Brahmana Sadassu
-
సిరిపురం బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో వైఎస్ జగన్
-
బ్రాహ్మణులకు ఆత్మీయ హస్తం
స్వాతంత్య్రానంతరం ఆర్థిక, రాజకీయ సాధికారతకు నోచుకోని బ్రాహ్మణులకు జనహృదయ నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆత్మీయ హస్తం అందించారు. ఆదుకుంటామని అభయమిచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారం సిరిపురం జంక్షన్ సమీపంలోని విజ్ఞాన్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సులో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ సూచనలను, సలహాలను చెప్పారు. వారి బాధలు విన్న జననేత అన్ని విధాలా ఆదుకుంటానని, అండగా ఉంటానని భరోసానివ్వడంతో వారిలో పట్టరాని ఆనందం వెల్లివిరిసింది. సాక్షి, విశాఖపట్నం: దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలు 976.. వాటిలో మూడో వంతు కూడా ధూపదీప నైవేద్యాలకు నోచుకోని పరిస్థితి.. ఇక ఈ ఆలయాలకు ఉన్న 23,920 ఎకరాల్లో సగానికిపైగా భూములు అన్యా క్రాంతమైపోయిన దుస్థితి.. ఈ ఆలయాలపై ఆధారపడి జీవించే అర్చకుల ఆర్థిక పరిస్థితి మరీ దయనీయం.. రోజురోజుకు దిగజారుతున్న తమ బతుకు కష్టాలను చెప్పుకునేందుకు వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన బ్రాహ్మణుల ఆత్మీయ సదస్సుకు బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సిరిపురం జంక్షన్ సమీపంలోని విజ్ఞాన్ కళాశాల మైదానంలో బాపట్ల ఎమ్మెల్యే కోనా రఘుపతి అధ్యక్షతన జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. మేనిఫెస్టో రూపకల్పన కోసం సూచనలు, సలహాలు ఇవ్వాలని జననేత కోరగానే జిల్లాకు చెందిన కొంతమంది నేరుగా మాట్లాడి తమ ఆవేదనను చెప్పు కోగా.. మరికొంత మంది వినతుల రూపంలో అందించారు. సదస్సు ప్రారంభంలో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతోపాటు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రముఖ సినీ నటుడు టి.విజయచందర్, జిల్లాకు చెందిన పలువురు పండితులు మాట్లాడారు. కర్మకాండలు చేసుకునేందుకుస్థలాల్లేని దుస్థితి మాది జిల్లాలో మూడు లక్షల మందికి పైగా బ్రాహ్మణులున్నారని, వారిలో ఎక్కువమంది దారిద్య్రంలో జీవిస్తున్నారని అర్చక సంఘాల ప్రతినిధులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా కేంద్రంలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడా కర్మకాండలు చేసుకునేందుకు స్థలాల్లేవని, ఎక్కడైనా చేసుకుందామని ప్రయత్నించినా అనుమతించడం లేదని వాపోయారు. అర్చకులు, పేదబ్రాహ్మణ కుటుంబాలకు రూ.5 లక్షల వరకు పరిమితి గల హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. సొంతగూడు లేని బ్రాహ్మణులు చాలామంది ఉన్నారని, వారికి ఇళ్లస్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లో బ్రాహ్మణ కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాకు ఒక్కటైనా వేదపాఠశాల ఏర్పాటు చేయాలన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు రూ.165 కోట్లకు మించి ఇవ్వలేదని వివరిస్తూ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి రూ.300 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.1500 కోట్లు ఇవ్వాలని కోరారు. అలాగే ఎమ్మెల్సీ పదవులతోపాటు నామినేటెడ్ పోస్టుల్లో బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వాలని సూచించారు. జననేత హామీతోబ్రాహ్మణుల్లో భరోసా వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఉపన్యాసంలో ఎన్నికల్లో చంద్రబాబు బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను వివరిస్తూ ఏ ఒక్కటైనా అమలుకు నోచుకున్నాయా అని ప్రశ్నించారు. లేదు లేదంటూ బ్రాహ్మణులంతా ముక్తకంఠంతో నినదించారు. ఆ తర్వాత సభికుల నుంచి సూచనలు సలహాలు స్వీకరించిన జగన్.. మీకు అండగా నేను ఉంటాను.. ఆదుకుంటానని అభయమిచ్చారు. ఒక్కసారి మాట ఇస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. నాన్నగారి కంటే ఎక్కువ మేలు చేసి చూపిస్తానని భరోసా ఇవ్వడంతో సదస్సుకు వచ్చిన జిల్లాకు చెందిన బ్రాహ్మణులు ఆనందభరితులయ్యారు. మీకు అండగా ఉంటాం.. