
బ్రాహ్మణుల ఆత్మీయ సదస్సు వేదికపై జగన్‌మోహన్‌రెడ్డి, బ్రాహ్మణ వర్గ ప్రతినిధులు
స్వాతంత్య్రానంతరం ఆర్థిక, రాజకీయ సాధికారతకు నోచుకోని బ్రాహ్మణులకు జనహృదయ నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆత్మీయ హస్తం అందించారు. ఆదుకుంటామని అభయమిచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారం సిరిపురం జంక్షన్ సమీపంలోని విజ్ఞాన్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సులో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ సూచనలను, సలహాలను చెప్పారు. వారి బాధలు విన్న జననేత అన్ని విధాలా ఆదుకుంటానని, అండగా ఉంటానని భరోసానివ్వడంతో వారిలో పట్టరాని ఆనందం వెల్లివిరిసింది.
సాక్షి, విశాఖపట్నం: దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలు 976.. వాటిలో మూడో వంతు కూడా ధూపదీప నైవేద్యాలకు నోచుకోని పరిస్థితి.. ఇక ఈ ఆలయాలకు ఉన్న 23,920 ఎకరాల్లో సగానికిపైగా భూములు అన్యా క్రాంతమైపోయిన దుస్థితి.. ఈ ఆలయాలపై ఆధారపడి జీవించే అర్చకుల ఆర్థిక పరిస్థితి మరీ దయనీయం.. రోజురోజుకు దిగజారుతున్న తమ బతుకు కష్టాలను చెప్పుకునేందుకు వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేసిన బ్రాహ్మణుల ఆత్మీయ సదస్సుకు బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సిరిపురం జంక్షన్ సమీపంలోని విజ్ఞాన్ కళాశాల మైదానంలో బాపట్ల ఎమ్మెల్యే కోనా రఘుపతి అధ్యక్షతన జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. మేనిఫెస్టో రూపకల్పన కోసం సూచనలు, సలహాలు ఇవ్వాలని జననేత కోరగానే జిల్లాకు చెందిన కొంతమంది నేరుగా మాట్లాడి తమ ఆవేదనను చెప్పు కోగా.. మరికొంత మంది వినతుల రూపంలో అందించారు. సదస్సు ప్రారంభంలో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతోపాటు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రముఖ సినీ నటుడు టి.విజయచందర్, జిల్లాకు చెందిన పలువురు పండితులు మాట్లాడారు.
కర్మకాండలు చేసుకునేందుకుస్థలాల్లేని దుస్థితి మాది
జిల్లాలో మూడు లక్షల మందికి పైగా బ్రాహ్మణులున్నారని, వారిలో ఎక్కువమంది దారిద్య్రంలో జీవిస్తున్నారని అర్చక సంఘాల ప్రతినిధులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా కేంద్రంలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడా కర్మకాండలు చేసుకునేందుకు స్థలాల్లేవని, ఎక్కడైనా చేసుకుందామని ప్రయత్నించినా అనుమతించడం లేదని వాపోయారు. అర్చకులు, పేదబ్రాహ్మణ కుటుంబాలకు రూ.5 లక్షల వరకు పరిమితి గల హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. సొంతగూడు లేని బ్రాహ్మణులు చాలామంది ఉన్నారని, వారికి ఇళ్లస్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లో బ్రాహ్మణ కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాకు ఒక్కటైనా వేదపాఠశాల ఏర్పాటు చేయాలన్నారు.
బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు రూ.165 కోట్లకు మించి ఇవ్వలేదని వివరిస్తూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి రూ.300 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.1500 కోట్లు ఇవ్వాలని కోరారు. అలాగే ఎమ్మెల్సీ పదవులతోపాటు నామినేటెడ్ పోస్టుల్లో బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వాలని సూచించారు.
జననేత హామీతోబ్రాహ్మణుల్లో భరోసా
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఉపన్యాసంలో ఎన్నికల్లో చంద్రబాబు బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను వివరిస్తూ ఏ ఒక్కటైనా అమలుకు నోచుకున్నాయా అని ప్రశ్నించారు. లేదు లేదంటూ బ్రాహ్మణులంతా ముక్తకంఠంతో నినదించారు. ఆ తర్వాత సభికుల నుంచి సూచనలు సలహాలు స్వీకరించిన జగన్.. మీకు అండగా నేను ఉంటాను.. ఆదుకుంటానని అభయమిచ్చారు. ఒక్కసారి మాట ఇస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. నాన్నగారి కంటే ఎక్కువ మేలు చేసి చూపిస్తానని భరోసా ఇవ్వడంతో సదస్సుకు వచ్చిన జిల్లాకు చెందిన బ్రాహ్మణులు ఆనందభరితులయ్యారు. మీకు అండగా ఉంటాం.. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంటాం అంటూ నినాదాలతో హోరెత్తించారు. సదస్సులో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు సుధాకర్, వీవీ వామనరావు, ఆకెళ్ల రమణమూర్తి, పూర్ణానంద శర్మ, జిల్లా అర్చక సంఘ అధ్యక్షులు అయిలూరి శ్రీనివాస దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.