
బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, చిత్రంలో ఎమ్మెల్యే కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఐవైఆర్ కృష్ణారావు, బ్రాహ్మణ ప్రముఖులు
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విశాఖ కేంద్రంగా సోమవారం జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు.. వైఎస్ కుటుంబం పట్ల చెక్కు చెదరని ఆత్మీయతానురాగాలకు వేదికైంది. ఆత్మాభిమానానికి విలువనిచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు తెచ్చింది. సభకు హాజరైన ప్రతి ఒక్కరూ ఆయన హయాంలో అనుభవాల జ్ఞాపకాలను భావోద్వేగంతో నెమరు వేసుకున్నారు. తమ సామాజిక వర్గాన్ని వైఎస్ కుటుంబం ఎంతగా గౌరవిస్తుందో, ప్రేమిస్తుందో వారి మనోభావాల్లో వెల్లడైంది. ఆ మంచి రోజులు మళ్లీ రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్న ఏకాభిప్రాయం అశేష బ్రాహ్మణ సమాజం నుంచి వ్యక్తమైంది.
మీ మనసే వెన్న.. మాటిస్తే కట్టుబడే వంశం..
ఆత్మీయ సమ్మేళనంలో అనేక మంది మనసులోంచి వచ్చిన మాటలివి. ‘విజయవాడ వచ్చిన మీ నాన్నగారికి అన్నం పెట్టిన విశ్వాసానికి మల్లాది విష్ణుకు రాజకీయ ఉన్నత శిఖరాలు అందించిన విశ్వాసం ఇంకా మాలో ఉంది’ అంటూ తెనాలికి చెందిన పోతరాజు పురుషోత్తమ శర్మ అంటున్నప్పుడు సభావేదిక హర్షధ్వానాలతో మార్మోగింది. ‘పేదరికంలో ఉన్నామయ్యా.. బ్రాహ్మలం’ అని కన్నీళ్లు పెడితే గుండెలకు హత్తుకుని మరీ సాయం చేశాడని గుంటూరు నుంచి వచ్చిన వృద్ధ దంపతులు సోమరాజు శర్మ, భ్రమరాంబ తెలిపారు. అంత మనసు జగన్‌కూ ఉందని నమ్ముతున్నాం.
ఆ అభిమానంతోనే ఆత్మీయ సమ్మేళనానికి ఇక్కడిదాకా వచ్చామని తెలిపారు. ‘దేవుడికి, మనుషులకు బ్రాహ్మలు వారధులు’ అంటూ వైఎస్ జగన్ సంబోధించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ‘ఆ సంస్కారం వాళ్ల నాన్నలో చూశాం.. మళ్లీ ఇప్పుడు జగన్‌లోనే చూస్తున్నాం’ అని నెల్లూరు నుంచి వచ్చిన తిరుమల వంశీ తెలిపాడు. వేదాలు, మంత్రాల పట్ల.. వాటిని ఉచ్ఛరించే బ్రాహ్మణుల పట్ల జగన్ తన ప్రసంగంలో ఆద్యంతం ఉన్నతంగానే కీర్తించారు. ‘బ్రాహ్మలు విద్యావంతులు.. ఎంతో చదువుకున్నా ప్రభుత్వ తీరు వల్ల ఉద్యోగాలు రావడం లేదు’ అంటూ వారి ప్రతిభను గొప్పగా చూపుతూనే, సామాజిక స్థితిగతులపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రాణాలు కాపాడిన మీ నాన్నగారికి పాదాభివందనం చెయ్యాలన్పించింది. కానీ మీరు ఆశీర్వదించాలి కానీ.. ఇలా చెయ్యొద్దు’ అన్న ఆయన మాటలు గుర్తుచేస్తూ ఓ మహిళ కంట తడిపెట్టింది. ఈ సమయంలో జగన్ ఆమెకు రెండు చేతులెత్తి ఆత్మీయంగా అభివాదం చేసిన సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది.
పరిపూర్ణ అవగాహన
బ్రాహ్మణ సామాజికవర్గం ప్రతీ సమస్యను జగన్ సమ్మేళనంలో ప్రస్తావించారు. దైవాన్నే నమ్ముకునే ఆ వర్గాన్నీ పాపభీతి లేకుండా ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో తెలిపారు. దుర్గ గుడిలో జరిగే అపచారాలను జగన్ లేవనెత్తినప్పుడు సభా ప్రాంగణంలోని ప్రతి ఒక్కరిలోనూ భావోద్వేగం కన్పించింది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ఒక్కో హామీని విడమరిచి బ్రాహ్మణ సమాజానికి చంద్రబాబు చేసిన దగాను ప్రస్తావిస్తున్నప్పుడు ఆర్చకులు, వేద పండితుల ముఖంలో ఆవేశం కొట్టొచ్చినట్టు కన్పించింది.
అడుగడుగునా జననేతకు జన హారతి
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను కలిసేందుకు విశాఖ నగర వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పాదయాత్ర సాగిన దారిపొడవునా జనం బారులు తీరడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ప్రజా సంకల్ప యాత్ర 259వ రోజు సోమవారం వేలాది మంది పాల్గొన్నారు. మహిళలు మంగళ హారతులు పట్టారు. మరోవైపు వివిధ వర్గాల వారు అడుగడుగునా అర్జీలిచ్చారు. ఉద్యోగులు, యువత, వృద్ధులు, డి ఫార్మసీ విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కూలీలు, మత్స్యకారులు తమ కష్టాలను ఏకరవు పెట్టారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 35వ వార్డుకు చెందిన ఇతర పార్టీల నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు.