అప్పుడు నా జీతం రూ.147 : ఎమ్మెల్యే

Wyra MLA Ramulu Naik Life Story - Sakshi

నాడు ప్రజా రక్షకుడిని.. నేడు ప్రజా సేవకుడిని కష్టాలు, కన్నీళ్లను ఆత్మవిశ్వాసంతో అధిగమించా.. ప్రజలతో మమేకం కావడమంటే నాకెంతో ఇష్టం పర్సనల్‌ టైమ్‌లో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ 

‘నా చిన్ననాటి జీవితం పుట్టెడు కష్టాలతో ప్రారంభమైంది. వ్యవసాయ కుటుంబం కావడంతో కరువు కాటకాలతో మొక్కజొన్న అన్నం, జొన్నరొట్టెతో కడుపు నింపుకున్నా. కష్టాలను, కన్నీళ్లను ఆత్మవిశ్వాసంతో అధిగమించా. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సామెత నాకు అక్షరాలా వర్తిస్తుంది. కష్టాల కడలి నుంచి కానిస్టేబుల్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించా. పోలీస్‌ శాఖలో పని చేసినంత కాలం అనేక క్రీడా పోటీల్లో పాల్గొని అథ్లెటిక్స్‌ చాంపియన్‌గా బహుమతులు గెలుచుకున్నా. రాష్ట్ర, జిల్లాస్థాయిలో అనేక అవార్డులు దక్కించుకున్నా. నాడు ప్రజా పోలీస్‌గా.. నేడు ప్రజా సేవకుడిగా సేవచేసే మహోన్నత అవకాశం నాకు దక్కింది. ఇది ఎంతో సంతృప్తినిస్తోంది’ అంటున్న వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌తో ఈ వారం పర్సనల్‌ టైమ్‌. 

సాక్షిప్రతినిధి, ఖమ్మం: కనీస సౌకర్యాలు లేని మారుమూల గిరిజన గ్రామమైన జూలూరుపాడు మండలం పాపకొల్లు మా సొంతూరు. చిన్నప్పుడు కనీస వసతులు లేక పాఠశాలకు వెళ్లడానికి సైతం అనేక ప్రయాసలకు గురైన దీనస్థితి. వాటిని తలుచుకుంటే ఇప్పటికీ బాధ కలుగుతుంది. ఏ హోదాలో ఉన్నా ప్రజలకు సేవ చేయాలనే నా సంకల్పం, సేవాభావమే నన్ను ఎమ్మెల్యేగా చేసింది. వ్యవసాయ కుటుంబం మాది. అనేక కష్టాలకోర్చి జీవనం సాగించిన కుటుంబం మాది. బాల్య దశలో కరువును సైతం మా కుటుంబం అనుభవించాల్సి వచ్చింది. ఆ రోజుల్లో మొక్కజొన్న అన్నం, జొన్న రొట్టెలతో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి. కరువుతో కూడిన చీకటి రోజులను తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది. సుశిక్షితులైన పోలీస్‌ అధికారుల నేతృత్వంలో పోలీస్‌ ఉద్యోగం నిర్వహించడం వల్ల అనేక అంశాలపై పట్టు లభించింది. ఈ పని రాములునాయక్‌ మాత్రమే చేయగలుగుతాడు.

ఈ క్లిష్ట సమస్యను ప్రజలతో ఒప్పించగలిగే నేర్పు అతడి సొంతం అనే స్థాయిలో పోలీస్‌ శాఖలో నా పనితీరు ఉండేది. అనేక క్లిష్ట సమయాల్లో ప్రజలను సమాధానపరచడానికి, పోలీస్‌ పరంగా వారి సహకారం తీసుకోవడానికి పోలీస్‌ ఉన్నతాధికారులు సైతం ఆ బాధ్యతను నాపైనే ఉంచడం ఇప్పటికీ నాకెంతో ఆనందాన్ని, ఒకింత గర్వాన్ని ఇస్తుంది. ప్రజల్లో ఒకడిగా నన్ను ఆయా ప్రాంతాల ప్రజలు సొంతం చేసుకున్న తీరు సైతం ఎంతో సంతృప్తినిచ్చే అంశం.. పోలీస్‌ పరంగా ప్రజల నుంచి కావాల్సిన సహకారాన్ని వారికి వివరించే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సైతం పోలీసు అధికారులు దృష్టికి నిక్కచ్చిగా.. నిర్మొహమాటంగా తీసుకెళ్లడంతో పోలీస్‌ శాఖలో నన్ను ప్రజా పోలీస్‌ అనేవాళ్లు. విషయాన్ని నిర్మొహమాటంగా, సున్నితంగా సందర్భాన్నిబట్టి ఇటు పోలీస్‌ అధికారులకు, అటు ప్రజలకు వివరించడం వల్ల అనేక సమస్యలను అధిగమించిన పరిస్థితి ఉండేది. ఉద్యోగపరంగా మారుమూల గ్రామాల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఉండేది.

