
సాక్షి, వరంగల్ రూరల్ : జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాపరిషత్ జిల్లాల పునర్విభజనతో ఆరు జిల్లా పరిషత్‌లుగా విడిపోయింది. వచ్చే జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలు నూతన జిల్లాల వారీగా జరుగనున్నాయి. ఈ మేరకు నూతన జిల్లా ప్రజా పరిషత్‌ల వారీగా రిజర్వేషన్లు ప్రభుత్వం బుధవారం ఖరారు చేసింది.
రిజర్వేషన్ల ప్రక్రియ అనంతరం జిల్లాలో జెడ్పీ చైర్మన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. రూరల్ జిల్లా అక్టోబర్ 11, 2016న ఆవిర్భవించింది. ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోనే జిల్లా పరిషత్ కొనసాగింది. త్వరలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీలు రిజర్వేషన్లలో మహిళలకు కేటాయించిన వారికి ఈ అవకాశం దక్కనుంది.
ఇప్పటికే జిల్లా కలెక్టర్‌గా మహిళే ఉండగా, ఇప్పుడు జెడ్పీ చైర్‌పర్సన్ మహిళలకు రిజర్వేషన్ కావడంతో వారికి ఉన్నత పదవులు లభించనున్నాయి. జిల్లాలో 16 జెడ్పీటీసీలు, 178 ఎంపీటీసీలు ఉన్నాయి. పదవి ఎవరిని వరిస్తుందోనని చర్చలు మొదలయ్యాయి.