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంటాం అంటూ నినాదాలతో హోరెత్తించారు. సదస్సులో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు సుధాకర్, వీవీ వామనరావు, ఆకెళ్ల రమణమూర్తి, పూర్ణానంద శర్మ, జిల్లా అర్చక సంఘ అధ్యక్షులు అయిలూరి శ్రీనివాస దీక్షితులు తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదన్నా
సాక్షి, విశాఖపట్నం: మాది పేద బ్రాహ్మణ కుటుంబం. మా నాన్నగారు కేటరింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నాకు ఎంసెట్‌లో 24 వేలు ర్యాంక్ వచ్చింది. గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ బ్రాంచిలో అడ్మిషన్ వస్తే చేరాను. బ్రాహ్మణులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని దరఖాస్తు తిరస్కరించారన్నా. ఫీజులు మొత్తం మీరే కట్టుకోవాలని కాలేజీ వాళ్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాను. గత్యంతరం లేక ఇంట్లో ఉన్న కొద్దిపాటి బంగారం అమ్మడంతోపాటు, నాన్న ప్రైవేటు ఫైనాన్షియర్ల వద్ద అప్పు చేసి మొదటి రెండు సంవత్సరాల ఫీజు చెల్లించేశారు. ఇంకా రూ.లక్ష చెల్లించాల్సి ఉందన్నా. ఈ ఏడాది బకాయిలన్నీ కట్టకపోతే సెమిస్టర్ పరీక్షలు రాయనీయమని కళాశాల యాజమాన్యం చెబుతోంది. మాలాంటి పేద బ్రాహ్మణుల పరిస్థితి ఇంతేనా..? – జ్యోతి స్వరూప, ఇంజినీరింగ్ విద్యార్థి, లలితానగర్, విశాఖపట్నం -
‘అదే వైఎస్‌కూ.. చంద్రబాబుకు తేడా’
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం నిర్వహించిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో కర్నూలు చెందిన ఓ మహిళ మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి. దివంగత మహానేత వైఎస్సార్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు నాయుడు వ్యవహారశైలి గురించి వాస్తవాన్ని ఆమె వెల్లడించారు. బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడిన వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఆమె ఏమన్నారంటే.. ‘గతంలో రాజశేఖరరెడ్డి గారి హయాంలో ఒక క్యాన్సర్ రోగి ఆపరేషన్ కోసం ఆర్థిక సాయం చేయాలని అడిగితే రెండు లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఆపరేషన్ అయి కోలుకున్నాక వైఎస్సార్‌ను కలిసి కాళ్లకు నమస్కారం పెడుతుంటే తప్పు.. మీరు బ్రాహ్మణులు. మాకు నమస్కారం పెట్టకూడదు. మేమే మీకు పెట్టాలని అన్నారు. అదే చంద్రబాబునాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనందసూర్య చేత తన కాళ్లకు నమస్కారం పెట్టించుకున్నాడు. వైఎస్‌కు, చంద్రబాబుకు ఉన్న తేడా అదే’ -
జగన్‌పై నమ్మకముంది
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విశాఖలో రాష్ట్రస్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు నిర్వహించడం గొప్ప విషయం. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులకు తమ సమస్యలను నేరుగా ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్లే అవకాశం కలిగింది. బ్రాహ్మణ సంక్షేమానికి చిత్తశుద్ధితో పాటుపడే వ్యక్తి జగన్ అనేది రుజువయింది. దివంగత నేత వైఎస్ అర్చకుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారు. ఆయన అడుగుజాడల్లో జగన్ నడుస్తారనే నమ్మకం ఉంది. – భారతి, బ్రాహ్మణ సంఘ మహిళా ప్రతినిధి -
ఆవేదనాదం
సాక్షి, విశాఖపట్నం: వేదాధ్యయనం చేసిన పెదవులు తమకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశాయి. ఆర్థిక స్థితి సహకరించకపోయినా అగ్రవర్ణానికి చెందిన వారనే నెపంతో సంక్షేమ పథకాలు దరి చేరనీయకపోవడాన్ని గర్హించాయి. పూట గడవకున్నా.. ఆలయాలే ఆధారంగా జీవనం గడుపుతున్న తమకు ఆపద్బాంధవుడిలా అగుపించిన వైఎస్సార్ అకాలమరణంతో తమ పరిస్థితి మళ్లీ యథాస్థితికి చేరిందని వారంతా కలత చెందారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల దోపిడీ చాలదన్నట్లు జన్మభూమి కమిటీలు కూడా తోడై తమకు పథకాలేవీ అందకుండా చేయడమే కాక, ఏమాత్రం ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారన్నారు. అంధకారం అలముకున్న తమ జీవితాల్లో వెలుగురేఖలు ప్రసరించాలంటే ఆర్థిక తోడ్పాటుతో పాటు రాజకీయాల్లోనూ అవకాశం కల్పించాలని జగన్మోహన్రెడ్డిని అభ్యర్థించారు. మీకు అండగా ఉంటాం.. చేయూతనివ్వమని విజ్ఞప్తి చేశారు. ఒడియా బ్రాహ్మణులకు ధ్రువపత్రాలు ఇవ్వడం లేదు అన్నా.. మేము చాలా ఏళ్ల క్రితం ఒడిశా నుంచి వచ్చి విశాఖలో స్థిరపడ్డాం. సుమారు 4 వేలమందికి పైగా ఇక్కడే జీవిస్తున్నాం. ప్రభుత్వ పథకాలకు, బ్రాహ్మణ కార్పొరేషన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే కుల ధ్రువీకరణ పత్రాలు కావాలంటున్నారన్నా. మాకేమో ధ్రువపత్రాలు ఇవ్వడం లేదు. మా ఒడియా బ్రాçహ్మణులు ఎలా బతకాలి? ధ్రువపత్రాలు మంజూరు చేసి, పథకాలు వర్తింపజేయమని కోరుతున్నాం. – రాజునారాయణ, విశాఖపట్నం అర్చకులకు జీవనభృతి కల్పించాలి సామాన్య దేవాలయాల్లో అర్చకుల జీవనభృతికి భద్రత లేదు. సుమారు 20 ఏళ్లుగా సేవ చేసినా మాకు సరైన ఆధారం లేక కుటుంబాలు వీధినపడుతున్నాయి. ముఖ్యంగా వివాహసమయంలో అర్చకుడంటే అభ్యంతరం చెబుతున్నారు. వైఎస్సార్ ఉన్నప్పుడు జీర్ణదేవాలయాల పునరుద్ధరణకు దీపధూప నైవేద్యాల కోసం, అర్చకుల కోసం కొంత మొత్తం ఇచ్చేవారు. మా పిల్లల కోసం ఫీజురీయింబర్స్‌మెంట్ ఇచ్చేవారు. మాకు అదే పాలన కావాలి. మా సమస్యలపై జగన్‌కు వినతిపత్రం ఇచ్చాం. – కాళ ప్రసాద్, కిశోర్‌శర్మ, రవీంద్రనగర్, విశాఖపట్నం వేద విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలి అన్నా అర్చకత్వం ఇబ్బందిగా మారింది. కడుపు నింపడం లేదు. వేదవిద్య పూర్తి చేసినా ఉపాధి లభించడం లేదు. ఇక పేద బ్రాహ్మణులకు వేదవిద్య అందుబాటులో లేదు. ప్రతి జిల్లాలోను వేద విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలి. 6 నుంచి 10వ తరగతి వరకు వేదాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. – రవికిరణ్ శర్మ, వైకుంఠపాలెం, ప్రకాశం జిల్లా మిమ్మల్ని సీఎం చేసేందుకుమీ వెంటే ఉంటాం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బ్రాహ్మణులకు చేసిన మేలును ఎన్నటికీ మరువలేం. ఈ ఆత్మీయ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా ఇంతమంది బ్రాహ్మణులు రావడం ఇదే తొలిసారేమో. ఆయనపై అభిమానానికి ఇదే నిదర్శనం. ఇళ్లు, గుడులకే పరిమితమైన బ్రాహ్మణులు మొదటిసారి సమావేశాలకు వచ్చి తమ సమస్యలను మీకు విన్నవించారు. మీ పార్టీకి బ్రాహ్మణుల సహకారం పూర్తిగా ఉంటుంది. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసేవరకు మీ వెంటే ఉంటాం. – సీతంరాజు సుధాకర్, విశాఖపట్టణం -
అంతులేని అభిమానం, ఆత్మీయత
