అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తారా?

YS Jagan Mohan Reddy Comments on Atchannaidu - Sakshi

‘‘సభలో అచ్చెన్నాయుడు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారు. అక్రమ మద్యంపై మేం పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నాం. టీడీపీ హయాంలో గ్రామాల్లో యథేచ్ఛగా విస్తరించిన దాదాపు 43 వేల బెల్టుషాపులను మూసివేశాం.  పర్మిట్‌ రూమ్‌లు కూడా లేకుండా చేశాం. మేం అధికారంలోకి వచ్చింది జూన్‌లో కాగా నెల  తర్వాత మద్యం షాపులు 4,380 మాత్రమే ఉన్నాయి. ఎక్సైజ్‌ శాఖలో ఈ రికార్డులు కూడా ఉన్నాయి. జూలై 1వతేదీ నాటికి రాష్ట్రంలో 4,380 షాపులు ఉన్నట్లు తేలితే ఆయన (అచ్చెన్నాయుడు) రాజీనామా చేస్తారా? ఆయన రెడీ అంటే ఎక్సైజ్‌ శాఖ అధికారులు నిరూపిస్తారు. మేం అ«ధికారంలోకి వచ్చింది మే నెల చివర్లో.

అయినా జూలై 1 నాటికి రాష్ట్రంలో 4,380  మద్యం దుకాణాలు ఉన్నాయని ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు చెబుతున్నారంటే అవి టీడీపీ హయాంలో ఉన్నట్లే కదా? దుకాణాల సంఖ్య 4,380 నుంచి 3,456కు వచ్చాయంటే తగ్గినట్లే కదా? దాన్ని కూడా అచ్చెన్నాయుడు వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారు. (ఈ సందర్భంగా టీడీపీ హయాంలో మద్యం షాపుల కొనసాగింపునకు సంబంధించి 2017 మార్చి 22న జారీ చేసిన జీవోను ప్రదర్శించారు. దాని ప్రకారం 2015 నుంచి 17 వరకు రెండేళ్లకు నిర్ణయించిన 4,380 మద్యం షాపులను మరో రెండేళ్లు (2017 నుంచి 19) ఎలా కొనసాగించిందీ వివరించారు.) మేం ఈ ఏడాది మే చివరిలో అధికారంలోకి వచ్చాం. నెల తర్వాత అంటే జూలై 1 నాటికి రాష్ట్రంలో 4,380 మద్యం షాపులున్నాయి. ఇప్పుడు వాటి సంఖ్యను దాదాపు 25 శాతం తగ్గించి 3,456కి మాత్రమే అనుమతి ఇచ్చాం.

అయినా కావాలని ఒక పద్ధతి ప్రకారం సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. (ఈ  సందర్భంగా మద్యపాన నిషేధానికి సంబంధించి తాను విపక్ష నేతగా ఉండగా పాదయాత్రలో ఏం మాట్లాడానో ముఖ్యమంత్రి జగన్‌ వీడియో ప్లే చేసి చూపించారు. నెల్లూరు జిల్లాలో మహిళా సదస్సులో మాట్లాడిన వీడియోతో పాటు మరో వీడియోను కూడా సభలో ప్రదర్శించారు) అన్ని విషయాలూ దగ్గర ఉన్నా సభను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తూ అబద్ధాలు ఆడుతున్నారు. ఈ మనిషి (అచ్చెన్నాయుడు) అబద్ధాల మీద అబద్ధాలు చట్టసభలో చెబుతుంటే, వీటిని రికార్డుల్లోకి తీసుకునే కార్యక్రమం ఎలా ఆమోదయోగ్యం? నిజాలు మాత్రమే సభ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. కానీ ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలు మాత్రమే చెప్పే ఇటువంటి వ్యక్తికి మళ్లీ సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకండి. బెల్టు షాపులు తీసేసినప్పుడు, మద్యం అమ్మకాలు కూడా ఒకరికి 6 నుంచి 3 బాటిల్స్‌కు తగ్గించినప్పుడు, ఎడాపెడా కేసులు పెడతా ఉన్న పరిస్థితుల్లో ఎవడో డ్రెస్‌ వేసుకుంటాడంట! డ్రెస్‌కు జేబులు ఉంటాయంట. గ్రామాల్లో  ఇంటింటికీ తిరిగి బాటిళ్లు అమ్ముతాడంట. ఈ మూడు విషయాల మీద టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడి మీద నేను ప్రివిలేజ్‌ మోషన్‌ మూవ్‌ చేస్తున్నా. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top