ఒంటరి పోరు చేటెవరికి?

Why Mayawati broke up with Akhilesh Yadav so soon - Sakshi

అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ కమల వికాసమేనా?

బీజేపీని, ప్రధాని మోదీని ఓడించాలన్న విపక్షాల ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో యూపీలో ఏర్పడిన ‘మహాగఠ్‌ బంధన్‌’లో లుకలుకలు మొదలయ్యాయి. ఆ కూటమి నేతలు ఇప్పుడు తలోదారి వెతుక్కునే పనిలో పడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–బీఎస్పీ–ఆర్‌ఎల్‌డీ కూటమి మొత్తం 80 స్థానాలకు గాను 75 చోట్ల పోటీ చేసి కేవలం 15 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగాయి. దీంతో కూటమిలో ఉంటే అసలుకే ఎసరు వచ్చేలా ఉందని వెంటనే గ్రహించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి తెగదెంపులకు సిద్ధపడగా ఎస్పీ కూడా సరేనంది. దీంతో త్వరలో యూపీలో 11 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉపఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు ఎవరికి వారుగానే బరిలో దిగడం ఖాయమైంది.

ఎస్పీ–బీఎస్పీల మధ్య విభేదాలు
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై ఎస్పీ, బీఎస్పీ పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్నాయి. ఎస్పీకి సంప్రదాయంగా మద్దతునిచ్చే యాదవులు, ముస్లింలు బీఎస్పీ అభ్యర్థులకు ఓటు వేశారని, కానీ బీఎస్పీకి పట్టున్న జాటవ్‌ సామాజికవర్గం ఓట్లు తమకు పడలేదని ఎస్పీ శిబిరం అంటోంది. ఎస్సీల్లో ఒక వర్గమైన జాటవ్‌లు ఎన్నికల ఫలితాల్ని తారుమారు చేసే శక్తి కలిగిన సామాజిక వర్గం. అయితే ఎస్పీ నిందిస్తున్నట్టుగా జరగలేదని ఆ పార్టీకి పట్టున్న కనోజ్, బదౌన్, ఫిరోజాబాద్‌లలో ఎస్పీ ఎందుకు ఓడిపోయిందని బీఎస్పీ ప్రశ్నిస్తోంది. జాటవ్‌ ఓట్లన్నీ ఎస్పీకి పడినా, యాదవులు, ముస్లిం ఓట్లు తమకు కాకుండా బీజేపీకే పోయాయని బీఎస్పీ వాదిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎస్పీ అసమ్మతి నేత, అఖిలేశ్‌ చిన్నాన్న శివపాల్‌ ఎస్పీకి వ్యతిరేకంగా అభ్యర్థుల్ని బరిలోకి దింపడంతో బీజేపీకి లాభించిందని అనుమానిస్తున్నారు.

మాయావతి  వ్యూహం ఏమిటి?
కూటమితో తీవ్రంగా నష్టపోయినట్టుగా భావిస్తున్న మాయావతి పార్టీని సంస్థాగతంగా పటిష్టం  చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకోసం భాయ్‌చారా కమిటీలు (సౌభ్రాతృత్వ కమిటీలు) పునరుద్ధరించనున్నారు. వచ్చే ఉప ఎన్నికలతో పాటుగా, 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఎస్పీ కంటే బీఎస్పీకే సీట్లతో పాటు ఓట్ల శాతం కూడా పెరిగింది. దీన్ని బట్టి బీఎస్పీ ఓట్లేవీ ఎస్పీకి పడలేదని అర్థం అవుతోంది. ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ వంటి పార్టీలు యూపీకే ఎక్కువగా పరిమితం కాగా  బీఎస్పీ పంజాబ్, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో బలంగా కూడా ఉంది. క్లిష్ట సమయాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించే రాజకీయ నాయకురాలైన మాయావతి కూటమికి ముందే గుడ్‌బై చెప్పారు.

బీజేపీకి ఎంతవరకు లాభం?
యూపీలో రాజకీయ పరిణామాలన్నీ అంతిమంగా బీజేపీకి లాభం చేకూర్చేలా ఉన్నాయి. బీఎస్పీ, ఎస్పీ వంటి బలమైన ప్రాంతీయ పక్షాలు, చిరకాల ప్రత్యర్థులు చేతులు కలిపినా పై చేయి సాధించకపోవడానికి ఆ పార్టీల్లో అంతర్గత కలహాలే కారణమని భావిస్తున్నారు. ఎస్పీ కుటుంబ కలహాలతో చితికిపోయింది. ఎస్పీ, బీఎస్పీలది అవకాశవాద పొత్తు అంటూ బీజేపీ చేసిన ప్రచారం లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి లబ్ధి చేకూరిస్తే, వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగితే అగ్రవర్ణాలు, యాదవేతర బీసీలు, జాటవేతర దళితులు ఒక బలమైన శక్తిగా రూపొందుతారు. దీంతో సమీప భవిష్యత్‌లో బీజేపీకి ఎదురు ఉండదనే అభిప్రాయం వినిపిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top