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విశాఖ కేంద్రంగా సోమవారం జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు.. వైఎస్ కుటుంబం పట్ల చెక్కు చెదరని ఆత్మీయతానురాగాలకు వేదికైంది. ఆత్మాభిమానానికి విలువనిచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు తెచ్చింది. సభకు హాజరైన ప్రతి ఒక్కరూ ఆయన హయాంలో అనుభవాల జ్ఞాపకాలను భావోద్వేగంతో నెమరు వేసుకున్నారు. తమ సామాజిక వర్గాన్ని వైఎస్ కుటుంబం ఎంతగా గౌరవిస్తుందో, ప్రేమిస్తుందో వారి మనోభావాల్లో వెల్లడైంది. ఆ మంచి రోజులు మళ్లీ రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్న ఏకాభిప్రాయం అశేష బ్రాహ్మణ సమాజం నుంచి వ్యక్తమైంది. మీ మనసే వెన్న.. మాటిస్తే కట్టుబడే వంశం.. ఆత్మీయ సమ్మేళనంలో అనేక మంది మనసులోంచి వచ్చిన మాటలివి. ‘విజయవాడ వచ్చిన మీ నాన్నగారికి అన్నం పెట్టిన విశ్వాసానికి మల్లాది విష్ణుకు రాజకీయ ఉన్నత శిఖరాలు అందించిన విశ్వాసం ఇంకా మాలో ఉంది’ అంటూ తెనాలికి చెందిన పోతరాజు పురుషోత్తమ శర్మ అంటున్నప్పుడు సభావేదిక హర్షధ్వానాలతో మార్మోగింది. ‘పేదరికంలో ఉన్నామయ్యా.. బ్రాహ్మలం’ అని కన్నీళ్లు పెడితే గుండెలకు హత్తుకుని మరీ సాయం చేశాడని గుంటూరు నుంచి వచ్చిన వృద్ధ దంపతులు సోమరాజు శర్మ, భ్రమరాంబ తెలిపారు. అంత మనసు జగన్‌కూ ఉందని నమ్ముతున్నాం. ఆ అభిమానంతోనే ఆత్మీయ సమ్మేళనానికి ఇక్కడిదాకా వచ్చామని తెలిపారు. ‘దేవుడికి, మనుషులకు బ్రాహ్మలు వారధులు’ అంటూ వైఎస్ జగన్ సంబోధించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ‘ఆ సంస్కారం వాళ్ల నాన్నలో చూశాం.. మళ్లీ ఇప్పుడు జగన్లోనే చూస్తున్నాం’ అని నెల్లూరు నుంచి వచ్చిన తిరుమల వంశీ తెలిపాడు. వేదాలు, మంత్రాల పట్ల.. వాటిని ఉచ్ఛరించే బ్రాహ్మణుల పట్ల జగన్ తన ప్రసంగంలో ఆద్యంతం ఉన్నతంగానే కీర్తించారు. ‘బ్రాహ్మలు విద్యావంతులు.. ఎంతో చదువుకున్నా ప్రభుత్వ తీరు వల్ల ఉద్యోగాలు రావడం లేదు’ అంటూ వారి ప్రతిభను గొప్పగా చూపుతూనే, సామాజిక స్థితిగతులపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రాణాలు కాపాడిన మీ నాన్నగారికి పాదాభివందనం చెయ్యాలన్పించింది. కానీ మీరు ఆశీర్వదించాలి కానీ.. ఇలా చెయ్యొద్దు’ అన్న ఆయన మాటలు గుర్తుచేస్తూ ఓ మహిళ కంట తడిపెట్టింది. ఈ సమయంలో జగన్ ఆమెకు రెండు చేతులెత్తి ఆత్మీయంగా అభివాదం చేసిన సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. పరిపూర్ణ అవగాహన బ్రాహ్మణ సామాజికవర్గం ప్రతీ సమస్యను జగన్ సమ్మేళనంలో ప్రస్తావించారు. దైవాన్నే నమ్ముకునే ఆ వర్గాన్నీ పాపభీతి లేకుండా ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో తెలిపారు. దుర్గ గుడిలో జరిగే అపచారాలను జగన్ లేవనెత్తినప్పుడు సభా ప్రాంగణంలోని ప్రతి ఒక్కరిలోనూ భావోద్వేగం కన్పించింది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ఒక్కో హామీని విడమరిచి బ్రాహ్మణ సమాజానికి చంద్రబాబు చేసిన దగాను ప్రస్తావిస్తున్నప్పుడు ఆర్చకులు, వేద పండితుల ముఖంలో ఆవేశం కొట్టొచ్చినట్టు కన్పించింది. అడుగడుగునా జననేతకు జన హారతి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను కలిసేందుకు విశాఖ నగర వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పాదయాత్ర సాగిన దారిపొడవునా జనం బారులు తీరడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ప్రజా సంకల్ప యాత్ర 259వ రోజు సోమవారం వేలాది మంది పాల్గొన్నారు. మహిళలు మంగళ హారతులు పట్టారు. మరోవైపు వివిధ వర్గాల వారు అడుగడుగునా అర్జీలిచ్చారు. ఉద్యోగులు, యువత, వృద్ధులు, డి ఫార్మసీ విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కూలీలు, మత్స్యకారులు తమ కష్టాలను ఏకరవు పెట్టారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 35వ వార్డుకు చెందిన ఇతర పార్టీల నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. -
