రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ కౌంటర్

Wilful defaulters : Congress misleading people in  brazen manner says Nirmala Sitharaman - Sakshi

ప్రజలను తప్పుదారి పట్టించే విధానం

13 ట్వీట్లలో  ఆర్థిక మంత్రి వివరణ

సాక్షి, న్యూఢిల్లీ: ఉద్దేశ పూర్వక రుణ ఎగవేతదారుల బకాయిల మాఫీ ఆరోపణలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ముఖ్యంగా రుణాలను ఎగవేసిన వారిలో ఎక్కువగా బీజేపీ మిత్రులు ఉన్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన దాడికి ఆమె ట్విటర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.  రాహుల్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన నిర్మలా సీతారామన్‌ బ్యాంకు రుణాల మాఫీ విషయంపై  రాహుల్ వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని మండిపడ్డారు. ఈ విషయంలో అవగాహన కోసం కాంగ్రెస్ హాయంలో ఆర్థికమంత్రిగా ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను సంప్రదించాలని కోరారు. బ్యాంకులు ఎవరి రుణాలను మాఫీ చేయలేదని, రుణాలు చెల్లించే సామర్థ్యం ఉన్నప్పటికీ కావాలనే ఎగగొట్టినవారిని ‘విల్ ఫుల్ డీఫాల్టర్లు’గా ఆర్‌బీఐ ఆయా కేటగిరీల్లో చేర్చిందని వివరించారు. (షాకింగ్ : డిఫాల్టర్ల వేలకోట్ల రుణాలు మాఫీ)

2009-10, 2013-14 మధ్య షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు 1,45,226 కోట్లను మాఫీ చేశాయని గుర్తు చేశారు. రిజర్వ్ బ్యాంకు నిర్దేశించిన నాలుగేళ్ల ప్రొవిజనల్ సైకిల్ ప్రకారం ఎన్‌పిఎలకు (నిరర్ధక ఆస్తులు) కేటాయింపులు చేసినట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. నాటి యూపీఏ ఫోన్ బ్యాంకింగ్ ద్వారా లాభపడినవారే డిఫాల్టర్లుగా మారారని నిర్మలా సీతారామన్ ఎదురు దాడికి దిగారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్‌బీఐ గవర్నరుగా ఉన్న రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఉటంకించారు. 2006-2018 మధ్య కాలంలోనే మొండి రుణాలను ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొన్నారు.  

దీంతోపాటు ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కూడా  సీతారామన్  చెప్పుకొచ్చారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా  వివరాలను కూడా ట్విట్ చేశారు. వీళ్లను ఫ్యుజిటివ్ ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించడంతోపాటు వారికి సంబంధించిన స్థిర, చర ఆస్తులను స్వాధీనం చేసుకున్నాం. ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది. రెడ్ కార్నర్ నోటీసులిచ్చాం. వారిని స్వదేశానికి తిరిగి రప్పించేందుకు ఆయాదేశాలతో కలసి పని చేస్తున్నామని చెప్పారు. వరుసగా 13 ట్వీట్లలో ప్రభుత్వ వైఖరిని వివరించారు.  (ఎగవేతదారుల్లో వారే అధికం)

 కాగా ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం ఆర్‌బీఐ 50 మంది డీఫాల్టర్ల జాబితాను  విడుదల చేసింది. దీనిపై స్పందించిన  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రుణాలు ఎగగొట్టిన వారిలో బీజేపీ మిత్రులు ఉన్నారంటూ  విమర్శలు చేసిన  సంగతి తెలిసిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top