్తాయని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు 21 స్థానాలు వస్తాయని సర్వే సంస్థ చెప్పిన మాటలు ఎక్కడా లేవు. కన్పించిందేంటంటే.. మళ్లీ అధికారంలోకి ఎన్డీఏ అట. మోదీకి స్వల్పంగా తగ్గిన ఆదరణట. ఎన్డీఏకి 276... యూపీఏకి 112 స్థానాలు.. కానీ చంద్రబాబుకు ఎన్ని అనేది మాత్రం ఈనాడు పత్రికలో కన్పించదు.
 
తోటపల్లి తానే చేసినట్టు పోజులు
పాదయాత్రలో రైతన్నలు, ప్రజలు అనేక విషయాలు చెప్పారు. తోటపల్లి ప్రాజెక్టు గురించి చెప్పారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ఏనాడూ ప్రాజెక్టు కట్టాలని ఆలోచించలేదని తెలిపారు. దివంగత మహానేత వైఎస్‌ హయాంలో ఈ ప్రాజెక్టు పరుగులు పెట్టిందని గర్వంగా చెప్పారు. మళ్లీ చంద్రబాబు రాగానే పరిస్థితి మొదటికొచ్చిందన్నారు. వైఎస్‌ హయాంలోనే 90 శాతం పనులైపోయినా, మిగిలిన 10 శాతం పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు.

లక్షా 35 వేల ఎకరాలకు సాగునీరిచ్చే ఈ ప్రాజెక్టు 65 వేల ఎకరాలకు కూడా సరిగ్గా నీరందించలేని పరిస్థితిలో ఉందన్నారు. చంద్రబాబు కంప్యూటర్లకు కూడా అబద్ధాలు నేర్పగలిగిన దిట్ట. ఇక్కడకు వచ్చినప్పుడు తోటపల్లి గట్టుమీద పడుకుని కష్టపడి పని పూర్తి చేశానని పోజులు కొడుతున్నాడన్నా అని చెప్పారు. కొత్త ప్రాజెక్టుల మాట దేవుడెరుగు.. ఉన్నవాటికే దిక్కులేదన్నారు.  
 
పెట్టుబడులెక్కడ? ఉద్యోగాలెక్కడ?
రాష్ట్రానికి రూ.40 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉద్యోగాలొచ్చాయట. విశాఖలో మీటింగ్‌ పెట్టి చెబుతాడు చంద్రబాబు. మీకెక్కడైనా కన్పించాయా? ఇక్కడ పరిస్థితి చూస్తే ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి. పరిశ్రమలు మూత పడుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. రాష్ట్రంలో 35 ఫెర్రో ఎల్లాయిస్‌ కంపెనీలుంటే.. ఇదే జిల్లాలో 16 వరకు ఉన్నాయి. చంద్రబాబొచ్చాక  చీపురుపల్లిలో ఆరుంటే మూడు మూత పడ్డాయి. వైఎస్‌ అధికారంలో ఉన్న 2009లో ఫెర్రోఎల్లాయిస్‌కు యూనిట్‌ రూ. 2.65కే విద్యుత్‌ ఇచ్చారు.

ఈయన రాగానే యూనిట్‌కు రూ.5.35 వసూలు చేస్తున్నాడు. ఇక కంపెనీలు మూతపడవా? 34 జూట్‌ మిల్లులుంటే చంద్రబాబు వచ్చాక 16 మూతపడ్డాయి. ఇదే జిల్లాలో ఎనిమిదింటికి నాలుగు మూత పడ్డాయి. నాన్నగారి హయాంలో జూట్‌ మిల్లులకు యూనిట్‌ రూ.3.15కే కరెంట్‌ ఇచ్చారు. ఇప్పుడు అదే కరెంట్‌ యూనిట్‌కు రూ.8 వసూలు  చేస్తున్నారు. ఇలా కరెంట్‌ రేట్లు బాదుతుంటే పరిశ్రమలన్నీ మూత పడుతూ పిల్లలు వలసలు పోతుంటే ఈయన మాత్రం  రూ.20 లక్షలు పెట్టుబడులు, 40 లక్షలు ఉద్యోగాలొచ్చాయని పోజులు కొడతాడు.
 