దేవుడంటే చంద్రబాబుకు భయం, భక్తి లేదు
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తీ లేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు పాలనలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించకపోగా అగౌరవ పరుస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 259వ రోజు సోమవారం విశాఖ నగరం సిరిపురం జంక్షన్లో ఏర్పాటు చేసిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, పుష్కరాల పేరుతో రూ.3,200 కోట్లు దోచేశారని ధ్వజమెత్తారు. ఈ సమ్మేళనంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. మనసు చెప్పినట్టు వినకపోతే భ్రష్టు పట్టడమే.. ‘‘విశాఖపట్నంలో ఈ రోజు బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేదికపై ఉన్న పలువురు బ్రాహ్మణ పెద్దలు పలు సూచనలు చేశారు. వాటిని పరిగణలోకి తీసుకుంటూ మీ అందరి నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకుని వాటన్నింటినీ క్రోడీకరించి మీ అందరూ సంతోషంగా, ఆనందంగా ఉండేలా చేస్తా. ప్రతి మనిషిలోనూ మనసు అనేది ఒకటి ఉంటుంది. తప్పు చేస్తున్నప్పుడు ఈ మనసు మనిషితో మాట్లాడుతుంది. అప్పుడు మనసు చెప్పేది వినగలిగితే ఆ మనిషి ఆ తప్పు చేయడు. అలా మనసు చెప్పే మాటను వినకుండా ఆ తప్పును సమర్థించుకోవడం మొదలు పెడతారో అప్పుడు రాజకీయాలు భ్రష్టుపడతాయి. మనషులు భ్రష్టుపడతారు. మనిషి తప్పు చేయకుండా ఉండాలి అంటే కచ్చితంగా దేవుణ్ణి నమ్మాలి. దేవుడు ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఆ దేవుడికీ మనిషికి సంబంధం ఉండాలి. ఆ సంబంధాన్ని నిలబెట్టే విషయంలో మనిషికీ, దేవుడికి మధ్య ఉన్న వారధులు బ్రాహ్మణులు అని చెప్పడానికి గర్వపడుతున్నా. ఇతర కమ్యూనిటీల్లో కూడా ఇలాంటి వారధులు ఉన్నారు. చర్చిలో అయితే పాస్టర్లు, ఫాదర్లు అని, మసీదులో అయితే ఇమామ్‌లు అని అంటారు. ఇలా ఎవరిని తీసుకున్నా వీళ్లంతా దేవుడికి, మనిషికి మధ్య వారధులు. వీళ్లు అందరూ సంతోషంగా ఉంటేనే మన శ్రేయస్సుకు సంతోషంగా పని చేసినట్టవుతుంది. ఇవాళ ఒకసారి ఈ వారధుల పరిస్థితిని.. ప్రత్యేకించి ఇది బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం కాబట్టి.. ఇక్కడ వాళ్లకున్న సమస్యలను, పరిస్థితులను పరిశీలిస్తే బాధనిపిస్తుంది. నాకున్న అవగాహనతో చెప్పాల్సి వస్తే వీరి పరిస్థితి దయనీయం. పేదరికంతో అల్లాడుతున్నారు. చదువులు దేవుడిచ్చిన వరం వీరికి. ఆ చదువులతోనే కాస్తోకూస్తో నెట్టుకు వస్తున్నారు. ఇవాళ వీరిలో చదువుకున్న వారికి ఉద్యోగాలు రావడం లేదు. అర్చక వృత్తిని ఎందుకు చేస్తున్నామా.. అని ఆందోళన స్థితిలో ఉన్నారు బ్రాహ్మణ సోదరులు. ఈ వృత్తి చేసినా కడుపుకు భోజనం పెట్టలేని స్థితి. ఇంతటి దయనీయ స్థితి. వీళ్లకు మంచి చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు సాగిస్తున్న పాలన గురించి చెప్పాలి. ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చని బాబు ఎన్నికలకు పోబోయే ముందు ఈ పెద్దమనిషి చంద్రబాబు ఫొటోకు ఫోజులు ఇచ్చి, అట్టహాసంగా ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించారు. కొన్నింటికి రెండు, మూడు పేజీలు కూడా కేటాయించాడు. బ్రాహ్మణ సమాజానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చలేదు ఈ పెద్దమనిషి. ఆర్థిక స్థోమత లేని దేవాలయాలలో పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్న పూజారులకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తానన్నారు. ఆ రోజుల్లో ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఏకంగా 14 వేల గుడులకు ధూపదీప నైవేద్యం స్కీం తీసుకువచ్చి తోడుగా నిలబడ్డారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ స్కీం కింద ఉన్న ఆ 14 వేల గుళ్లను 3 వేలకు తగ్గించారు. మంచి చేస్తానని చెప్పి మోసం చేశారు. 