
న్యూఢిల్లీ: నియంత్రణపరమైన అనుమతుల్లో జాప్యం అనిశ్చితికి దారితీయడంతోపాటు, వాణిజ్యపరమైన ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కఠినమైన పర్యవేక్షణ కొనసాగిస్తూనే వేగవంతమైన, పోటీకి హాని చేయని సులభ అనుమతులు అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 16వ వ్యవస్థాపక దినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతారామన్ పాల్గొని మాట్లాడారు.
సమర్థతను పెంచే పోటీని ప్రోత్సహిస్తూ సరళీకరణ స్ఫూర్తిని కాపాడడంలో, ఆవిష్కరణలు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడంలో సీసీఐ కీలక సంస్థగా అవతరించినట్టు మంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ విధానాలు, చట్టాలు, నియంత్రణలు సైతం అవరోధాలుగా మారి పోటీని ప్రభావితం చేయరాదన్నారు. నేటి వేగవంతమైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నియంత్రపరమైన అనుమతుల్లో జాప్యం అనిశ్చితులకు దారితీస్తాయని, సకాలంలో వాణిజ్య కార్యకలాపాలకు అవరోధం కల్పిస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతిమంగా లావాదేవీల ప్రయోజనానికి నష్టం కలిగిస్తాయన్నారు.
‘‘ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు నిర్వహిస్తున్నప్పుడు.. నియంత్రణ సంస్థల చురుకుదనం, సన్నద్ధతను ఇన్వెస్టర్లు గమనిస్తారు’’అని మంత్రి పేర్కొన్నారు. న్యాయపోరాటం, పరిష్కారానికి పట్టే సమయం లేక నియంత్రణ సంస్థలు తక్కువ పారదర్శకంగా ఉండే పరిస్థితుల్లో చర్చలు సంక్లిష్టంగా మారే అవకాశముంటుందన్నారు.
అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందాల కోసం భారత్ చర్చలు నిర్వహిస్తున్న తరుణంలో మంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. స్వేచ్ఛాయుత, పారదర్శక మార్కెట్ కేవలం ఆర్థిక అవసరాల కోసమే కాకుండా, ప్రజాస్వామికంగానూ అవసరమేనన్నారు. ఎగుమతులు, ఇంధన, పర్యావరణ సవాళ్ల మధ్య దేశీ వృద్ధి చోదకాలపై ఎక్కువగా ఆధారపడుతున్నప్పుడు నియంత్రణలు, స్వేచ్ఛ మధ్య సరైన సమతూకం అవసమని అభిప్రాయపడ్డారు.