ఆరు నెలల్లో అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట
అనేక మంది అగ్రిగోల్డ్‌ బాధితులు వచ్చారు. రాష్ట్రంలో ఉన్న 19 లక్షల మందిలో ఎక్కువ మంది ఉత్తరాంధ్ర వాళ్లేనని చెప్పారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అని తెలిపారు. ఒక వైపు అగ్రిగోల్డ్‌ ఆస్తులను తన బినామీలతో చంద్రబాబు కాజేస్తున్నాడు. మరోవైపు పద్ధతి ప్రకారం ఆస్తులను వేలానికి రాకుండా చేస్తున్నాడు. మంచి ఆస్తులను పక్కన పెట్టించి, వేలానికి వచ్చే ఆస్తులను రేట్లు తగ్గించి అమ్ముకుని దోచేయాలని చూస్తున్నాడు. ఈ పెద్దమనిషి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి పోయాడు.

తాండ్రపాపారాయుడని బిల్డప్‌ ఇచ్చాడు. ఎల్లో మీడియా పెద్దగా చూపించింది దాన్ని. ఆరోజు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో అమర్‌సింగ్‌ను పిలిపించుకున్నాడు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను తక్కువరేటుకెలా కొనుగోలు చేయాలో బ్రోకరేజ్‌ చేస్తూ, లంచాల కోసం ఎదురు చూశాడు. బహిరంగ మార్కెట్‌లో రూ.35 వేల కోట్ల విలువ చేస్తుందని చెబితే.. చంద్రబాబు చేతుల్లో ఉన్న సీఐడీ దర్యాప్తు చేసి ఈ ఆస్తులను రూ.10 వేల కోట్లకు తగ్గించి చూపించింది.

ఆ తర్వాత ఎస్‌ఎల్‌ కంపెనీ కేవలం రూ.2,200 కోట్లు ఇస్తానని ముందుకొచ్చింది. ఇలా ఆస్తులను కొట్టేయాలని చూస్తున్నారు. అందుకే  జగన్‌ అనే నేను చెబుతున్నాను.. రేపు మనందరి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే   ఆ రూ.1,100 కోట్లు ఇచ్చి 80 శాతం మందికి ఉపశమనం కల్పిస్తాను. ఆ తర్వాత అగ్రిగోల్డ్‌ ఆస్తులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది. పారదర్శకంగా వాటిని చిన్న ముక్కలుగా చేసి వేలం వేస్తాం. ప్రతీ పైసా కూడా బాధితులకందేలా చేస్తాం. ఫెర్రో ఎల్లాయిస్, జూట్‌మిల్లులకు కూడా తోడుగా ఉంటాం.
 
నాన్న చేసిన మేలు వింటే సంతోషమేసింది..
ఇక్కడి ప్రజలు నాకో విషయం చెప్పారు. నాన్నగారి హయాంలో చీపురుపల్లి నియోజకవర్గానికి రూ.150 కోట్లు కేటాయించి, 232 గ్రామాలకు తాగునీరు అందించారని, 38 వేల ఇళ్లు కట్టారని గుర్తు చేశారు. ఇవాళ ఊరికి మూడు నాలుగు ఇళ్లు కూడా ఇవ్వని అధ్వానమైన పాలన సాగుతోందని చెప్పారు. 2008లోనే వైఎస్‌ ఇక్కడ డిగ్రీ కాలేజీకి అనుమతి ఇస్తే, ఈ పాలకులు ఆ కాలేజీ భవనాలు ఇంత వరకూ కట్టలేదన్నా అని చెప్పారు. డైట్‌ కాలేజీలో 16 మంది లెక్చరర్లు ఉండాల్సి ఉండగా కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారని అక్కడ చదివే పిల్లలు తెలిపారు. అక్కడ కనీసం పాఠ్యపుస్తకాలు కూడా ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి ఉందన్నారు. ఇదే నియోజకవర్గంలో నాలుగు అంబులెన్స్‌లు ఉంటే రెండు పని చేయని పరిస్థితి.  