60 ఏళ్లు దాటిన పేద బ్రాహ్మణులకు ఆయుష్మాన్ భవ పథకం కింద నెలకు రూ.1000 పింఛన్ ఇస్తామన్నారు. 60 ఏళ్ల కథ దేవుడెరుగు 65 ఏళ్లు దాటిన బ్రాహ్మణులకైనా పెన్షన్ వస్తోందా? బ్రాహ్మణులకే కాదు.. మిగతా వారికి కూడా పెన్షన్లు రావడం లేదని దారిపొడవునా ప్రజలు నాకు చెబుతున్నారు. అర్హులైన పేద బ్రాహ్మణులకు ఇంటి స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మిస్తానన్నాడు. కనీసం ఒక్కరికైనా ఇచ్చారా? శివార్చకులను బీసీ–డి కింద గుర్తించి చట్ట సవరణ చేస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఈ హామీ బాబుకు గుర్తుకు రాలేదు. దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు, ఇతర సేవకులకు తాము సర్వీసు చేసినంత కాలం ఈనామ్ భూములు అనుభవించే హక్కును కొనసాగిస్తామన్నాడు. నిజానికి ఈ హక్కు ఇంతకు ముందే ఉంటే ఇక్కడ చంద్రబాబు చేసేది ఏముంది? ఇది కూడా ఎన్నికల ప్రణాళికలో పెట్టి.. అదేదో పెద్ద మేలు చేస్తున్నట్లు ప్రకటించుకున్నాడు. చేసిందేమీ లేదు. దేవాలయాల్లోని పూజారులకు పదవీ విరమణ ఉండదని చెప్పాడు ఈ పెద్దమనిషి. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన మాట ఇది. నిజంగా ఆ తర్వాత చేసిందేమిటి? రమణ దీక్షితులు విషయంలో ఈ చంద్రబాబు ఏం చేశారు? 65 ఏళ్లు దాటితే ఏ బ్రాహ్మణుడిని కూడా అర్చక పదవిలో కొనసాగించడం కుదరదని ఏకంగా జీవో తెచ్చి బలవంతంగా పదవీ విరమణ చేయించి రమణదీక్షితుల్ని ఇంట్లో కూర్చోబెట్టిన సంఘటన చూశాం. ఇంతకన్నా దారుణం ఏమీ ఉండదు. వంశపార్యంపర్య హక్కులకు తూట్లు ఆ రోజుల్లో నాన్నగారు ఎండోమెంట్ చట్టాన్ని సవరించి మిరాశీ వ్యవస్థను తిరిగి తెచ్చి వంశపార్యంపర్య హక్కుల్ని కల్పించారు. ఆ చట్టం తీసుకువచ్చి 11 ఏళ్లు అయినా అమలు చేయకపోగా చివరకు ఆ చట్టానికి తూట్లు పొడుస్తూ చంద్రబాబు సరికొత్త జీవోలను తీసుకువస్తున్నారు. బ్రాహ్మణులు వంశపారంపర్యంగా అర్చక వృత్తి చేయకుండా ఉండేలా తూట్లు పొడుస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పిస్తానని మరో హామీ ఇచ్చారు. ఇచ్చేదేమిటని ప్రశ్నిస్తున్నా. దేవుడి దయ వల్ల బ్రాహ్మణులు అందరూ బాగా చదువుకున్న వ్యక్తులు. మన పక్కనే ఉన్న ఐవీఆర్ కృష్ణారావు లాంటి వారు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి ఎదిగిన వ్యక్తి. వీళ్లందరికీ సముచిత స్థానం కల్పించే మాట దేవుడెరుగు వీళ్లందర్నీ అగౌరవ పరుస్తూ ఉద్యోగాలలో నుంచి తీసివేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఆస్తుల పరిరక్షణ అంటే ఇదేనా? దేవాలయాలకు సంబంధించిన ఆస్తులను పరిరక్షిస్తానని మేనిఫెస్టోలో చెప్పారు. ఈయన చెప్పేది ఒక్కటి చేసేది మరొకటి. పక్కనే విజయవాడలోని కనక దుర్గమ్మ దేవస్థానం భూములు కనిపిస్తాయి. ఒక్కో ఎకరా రూ.వంద కోట్ల విలువ చేసే 11 ఎకరాల దేవస్థానం భూములను సిద్ధార్థ అనే ప్రైవేటు కాలేజీకి ఎకరానికి ఏడాదికి రూ.లక్ష చొప్పున 33 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. ఇదీ ఆయన చేస్తున్న పరిరక్షణ. ఇక, సదావర్తి గుడి భూములు.. చెన్నైలో 84 ఎకరాల భూమి ఉంది. రిజిస్ట్రేషన్ విలువే ఎకరా రూ.7 కోట్లు. మార్కెట్ విలువ రూ.12 కోట్లు. కానీ ఈ పెద్దమనిషి ఆ భూముల్ని ఎకరా రూ.27 లక్షల చొప్పున కట్టబెట్టే ప్రయత్నం చేశాడు. అక్కడకు వెళ్లి ఇంతటి దారుణమా? అని ప్రశ్నించి కోర్టులో కేసు వేసి అంతకన్నా ఎక్కువ ఇస్తాం అని చెప్పి ఈ భూములపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం చేస్తే తప్ప వెనకడుగు వేయని పరిస్థితి. గుడికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించడం అంటే ఇదేనా? