
విజయనగరం మున్సిపాలిటీ: బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేసిన వైఎస్సార్‌సీపీకే ఈ ఎన్నికల్లో తమ మద్దతని బ్రాహ్మణ సేవా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్‌శర్మ తెలిపారు. గురువారం విజయనగరంలోని ఓ హోటల్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి.. ఎన్నికల మేనిఫెస్టోలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఐదేళ్లలో బ్రాహ్మణులకు ఏం చేశారని ఓటేయ్యాలని ప్రశ్నించారు. 1984 టీడీపీ ఆవిర్భావం తరువాత వంశపారపర్య అర్చకత్వాన్ని రద్దు చేశారని పేర్కొన్నారు.
రూ.2,000 కోట్ల ఆస్తులున్న అగ్రిగోల్డ్ సంస్థను దివాలా తీయించిన ఘనత చంద్రబాబుకు, అతని కుమారుడు లోకేష్‌కు దక్కుతుందన్నారు. బతకటానికి ఇబ్బందులు పడుతున్న తొమ్మిది మంది అర్చకులు ఆత్మబలిదానం చేసుకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఒక్కరికైనా ఆర్థిక సాయం చేయలేదన్నారు వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ మతాలు, కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. వైఎస్ జగన్ బ్రాహ్మణులకు కొన్ని స్థానాలు కేటాయించారని ఆ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. సమావేశంలో బ్రాహ్మణ సంఘం నేతలు కె.పి.ఈశ్వర్, భారద్వాజ చక్రవర్తి, చంద్రశేఖర్ శర్మ, మంగిపూడి శివరామయ్య తదితరులు పాల్గొన్నారు.