breaking news
clearances
-
అనుమతులు ఆలస్యం కారాదు: ఆర్థిక మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ: నియంత్రణపరమైన అనుమతుల్లో జాప్యం అనిశ్చితికి దారితీయడంతోపాటు, వాణిజ్యపరమైన ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కఠినమైన పర్యవేక్షణ కొనసాగిస్తూనే వేగవంతమైన, పోటీకి హాని చేయని సులభ అనుమతులు అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 16వ వ్యవస్థాపక దినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతారామన్ పాల్గొని మాట్లాడారు.సమర్థతను పెంచే పోటీని ప్రోత్సహిస్తూ సరళీకరణ స్ఫూర్తిని కాపాడడంలో, ఆవిష్కరణలు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడంలో సీసీఐ కీలక సంస్థగా అవతరించినట్టు మంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ విధానాలు, చట్టాలు, నియంత్రణలు సైతం అవరోధాలుగా మారి పోటీని ప్రభావితం చేయరాదన్నారు. నేటి వేగవంతమైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నియంత్రపరమైన అనుమతుల్లో జాప్యం అనిశ్చితులకు దారితీస్తాయని, సకాలంలో వాణిజ్య కార్యకలాపాలకు అవరోధం కల్పిస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతిమంగా లావాదేవీల ప్రయోజనానికి నష్టం కలిగిస్తాయన్నారు.‘‘ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు నిర్వహిస్తున్నప్పుడు.. నియంత్రణ సంస్థల చురుకుదనం, సన్నద్ధతను ఇన్వెస్టర్లు గమనిస్తారు’’అని మంత్రి పేర్కొన్నారు. న్యాయపోరాటం, పరిష్కారానికి పట్టే సమయం లేక నియంత్రణ సంస్థలు తక్కువ పారదర్శకంగా ఉండే పరిస్థితుల్లో చర్చలు సంక్లిష్టంగా మారే అవకాశముంటుందన్నారు.అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందాల కోసం భారత్ చర్చలు నిర్వహిస్తున్న తరుణంలో మంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. స్వేచ్ఛాయుత, పారదర్శక మార్కెట్ కేవలం ఆర్థిక అవసరాల కోసమే కాకుండా, ప్రజాస్వామికంగానూ అవసరమేనన్నారు. ఎగుమతులు, ఇంధన, పర్యావరణ సవాళ్ల మధ్య దేశీ వృద్ధి చోదకాలపై ఎక్కువగా ఆధారపడుతున్నప్పుడు నియంత్రణలు, స్వేచ్ఛ మధ్య సరైన సమతూకం అవసమని అభిప్రాయపడ్డారు. -
వచ్చే నెలలో ట్రిపుల్ఆర్ టెండర్!
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగురోడ్డు) నిర్మాణానికి కేంద్రం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. దీనికి వీలుగా ఎన్హెచ్ఐఏ ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం టెండర్ డాక్యుమెంటేషన్‌పై దృష్టి సారించింది. వచ్చే నెల మొదటి వారంలో టెండర్లు పిలిచే అవకాశాలున్నాయి. పర్యావరణ అనుమతులు రాకుండానే.. ట్రిపుల్ఆర్ విషయంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగింది. దీంతో భవిష్యత్‌లో మరింత ఆలస్యం జరగకుండా చూడాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. పర్యావరణ అనుమతులు రాకుండా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయటానికి వీలులేదు. కానీ, టెండర్లు పిలిచేందుకు అది అడ్డంకి కాదు. దీంతో పర్యావరణ అనుమతులు వచ్చేలోగా టెండర్లు పిలిచి, పర్యావరణ అనుమతులు వచి్చన తర్వాత టెండర్లు ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. టెండర్లు తెరిచే నాటికి అనుమతులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌వేగా కొత్త నంబర్ జాతీయ రహదారి హోదాలో కేంద్రం ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు చేపడుతోంది. ఉత్తర భాగం విషయంలో ఆ స్పష్టత ఉంది. దక్షిణభాగాన్ని కేంద్రం కాకుండా సొంతంగానే చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తర భాగాన్ని సొంత నిధులతో కేంద్రమే నిర్మిస్తోంది. గతంలో కేవలం జాతీయ రహదారిగా మాత్రమే దాన్ని పరిగణించింది. కానీ, ఇటీవల దాన్ని ఎక్స్‌ప్రెస్‌వే జాబితాలో చేర్చింది. అప్పటి వరకు తాత్కాలికంగా దానికి 161ఏ నంబర్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పుడు అది కాకుండా ఎక్స్‌ప్రెస్‌వేగా కొత్త నంబర్ కేటాయించనున్నారు. ఈ నంబర్ అలాట్ అయిన తర్వాతే ఫారెస్టు క్లియరెన్సు వస్తుంది. ఇప్పటికే ఈ రోడ్డుకు సంబంధించి పబ్లిక్ హియరింగ్స్ ప్రక్రియ పూర్తి చేశారు. పర్యావరణ అనుమతులకు అది కీలకం.రోడ్డు నంబర్ అలాట్ అయిన తర్వాతనే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. త్వరలో ఆ రోడ్డు నంబర్ కేటాయించే అవకాశముంది. పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాతే టెండర్లు తెరవాల్సి ఉంటుంది. ఈ తతంగం పూర్తయ్యే వరకు టెండర్ల కోసం ఎదురు చూడకుండా, ముందు నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు భూపరిహారం పంపిణీకి వీలుగా గ్రామాల వారీ అవార్డులు పాస్ చేసే ప్రక్రియ కూడా నిర్వహించాల్సి ఉంది.ఇది జరగాలంటే పరిహారం నిధులు ఎన్హెచ్ఏఐకి కేటాయించాలి. ఉత్తర భాగం భూసేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం మొత్తాన్ని భరించాల్సి ఉన్నందున, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేయాలి. ఈ ప్రక్రియ కూడా వేగంగా పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. సమాంతరంగా ఈ ఏర్పాట్లు చేస్తూనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. వచ్చేనెల మొదటి వారంలో టెండర్లు పిలిచి నిర్ధారిత గడువులోపు నిర్మాణ సంస్థను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత వీలైనంత తొందరలో పనులు ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. -
ఎయిరిండియా– విస్తారా విలీనం వేగం!
న్యూఢిల్లీ: విమానయాన దిగ్గజాలు ఎయిరిండియా, విస్తారా విలీన ప్రక్రియ వేగమందుకోనుంది. ఇందుకు సింగపూర్ నియంత్రణ సంస్థ కాంపిటీషన్ అండ్ కన్జూమర్ కమిషన్(సీసీసీఎస్) షరతులతోకూడిన అనుమతులు ఇచి్చనట్లు ఎయిరిండియా చీఫ్ క్యాంప్‌బెల్ విల్సన్ తాజాగా పేర్కొన్నారు. దీంతో రెండు సంస్థలూ తమ షెడ్యూళ్లు, కాంట్రాక్టులు తదితర సవివర సమాచారాన్ని ఇచి్చపుచ్చుకునేందుకు అనుమతి లభించినట్లు తెలియజేశారు. 2022 నవంబర్‌లో ఎయిరిండియాలో విస్తారా విలీన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఎయిరిండియాలో 25.1 శాతం వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ సొంతం చేసుకోనుంది. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలసి సంయుక్త సంస్థ(జేవీ)గా విస్తారాను ఏర్పాటు చేసిన విషయం విదితమే. -
పరిశ్రమలకు సకాలంలో అనుమతులు
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): పరిశ్రమలకు అనుమతులను సకాలంలో మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పరిశ్రమల ప్రోత్సాహక కమిటీని ఆదేశించారు. బుధవారం ఆయన తన చాంబర్లో పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. 48 పరిశ్రమల అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించారు. 19 పరిశ్రమలకు రాయితీల విషయమై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ పరిశ్రమల అనుమతులకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. ఈ నెల 22న నాయుడుపేట, 29న ఆత్మకూరులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ముత్తుకూరులో యూఎంపీపీ పవర్‌ప్రాజెక్ట్ నిర్మాణంలో గృహాలు కోల్పోయిన ముగ్గురు నిర్వాసితులు దువ్వూరు సుబ్బరత్నమ్మకు రూ.2,50,793, వెంకటేశ్వర్లు, సంపత్‌కుమార్‌కు ఒక్కొక్కరికి రూ43,050 వంతున చెక్కులు అందజేశారు. ఈ సమావేశంలో డీఈసీ జనరల్ మేనేజర్ వైఎల్ ప్రదీప్‌కుమార్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగేశ్వరరావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఒమ్మిన సుబ్రహ్మణ్యం, కాలుష్య నియంత్రణాధికారి ప్రమోద్‌కుమార్, పరిశ్రమల ఏడీ సురేష్, ఎల్డీఎం వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.