
వీడియో కాల్‌లో ఎంపీలతో మాట్లాడుతున్న వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు : ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాల్‌లో పరామర్శించారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలో చేనేత కార్మికులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. అనంతరం స్కైప్ ద్వారా ఎంపీలతో మాట్లాడారు. ‘రాష్ట్రం మొత్తం ఇప్పుడు మీవైపే చూస్తోంది. ఐదు కోట్ల మంది ఆంధ్రులు మిమల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. మీరు రాజీనామాలు చేసి, ఆమరణ దీక్షకు దిగడాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారు. మీ దీక్షకు మద్ధతుగా రిలే దీక్షల్లో పాల్గొంటున్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు మొత్తం మీ వెంట ఉన్నాయి. ఈ రోజు జాతీయ రహదారుల దిగ్భంధం చేసింది. రేపు రైలురోకో చేయబోతోంది. ప్రత్యేక హోదా వచ్చే వరకు మన పోరాటం ఇలాగే కొనసాగాలి’ అని జగన్ ధైర్యం ఇచ్చారు.
దీనికి స్పందించిన ఎంపీలు ‘మాకు మా పదవులు.. ఆరోగ్యం కంటే ప్రజల తరపు పోరాటమే ముఖ్యం. మీరు ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. గతంలో మీరు చేసిన దీక్షలే మాకు స్ఫూర్తి. హోదా సాధించే వరకు పోరాడతాం’అని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న వైఎస్ జగన్.. జాగ్రత్తగా ఉండాలంటూ వారికి పలు సూచనలు చేశారు.