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్లు, స్కాలర్‌షిపులు.. బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఏటా రూ.3 లక్షల దాకా పెంచుతానని చెప్పి అవహేళన చేస్తున్నాడు చంద్రబాబు. ఒకవైపున దగ్గరుండి కాలేజీల ఫీజులు పెంచిస్తున్నారు. ఈ మనిషి ముఖ్యమంత్రి అయ్యాక ఫీజులకు రెక్కలొస్తున్నాయి. ఫీజులు లక్షలు దాటుతుంటే చంద్రబాబు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంటేమో ముష్టి వేసినట్టు రూ.30 వేలు, 35 వేలకు మించడం లేదు. అది కూడా రెండేళ్లుగా ఇవ్వడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. చెప్పిందేమిటి.. చేసిందేమిటి బాబూ? చంద్రబాబు చెప్పిన మొట్టమొదటి హామీలో బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం రూ.500 కోట్లతో బ్రాహ్మణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. సంవత్సరానికి వంద కోట్ల రూపాయలతో ఐదేళ్లలో 500 కోట్ల రూపాయలతో బ్రాహ్మణ కార్పొరేషన్ వస్తుందీ అని ఆశ పడ్డాం. కానీ ఈ పెద్దమనిషి తన నాలుగున్నర ఏళ్ల పాలలో ఇచ్చింది ఎంతో తెలుసా? అక్షరాలా కేవలం రూ.165 కోట్లు. ఎక్కడ రూ.500 కోట్లు, ఎక్కడ రూ.165 కోట్లు.. ఒక్కసారి ఆలోచించండి. ఉపకార వేతనాలు, పింఛన్ నిధులూ ఇందులో నుంచేనట. ఈ పెద్దమనిషికి గుడిలో దేవుడన్నా భక్తి లేదు.. భయమూ లేదు. ఈ రెండు లేని వ్యక్తి.. కళ్లు ఆర్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది చంద్రబాబు ఒక్కరే. గుడికి సంబంధించింది ఏదైనా చేయాలి అంటే ఎంతటి అన్యాయస్తుడైనా భయపడతారు. దేవుడు పై నుంచి చూస్తాడు.. మొటిక్కాయలు వేస్తారేమోనని భయపడతారు. అట్లాంటిది ఈ పెద్దమనిషి గోదావరి, కృష్ణా పుష్కరాల పేరు చెప్పి రూ.3,200 కోట్లు దోచేశారు. ఇంతగా దోచేసిన పరిస్థితి మనం ఎక్కడా చూసి ఉండం.. ఒక్క మన రాష్ట్రంలో తప్ప. నామినేషన్ పద్ధతిలో ఇష్టానుసారంగా రేట్లు పెంచి కమీషన్లు తీసుకొని పనులు అప్పగించిన పరిస్థితిని గోదావరి, కృష్ణా పుష్కరాలలో చూశాం. అమ్మవారి గుడిలో తాంత్రిక పూజలా.. ఇవాళ విజయవాడ దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరగడం చూశాం. అమ్మవారి గుడిలో తాంత్రిక పూజలేమిటని ప్రజలు నివ్వెరపోతున్నారు. ఇటువంటి విన్యాసాలు ఈ చంద్రబాబు పాలనలో మాత్రమే చూస్తున్న పరిస్థితి. ఇదే పెద్ద మనిషి హయాంలో గుడులలో శుభ్రం చేసే పనుల్లో కూడా ఇష్టానుసారంగా రేట్లు పెంచి తన బంధువులకు పనులు కేటాయిస్తున్నారు. చంద్రబాబు సీఎం కాకముందు అన్నవరం దేవస్థానంలో ఈ పనులకు నెలకు రూ.7 లక్షలు ఖర్చు చేసేవారు. ఈ మనిషి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క అన్నవరమే కాకుండా చాలా దేవస్థానాలను కలిపి తన బంధువు భాస్కర్‌నాయుడుకు కాంట్రాక్ట్ అప్పగించాడు. రేట్లు పెంచి నెలకు రూ.32 లక్షలకు ఇచ్చాడు. ఒక్కొక్క గుడికి నెలకు రూ.7 లక్షలు ఉంటే దాన్ని ఏకంగా రూ.32 లక్షలకు పెంచి తన బంధువు భాస్కరనాయుడుకు ఇచ్చేసి అక్కడ కూడా కమీషన్లు తీసుకుంటున్న పరిస్థితి దేశంలో ఎక్కడా ఉండదేమో? ఈ విధంగా దేవుణ్ణి కూడా అమ్మేసే వ్యక్తి ఎక్కడా ఉండడేమో ఈ చంద్రబాబు తప్ప. ఐవీఆర్కి జరిగిన అవమానాన్నీ జీర్ణించుకోలేం ఐవీఆర్ కృష్ణారావు, రమణ దీక్షితుల గురించి చెప్పాల్సిన పని లేదు. బ్రాహ్మణులలో ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తులు చాలా అరుదు. ఆ స్థాయిలో ఈ ఇద్దరూ ఉన్నారు. వాళ్లిద్దరికీ జరిగిన అవమానం నిజంగా జీర్ణించుకోలేనిది. అంతగా అవమానించారు. ఇంతటి దారుణమైన పరిపాలన. చివరకు తిరుపతిలో పరిస్థితి ఏ స్థాయికి