ఇదీ అంబులెన్స్‌ల పరిస్థితి..
అంబులెన్స్‌లు ఎలా పని చేస్తున్నాయనే విషయం చెప్పడానికి రెండు రోజుల క్రితం జరిగిన ఓ సంఘటన చెబుతాను. నా దగ్గరకు ఈ రోజు గరివిడి మండలం కోడూరుకు చెందిన యడ్ల భవాని అనే ఓ చిట్టి తల్లొచ్చింది. ఈ నెల 5న 108కు ఫోన్‌ చేస్తే ఎలాంటి సమాధానం వచ్చిందో ఆమె నాకు చెప్పింది. మీకు కూడా చెబుతుంది వినండి.    ‘రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి నేనే నిదర్శనం. ఇంటర్‌లో 97 శాతం మార్కులతో పాసయిన మెరిట్‌ విద్యార్థిని. బీసీనైన నాకు మెరిట్‌ స్కాలర్‌షిప్‌ ఇవ్వలేదీ ప్రభుత్వం. వైద్యం పరిస్థితి మరీ దారుణం. మొన్న మా పక్కింటి గౌరి పురిటినొప్పులతో బాధపడుతోంది.

అరుస్తుంటే ఆమె దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లాను. అప్పుడక్కడ ఎవరూ లేరు. 108కు ఫోన్‌ చెయ్యమంటే చేశాను. అప్పుడు వాళ్లు ఎక్కడికి రావాలి? అని వివరాలన్నీ అడిగారు. ఆ తర్వాత టైర్‌ పంచరైందమ్మా.. రావడానికి టైం లేదు.. స్టాఫ్‌ ఎవరూ లేరు.. అని చెప్పారు. ఆ పరిస్థితుల్లో ఆమెను ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాను. ఆటో కుదుపులకు బాగా రక్తస్రావమైంది. ఆసుపత్రికి తీసుకెళ్లిన ఐదు నిమిషాలకే కాన్పు అయింది. తీసుకెళ్లలేకపోయుంటే ఆమె పరిస్థితి ఏమయ్యేది?  మనకు జగనన్న అండగా ఉన్నారు. ఎవ్వరూ అధైర్య పడవద్దు. ఆయన అధికారంలోకి రాగానే పూర్వ వైభవం వస్తుంది’ అని భవాని చెప్పింది.

అధోగతి పాలన.. లంచాల సర్కారు
రాష్ట్రంలో పాలన దయనీయమైన స్థితిలో ఉంది. రైతన్నలు, అక్కచెల్లెమ్మలకు రుణమాఫీ కాలేదు. గిట్టుబాటు ధరల్లేవు. సున్నావడ్డీలు పైకెళ్లిపోయాయి. పావలా వడ్డీలు కన్పించడం లేదు. రైతన్నలు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉద్యోగాల్లేవు. నిరుద్యోగ భృతి లేదు. ప్రత్యేక హోదా అంతకన్నా లేదు. పోలవరం ప్రాజెక్టు పునాదులు దాటి ముందుకు కదలడం లేదు. అక్కడ నీటి కథ కాదు.. లంచాల కథ విన్పిస్తోంది. కాంట్రాక్టర్ల దగ్గర్నుంచి మొదలుకొని, ఇసుక, మట్టి, కరెంట్, మద్యం, రాజధాని, విశాఖ భూములు ఏదీ వదిలి పెట్టకుండా దోచుకుంటున్నారు. కరెంట్‌ చార్జీలు, పెట్రోలు, డీజిల్‌ రేట్లు.. ఇంటిపన్నులు, స్కూల్, కాలేజీ ఫీజులు బాదుడే బాదుడు.

పండుగొచ్చిందంటే చాలు.. కొత్త సినిమాకు బ్లాకులో టిక్కెట్లు అమ్మినట్టుగా బస్‌ చార్జీలు మూడు రెట్లు పెంచుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పాతరేశారు. పెద్ద చదువుల కోసం ఆస్తులమ్ముకునే అధ్వానమైన పరిస్థితి ఉంది. ఆరోగ్యశ్రీ పూర్తిగా పడకేసింది. ఈ విషయాన్ని భవానీ అనే చెల్లి ఇక్కడే చెప్పింది. వైద్యం కోసం లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. కాన్పుకు కూడా రూ.50 వేలు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. 108కి ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్‌ రావడం లేదు. రేషన్‌ షాపులో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు. ఇళ్ల స్థలాలు అసలే ఇవ్వరు. పెన్షన్లు, రేషన్‌ చివరకు మరుగుదొడ్లకైనా లంచాలు లేకుండా పని జరగడం లేదు.

గ్రామాల్లో తాగడానికి మంచి నీళ్లుండవు గానీ, వీధి చివరన, బడి, ఇంటి పక్కన మందు షాపులు కన్పిస్తున్నాయి. గ్రామాల్లో జన్మభూమి కమిటీల మాఫియా రాజ్యమేలుతోంది. మోసం, అబద్ధాలు, అవినీతి, అన్యాయం కాళ్ల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది. ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి ఇచ్చిన హామీలేంటి? అవి నెరవేరాయా? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి కులాన్నీ ఎలా మోసం చేయాలా.. అని పీహెచ్‌డీ చేసినట్టు కులానికో పేజీ చొప్పున 2014 ఎన్నికల మేనిఫెస్టో తెచ్చాడు. ఇప్పుడది టీడీపీ వెబ్‌సైట్‌లో వెదికితే కన్పించదు. కన్పిస్తే ప్రజలు కొడతారనే భయంతో దాన్ని మాయం చేశారు. చెడిపోయిన వ్యవస్థలో మార్పు తీసుకు రావడం నా ఒక్కడి వల్లే సాధ్యం కాదు. నాకు మీ అందరి తోడు, దీవెనలు, ఆశీస్సులు కావాలి’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.  

ఆరోగ్య శ్రీలో విప్లవాత్మక మార్పులు తెస్తాం
ఉత్తరాంధ్రాలో ప్రత్యేకించి విజయనగరం జిల్లాలో విష జ్వరాలు, డెంగీతో దాదాపుగా 85 మంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉంది. హైదరాబాద్‌లో చూపించుకుంటే ఆరోగ్య శ్రీ వర్తించదట. రేపు మనందరి ప్రభుత్వం రాగానే ఏపీలోని పేదలు వైద్యం కోసం దేశంలోని ఏ నగరానికి వెళ్లినా, ఏ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా అందుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.  

ఏ జబ్బు అయినా సరే వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం.  
కిడ్నీ, తలసేమియా.. లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి నెలనెలా రూ.10 వేలు పింఛన్‌ ఇస్తాం.  
మహానేత కాలంలో జరిగినట్లే.. మూగ, చెవిటి పిల్లలు అందరికీ రూ.6 లక్షలు ఖర్చయ్యే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తాం.  
క్యాన్సర్‌ చికిత్సకు కనీసం ఏడెనిమిది సార్లు కీమోథెరపీ చేయాలి. ఒకసారి కీమోథెరపీ చేయడానికి రూ.లక్ష ఖర్చు అవుతుంది. ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం రెండుసార్లకు మాత్రమే డబ్బులిస్తోంది. దీంతో ఆరు నెలల తర్వాత వారికి క్యాన్సర్‌ వ్యాధి తిరగబెడుతోంది. రోగులు చనిపోవాల్సిన దుస్థితి నెలకొంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్‌ సరిగా జరగడం లేదు. పేదలు ఆస్పత్రులకు వెళితే ఏడాది తర్వాత రమ్మంటున్నారు. దీంతో వారి ప్రాణాలు పోతున్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్పు చేస్తాం.   
ఆపరేషన్‌ పూర్తయ్యాక వైద్యులు సూచించే విశ్రాంతి కాలంలో పనులు చేసుకోలేరు కాబట్టి ఆర్థిక సాయం అందిస్తాం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top