ఆవేదనాదం | Brahmans Meeting In Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఆవేదనాదం

Sep 11 2018 7:48 AM | Updated on Sep 15 2018 10:57 AM

Brahmans Meeting In Visakhapatnam - Sakshi

ఆత్మీయ సదస్సుకు హాజరైన బ్రాహ్మణులు (ఇన్‌సెట్‌) ప్రసంగిస్తున్న జగన్‌మోహన్‌ రెడ్డి

సాక్షి, విశాఖపట్నం: వేదాధ్యయనం చేసిన పెదవులు తమకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశాయి. ఆర్థిక స్థితి సహకరించకపోయినా అగ్రవర్ణానికి చెందిన వారనే నెపంతో సంక్షేమ పథకాలు దరి చేరనీయకపోవడాన్ని గర్హించాయి. పూట గడవకున్నా.. ఆలయాలే ఆధారంగా జీవనం గడుపుతున్న తమకు ఆపద్బాంధవుడిలా అగుపించిన వైఎస్సార్‌ అకాలమరణంతో తమ పరిస్థితి మళ్లీ యథాస్థితికి చేరిందని వారంతా కలత చెందారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల దోపిడీ చాలదన్నట్లు జన్మభూమి కమిటీలు కూడా తోడై తమకు పథకాలేవీ అందకుండా చేయడమే కాక, ఏమాత్రం ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారన్నారు. అంధకారం అలముకున్న తమ జీవితాల్లో వెలుగురేఖలు ప్రసరించాలంటే ఆర్థిక తోడ్పాటుతో పాటు రాజకీయాల్లోనూ అవకాశం కల్పించాలని జగన్‌మోహన్‌రెడ్డిని అభ్యర్థించారు. మీకు అండగా ఉంటాం.. చేయూతనివ్వమని విజ్ఞప్తి చేశారు.  

ఒడియా బ్రాహ్మణులకు ధ్రువపత్రాలు ఇవ్వడం లేదు
అన్నా.. మేము చాలా ఏళ్ల క్రితం ఒడిశా నుంచి వచ్చి విశాఖలో స్థిరపడ్డాం. సుమారు 4 వేలమందికి పైగా ఇక్కడే జీవిస్తున్నాం. ప్రభుత్వ పథకాలకు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే కుల ధ్రువీకరణ పత్రాలు కావాలంటున్నారన్నా. మాకేమో ధ్రువపత్రాలు ఇవ్వడం లేదు. మా ఒడియా బ్రాçహ్మణులు ఎలా బతకాలి? ధ్రువపత్రాలు మంజూరు చేసి, పథకాలు వర్తింపజేయమని కోరుతున్నాం.
– రాజునారాయణ, విశాఖపట్నం

అర్చకులకు జీవనభృతి కల్పించాలి
సామాన్య దేవాలయాల్లో అర్చకుల జీవనభృతికి భద్రత లేదు. సుమారు 20 ఏళ్లుగా సేవ చేసినా మాకు సరైన ఆధారం లేక  కుటుంబాలు వీధినపడుతున్నాయి. ముఖ్యంగా వివాహసమయంలో అర్చకుడంటే అభ్యంతరం చెబుతున్నారు. వైఎస్సార్‌ ఉన్నప్పుడు జీర్ణదేవాలయాల పునరుద్ధరణకు దీపధూప నైవేద్యాల కోసం, అర్చకుల కోసం కొంత మొత్తం ఇచ్చేవారు.   మా పిల్లల కోసం ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇచ్చేవారు. మాకు అదే పాలన కావాలి. మా సమస్యలపై జగన్‌కు వినతిపత్రం ఇచ్చాం.
– కాళ ప్రసాద్, కిశోర్‌శర్మ, రవీంద్రనగర్, విశాఖపట్నం

వేద విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలి
అన్నా అర్చకత్వం ఇబ్బందిగా మారింది. కడుపు నింపడం లేదు. వేదవిద్య పూర్తి చేసినా ఉపాధి లభించడం లేదు.  ఇక పేద బ్రాహ్మణులకు వేదవిద్య అందుబాటులో లేదు. ప్రతి జిల్లాలోను వేద విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలి. 6 నుంచి 10వ తరగతి వరకు వేదాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి.
–  రవికిరణ్‌ శర్మ, వైకుంఠపాలెం, ప్రకాశం జిల్లా

మిమ్మల్ని సీఎం చేసేందుకుమీ వెంటే ఉంటాం
వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో బ్రాహ్మణులకు చేసిన మేలును ఎన్నటికీ మరువలేం. ఈ ఆత్మీయ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా ఇంతమంది బ్రాహ్మణులు రావడం ఇదే తొలిసారేమో. ఆయనపై అభిమానానికి ఇదే నిదర్శనం. ఇళ్లు, గుడులకే పరిమితమైన బ్రాహ్మణులు మొదటిసారి సమావేశాలకు వచ్చి తమ సమస్యలను మీకు విన్నవించారు. మీ పార్టీకి బ్రాహ్మణుల సహకారం పూర్తిగా ఉంటుంది. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసేవరకు మీ వెంటే ఉంటాం.
– సీతంరాజు సుధాకర్, విశాఖపట్టణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement