విశ్వాస పరీక్షలో నెగ్గిన యడ్డీ సర్కార్‌ | Yeddyurappa Wins In Floor Test In Karnataka Assembly | Sakshi
Sakshi News home page

విశ్వాస పరీక్షలో నెగ్గిన యడ్డీ సర్కార్‌

Jul 29 2019 11:57 AM | Updated on Jul 29 2019 12:30 PM

Yeddyurappa Wins In Floor Test In Karnataka Assembly - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గారు. సోమవారం జరిగిన బలపరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా 106 మంది సభ్యులు ఓటేశారు. దీంతో మ్యాజిక్‌ ఫిగర్‌ను యడ్డీ సునాయాసంగా ఛేదించగలిగారు. సభకు కాంగ్రెస్‌-బీజేఎస్‌ సభ్యులు కూడా హాజరయ్యారు. వీరంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ..  విశ్వాస పరీక్షలో సర్కార్‌ విజయం సాధించింది. బీజేపీకి ఉన్న 105 మందితో పాటు ఓ స్వతంత్ర  ఎమ్మెల్యేతో కలుసుకుని బలం 106కి చేరింది. దీంతో మ్యాజిక్‌ ఫిగర్‌ 104 కంటే రెండు ఓట్లను ఎక్కువగా సాధించి బలపరీక్షలో గెలుపొందింది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 మంది సభ్యులు ఓటు వేశారు. మూజువాణి పద్దతిలో స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ ఓటింగ్‌ను చేపట్టారు. ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ ఉండడంతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం విజయం సాధించిందని స్పీకర్‌ ప్రకటించారు. అనంతరం సీఎం యడియూరప్ప సభలో సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రజల విజయమన్నారు. విశ్వాస పరీక్షకు ముందు సభలో యడియూరప్ప మాట్లాడుతూ.. బల నిరూపణలో తమ ప్రభుత్వం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో పాలనలో ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. రైతులకు పెద్దపీఠ వేస్తామని స్పష్టం చేశారు. ప్రజల, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని  సీఎం పేర్కొన్నారు.

చర్చలో భాగంగా కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య మాట్లాడుతూ.. యడియూరప్ప వ్యాఖ్యలను తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపాలని సూచించారు. రైతుల సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఎంతో చేశాయని ఆయన గుర్తుచేశారు. కాగా బలపరీక్షలో ప్రభుత్వం విజయం సాధించడంతో.. గత కొంత కాలంగా సాగుతోన్న రాజకీయ సంక్షోభానికి తెరపడినట్టయింది. కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమయిన 17 మంది సభ్యులపై  స్పీకర్‌ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. స్పీకర్‌ చర్యతో సభలో మ్యాజిక్‌ ఫిగర్‌ 104కి పడిపోయింది. దీంతో విశ్వాస పరీక్షలో యడియూరప్ప సునాయాసంగా విజయం సాధించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement