దళారీలకు నాయకుడు.. రాష్ట్రానికి సీఎంగా అవసరమా?

YS Jagan MOhan Reddy Public Meeting At Mydukur In Kadapa - Sakshi

ఐదేళ్ల పాలనలో చంద్రబాబు అందరినీ మోసం చేశారు

మరోసారి దోచుకోవడానికి వస్తున్నాడు..

ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి.. వచ్చేది మన ప్రభుత్వమే

మైదుకూరు ప్రచార సభలో వైఎస్‌ జగన్‌

సాక్షి, వైఎస్సార్‌: ఐదేళ్ల పాలనలో పేదలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు మరోసారి దోచుకోవడానికి వస్తున్నాడని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. రైతులను, మహిళలను, విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు లాంటి వ్యక్తి మనకు సీఎంగా మళ్లీ అవసరమా అని ప్రశ్నించారు. అభివృద్ధి చేయమని ఐదేళ్లు చంద్రబాబుకు అవకాశం ఇచ్చామని, కానీ పేదలను దోచుకున్నారని వైఎస్‌ జగన్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళారీ వ్యవస్థను అడ్డుకోవాల్సిన సీఎంయే.. వారికి నాయకుడిగా వ్యవరిస్తూ.. రైతులను నిలువునా దోపిడికి గురిచేశారని ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యక్తి మనకు సీఎంగా అవసరమా? అని ప్రశ్నించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడప స్టీల్‌ ఫ్యాక్టరీని నిర్మించి ఉంటే ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించేవని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కడప జిల్లా మైదుకూరులో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా మైదుకూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డిని, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘‘నా సుధీర్ఘ పాదయాత్రలో ప్రతి ఒక్కరి కష్టాలను నేను చూశాను. వారందరికీ నేను హామీ ఇస్తున్నా... మీ అందరికి అండగా నేను ఉన్నాను. రైతులకు గిట్టుబాటు ధర లేక, సాగునీరు లేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు పాదయాత్రలో అనేకం చూశాను. ఫీజు రీయింబర్స్ మెంట్, ఉద్యోగాలు రాక, చదవుకోవడానికి డబ్బులు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా పాదయాత్రలో చేశాను. 108 అంబులెన్స్‌ అందుబాటులో లేక, ఆరోగ్యశ్రీ లేక, మందులకు వేల రూపాయలు ఖర్చుచేయలేక మరణించిన వారిని కూడా చూశాను. ఈ విధంగా టీడీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురైయ్యారు. స్థానికంగా రైతులను ఆదుకోవడానికి బ్రహ్మం సాగర్‌ ప్రాజెక్టు 17 టీఎంసీలతో వైఎస్సార్‌ పునాది వేశారు. 14 టీఎంసీల నీటిని నిలువ ఉంచి అప్పుడే రైతులకు ఇచ్చారు. కానీ చంద్రబాబు పాలనలో కనీసం రెండు టీఎంసీలు కూడా ఇవ్వలేదు. కరువు ప్రాంతానికి మేలు చేయడం కోసం 2008లో అనేక ప్రాజెక్టులకు వైఎస్సార్‌ పునాది వేశారు. చంద్రబాబు ఇప్పటి వరకూ కూడా వాటిని పూర్తిచేయలేకపోయారు.

చేయని మోసం లేదు, ఆడని డ్రామాలేదు
చంద్రబాబు నాయుడి పాలనలో రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. పంటలకు గిట్టుబాటు ధరలేదు, చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌లో మాత్రం అత్యధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. మైదుకూరు మున్సిపాలిటీలో సీసీ రోడ్లు వెయ్యకుండా బిల్లులు తీసుకుంటున్నారు. యనమల రామకృష్ణుడి వియ్యంకుడే ఇక్కడ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ఆయన ఆధ్వర్యంలోనే దోపీడి జరుగుతోంది. కడప కోపరేటీవ్‌ షుగర్స్‌ కోసం రైతులు ధర్నాలు చేస్తున్నా.. వారి బాధలు వినిపించుకోరు. చెరుకు రైతులు నెల్లూరు వెళ్లి ప్రైవేటు కంపెనీలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ కోసం ఆశగా ఎదురుచూశారు. ఉద్యోగాలు వస్తాయని, మన బతుకులు మారుతాయని ఎంతో ఆశపడ్డం. కానీ ఇంతవరకు దాని ఊసేలేదు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి.. ఇప్పటి వరకు మొత్తం రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయదు. ఐదేళ్ల కాలంలో ఆయన చేయని మోసం లేదు, ఆడని డ్రామాలేదు, అబద్ధంలేదు, చూపని సినిమా లేదు. ఎన్నికల సమీపిస్తున్న వేళ మరోసారి కుట్ర చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి. అక్రమంగా గెలవడానికి మూటల మూటల డబ్బు పంపుతా ఉన్నాడు.

వైఎస్సార్‌ ఆశయాలను నెరవేరుస్తాం
ఓటుకు మూడు వేల రూపాయలు పంచుతున్నాడు. మరోసారి దోచుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. దానికి మోస పోవద్దు. వచ్చేది మన ప్రభుత్వమే. అందరినీ ఆదుకుంటా.. పిల్లల్ని బడికి పంపితే చాలు ఏడాదికి 12వేలు చేతిలో పెడతాం. పేద పిల్లల్ని ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి పెద్దపెద్ద చదువులను చదవిస్తాం. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పొదుపు రుణాలను మాఫీ చేస్తాం. మళ్లీ రాజన్న రాజ్యం వచ్చే విధంగా సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం. వైఎస్సార్‌ ఆశయాలను నెరవేరుస్తాం. వైఎస్సార్‌ చేయూత ద్వారా ఏడాదికి 75వేలు చేతిలో పెడతాం. పెట్టుబడి కోసం ప్రతి రైతుకు ఏడాదికి 15వేలు ఇస్తాం. రైతులకు గిట్టుబాటు ధరను కూడా కల్పిస్తాం. పెన్షన్లు పెంచుతాం. పేదలకు ఇళ్లు కట్టిస్తాం. నవరత్నాల ద్వార పేదల బతుకుల్లో మార్పు వస్తుందని నాకు నమ్మకం ఉంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top