వెళ్లిందంటే.. రమణ దీక్షితులు ఆరోపిస్తున్నట్టుగా హుండిలోని కానుకలు, నగలు కూడా మాయం అవుతున్నాయన్న పరిస్థితిలోకి ఈ వ్యవస్థ దిగజారింది. ఈపాలన గురించి నేను చెప్పాల్సింది చెప్పా. రేప్పొద్దున దేవుడు అశీర్వదించి, మీ అందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఏం చేస్తే బాగుంటుందన్న అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వమని అందరినీ కోరుతున్నా. వేదికపై ఉన్న పెద్దలు ఇచ్చారు. వారితో పాటు మీరూ సలహాలు, సూచనలు ఇవ్వండి. ప్రతి సూచననూ స్వీకరిస్తా. సాధ్యాసాధ్యాలను పరిశీలించి అత్యధికంగా అమలు చేసేందుకు, మేలు చేసేందుకు ప్రయత్నిస్తానని మాట ఇస్తున్నా. మీ అందరి ముఖాల్లో సంతోషం నింపుతానని చెబుతున్నా’’ అని వైఎస్ జగన్ అన్నారు. బ్రాహ్మణుల ఆశాదీపం వైఎస్ జగన్ రాష్ట్రంలో టీడీపీ పాలనలో బ్రాహ్మణులు అన్ని రంగాల్లోనూ అణిచి వేయబడ్డారు. మళ్లీ వారికి పూర్వ వైభవం రావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవడం ఒక్కటే మన ముందున్న కర్తవ్యం. ఆ రోజు టంగుటూరి ప్రకాశం పంతులు బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడారు. అంతటి వీరోచితమైన సాహసాలు చేసే నాయకుడు వైఎస్ జగన్. జగన్ నాయకత్వంలో బ్రాహ్మణులకు న్యాయం జరుగుతుంది. – పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయచందర్ మా ఆశలన్నీ మీ పైనే.. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు ఇస్తామన్న చంద్రబాబు ఆ మొత్తం కేటాయించలేదు. బ్రాహ్మణులను అన్నివిధాలుగా అణిచి వేస్తున్నారు. మా ఆశలన్నీ మీపైనే. మీరు అధికారంలోకి వస్తే రాష్ట్ర బడ్జెట్లో ఏడాదికి రూ.300 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.1500 కోట్లు కేటాయించాలి. రాజన్న పెళ్లి కానుక కింద పేద బ్రాహ్మణ వధువులకు రూ.లక్ష అందజేయాలి. ధూపదీప నైవేద్యాల కోసం మీ తండ్రి రాజశేఖరరెడ్డి ప్రతి నెలా రూ.2,500 కేటాయించి అర్చకులను ఆదుకున్నారు. మీరు ఆ సాయాన్ని రూ.10 వేలకు పెంచాలి. జీర్ణావస్థకు చేరుకున్న ఆలయాలకు పూర్వ వైభవం మీ ఒక్కరి వల్లే సాధ్యం. – జి పురుషోత్తం, కుప్పం, చిత్తూరు జిల్లా ఒడియా బ్రాహ్మణులకు ధ్రువపత్రాలు ఇవ్వడం లేదన్నా.. అన్నా.. మేము చాలా ఏళ్ల క్రితం ఒడిశా నుంచి వచ్చి విశాఖలో స్థిరపడ్డాం. సుమారు 4 వేల మందికి పైగా ఇక్కడే జీవిస్తున్నాం. మాకు ప్రభుత్వ పథకాలు వర్తించాలన్నా, బ్రాహ్మణ కార్పొరేషన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా కుల ధ్రువపత్రాలు కావాలంటున్నారు. అధికారులేమో ఇవ్వడం లేదు. – నారాయణ, విశాఖపట్నం వైఎస్సార్‌లో వేదాలు మిళితం.. మీరు స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని వైఎస్సార్‌లో వేదాలన్నీ మిళితమై ఉన్నాయి. మీరు యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ అన్నారు కానీ మా బ్రాహ్మణ పరిభాషలో వై అంటే యజుర్వేదం, ఎస్ అంటే సామవేదం, ఆర్ అంటే రుగ్వేదం. మీరు కూడా మీ నాన్నలా బ్రాహ్మణుల కోసం చిత్తశుద్ధితో పాటు పడతారనే నమ్మకం ఉంది. – పురుషోత్తమ శర్మ, తెనాలి మా సత్రాన్ని అప్పగించాలని ఏళ్ల తరబడి పోరాడుతున్నా.. మా పూర్వీకులు 1935లో నర్సారావుపేటలో సత్రం నిర్మించారు. వితంతువులకు ఆశ్రయం కల్పించేలా చర్యలు తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం 30/87 జీవో తీసుకువచ్చి ఈ సత్రాన్ని స్వాధీనం చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ఫలితం లేదు. – మోహన్ మూర్తి, నర్సారావుపేట, గుంటూరు జిల్లా సంబంధిత వార్తలు... ‘పచ్చ మీడియాను డిజప్పాయింట్ చేస్తున్నా’ ‘అదే వైఎస్‌కూ.. చంద్రబాబుకు తేడా’ ‘నమ్మినవారే వైఎస్ జగన్‌ను మోసం చేశారు’