కుటుంబ క్షేమ సమాచారం తెలుసుకునేందుకు మాకు కేవలం పోలీస్‌ స్టేషన్‌లో ఉండే వైర్‌లెస్‌ సెట్‌ మాత్రమే మార్గం. నేను పనిచేస్తున్న ప్రాంతం నుంచి మా సొంతూరి పరిధిలోకి వచ్చే పోలీస్‌ స్టేషన్‌కు సెట్‌లో మాట్లాడి.. కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం తెలుసుకునేవాళ్లం. కొన్ని సందర్భాల్లో పరిస్థితి తీవ్రత ఉన్నా వెళ్లలేని పరిస్థితుల్లో అక్కడి సాటి ఉద్యోగుల సహకారంతో కుటుంబ సమస్యలను చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. మాది ఉమ్మడి కుటుంబం. సోదరులందరం కలిసే ఉండేవాళ్లం. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య మాకు ఆత్మీయతానుబంధాలు ఎక్కువ.
 
రూ.147 వేతనంతో.. 
రూ.147 నెలసరి వేతనంతో పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌గా చేరిన నేను ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పిల్లలను సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష ఉండేది. అందుకు అనుగుణంగానే నా కుమారుడు జీవన్‌ సివిల్‌ సర్వీస్‌లో ర్యాంక్‌ సాధించి ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ముంబై ఇన్‌కంట్యాక్స్‌ అడిషనల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నాడు. నాకు ఇద్దరు కూతుళ్లు. వారిలో ఝాన్సీబాయి ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా.. జయశ్రీ ఆబ్కారీ శాఖలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది. పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో నా సతీమణి రాంబాయి పాత్ర కీలకం. నేను పోలీస్‌ ఉద్యోగంలో మారుమూల గ్రామంలో పనిచేస్తున్నా.. పిల్లల చదువులకు ఇబ్బంది రాకుండా ఓర్పు.. నేర్పుతో ఆవిడ వ్యవహరించేది. ఇప్పుడు నేను రాజకీయాల్లో తలమునకలైనా కుటుంబ విషయాలు, అవసరాలు ఆవిడే చూసుకుంటుంది.

ఆవిడ సహకారం వల్లే ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి సమయాన్ని వెచ్చించగలుగుతున్నా. నాకు చాలా చిన్న వయసులోనే వివాహం జరిగింది. జీవితంలో అత్యంత సంతోషం కలిగిన రోజు జీవన్‌కు సివిల్‌ సర్వీస్‌లో ర్యాంకు లభించిన రోజు. ఇక పోలీస్‌ శాఖలో దాదాపు 37 ఏళ్లు వివిధ హోదాల్లో సేవలందించా.. ఇప్పటికీ పోలీస్‌ శాఖలో నాకు అన్ని హోదాల్లో మంచి మిత్రులున్నారు. వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడంతోపాటు కుటుంబ విషయాలను మాట్లాడుకోవడం ఇప్పటికీ నాకు రివాజు. అనేక మంది నాతో పనిచేసిన సహచరులు వివిధ హోదాల్లో ఉన్నారు. వారి ద్వారా ప్రజా సమస్యలను సైతం తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. మాది ఉమ్మడి కుటుంబం కావడంతో చదువు పూర్తి కాగానే ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అప్పట్లో నాకు ఎంప్లాయ్‌మెంట్‌ కార్డు ఉండడంతో సీనియార్టీ ద్వారానే పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం లభించింది. అనేక మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రజల పక్షాన పనిచేసే.. వారికి సేవచేసే అవకాశం లభించడం సంతోషంగా ఉంటుంది. ఇక సేవా కార్యక్రమాల నిర్వహణ నా జీవితంలో ఒక భాగంగా మారింది.

పోలీస్‌ శాఖలో ఏ హోదాలో ఉన్నా.. ఏ ప్రాంతంలో ఉన్నా.. ఆ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నది నా తపన. అందుకోసం అనేక ప్రాంతాల్లో వందలాది మందికి కంటి చికిత్సలు చేయించా. రక్తదాన శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి రక్తం అందుబాటులో ఉండేందుకు నావంతు సహకారం అందించా. పోలీస్‌ శాఖలో పని చేసినంత కాలం అథ్లెటిక్స్‌ చాంపియన్‌గా అనేక పోటీల్లో పాల్గొని అవార్డులు సాధించాను. విశేషం ఏమిటంటే.. మా ముగ్గురు పిల్లలు సైతం క్రీడాకారులే. అథ్లెటిక్స్‌లో వారిది అందెవేసిన చేయి. అయితే వారంతా తమ ప్రతిభ ద్వారానే ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. క్రీడా కోటాను ఉపయోగించుకోలేదు. ఇక అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు సమయం చిక్కినా పెండింగ్‌ సమస్యలపై, కుటుంబ అవసరాలపై దృష్టి సారించడానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తా. సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడక కొన్ని ఏళ్లయింది. ఏ సినిమా చూడాలన్నా పిల్లలు ఇంట్లోనే చూసే వెసులుబాటు కల్పించారు. ప్రజాప్రతినిధిగా విద్యాపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి మారుమూల గ్రామంలో విద్య పేద విద్యార్థులకు అందుబాటులో ఉండాలనేది నా ఆకాంక్ష. నాకు లభించే ప్రతి అవకాశం అందుకోసమే వినియోగిస్తా.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top